ప్రశ్నిస్తే ఐటీ దాడులు చేస్తారా…..రమేష్
Spread the love

తన ఇళ్లు, కార్యాలయాలపై జరిగిన ఐటీ దాడులపై టీడీపీ నేత, ఎంపీ సీఎం రమేశ్ ఘాటుగా స్పందించారు. అవిశ్వాసం రోజున ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయంపై గట్టిగా నిలదీసినందుకే ప్రధాని మాపై కక్ష గట్టారన్నారు, సభలో చర్చ సందర్భంగా లేచి మాట్లాడుతున్న టీడీపీ ఎంపీలను ఉద్దేశించి ‘‘వస్తున్నా వస్తున్నా మీ దగ్గరికే వస్తున్నా మీ అంతు చూస్తాను ’’ అని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారని రమేశ్ గుర్తు చేశారు . హైదరాబాద్, కడప జిల్లాలోని ఆయన నివాసాలపై ఈ దాడులు ఏకకాలంలో కొనసాగాయి. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోను, హైదరాబాద్ లోని నివాసాల్లోను ఈ సోదాలు, తనిఖీలు జరిగాయి. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు దాదాపు 60 మంది ఐటీ అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఇటీవలే ఏపీలో టీడీపీ నేతల కార్యాలయాలు, వారి ఆస్తులపై జరిగిన ఐటీ దాడుల విషయం మరవకముందే రమేష్ నివాసాలపై ఈ దాడులు జరగడం సంచలనంగా మారింది.

కేంద్ర పీఏసీ  సభ్యుడిగా ఉన్న రమేష్ ఈ హోదాల దేశంలో ఐటీ దాడులు ఎందుకు చేస్తున్నారో వివరాలు ఇవ్వాలంటూ  ఐటీ శాఖకు నోటీసులు పంపారు. ఈ నోటీసులు అందిన మూడు రోజుల్లోనే ఈ దాడులు జరగడం గమనార్హం.  కాగా  ఈ దాడులపై స్పందించిన రమేష్ కేంద్రాన్ని ప్రశ్నించడం వల్లే  ఈ దాడులు జరుగుతున్నాయా అని అనుమానాలు వ్యక్తం  చేశారు. ఇదంతా కక్ష సాదింపేనని, ప్రశ్నిస్తున్నాను కాబట్టే ఈ దాడులు అని అన్నారు. టీడీపీలో ఉండటమే నేరమా అని ప్రశ్నించిన ఆయన కడపజిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఎర్పాటుకు తాను పట్టుబట్టిన కారణంగానే ఈ దాడులని దుయ్యబట్టారు. ఆ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం రమేష్ ఆమరణ దీక్ష చేసిన సంగతి తెలిసిందే.