ముంబై మరణఖాండకు  పదేళ్లు !!
Spread the love

ఆ సంఘఠనకు పదేళ్లు , ముంబై పీడకలకు పదేళ్లు. దేశ ఆర్థిక రాజధానిని తూటాల వర్షంతో చిన్నాభిన్నం చేసిన ఉగ్ర విధ్వంసం జరిగి దశాబ్దం గడిచింది. దేశ భద్రతకు సవాలుగా నిలిచిన పాకిస్తాన్‌ ఉగ్ర కుట్ర జరిగి పదేళ్లయింది. నేటికి సరిగ్గా పదేళ్ల కిత్రం ముంబైపై ఆధునిక ఆయుధాలతో విరుచుకుపడిన 12 మంది లష్కరే రాక్షసుల బారిన పడి 166 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్‌లో ఐఎస్‌ఐ ఆధ్వర్యంలో ఆధునిక శిక్షణ పొందిన ఆ ఉగ్రవాదులను మట్టుపెట్టే క్రమంలో సందీప్‌ ఉన్నికృష్ణన్, హేమంత్‌ కర్కరే, విజయ్‌ సలాస్కర్, అశోక్‌ కామ్టే తదితర సాహస అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ దుర్ఘటనకు పదేళ్లయిన సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు..

26/11 అంతటి తీవ్ర దాడులు భారత్‌పై మరోసారి జరిగితే భారత్, పాక్‌ల మధ్య ప్రాంతీయ యుద్ధం సంభవించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. 2008 నవంబర్‌ 26న 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబైలో మారణహోమం సృష్టించి 166 మందిని పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. ఈ దాడికి సూత్రధారి అయిన హఫీజ్‌ సయీద్‌ పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడనీ, దాడికి కారకులను శిక్షిస్తామని ఇచ్చిన మాటను పాక్‌ నిలబెట్టుకోలేదని వారు పేర్కొన్నారు.

అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ సీఐఏ (సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ) మాజీ అధికారి బ్రూస్‌ రీడెల్‌ మాట్లాడుతూ ‘26/11 దాడి సూత్రధారులకు శిక్ష పడటాన్ని బాధిత కుటుంబాలు ఇంకా చూడాల్సి ఉంది. అయితే పాకిస్తాన్‌ వైఖరి చూస్తుంటే ఇది దాదాపుగా అసాధ్యమనిపిస్తోంది. ఇంతటి తీవ్రమైన దాడి మరోసారి జరిగితే ఇక యుద్ధం అనివార్యం కావొచ్చు’ అని అభిప్రాయ పడ్డారు. దాడుల సమయంలో అమెరికాలో పాక్‌ రాయబారిగా పనిచేసిన హుస్సేన్‌ హక్కానీ మాట్లాడుతూ ‘ఇంకో దాడి జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. అయితే 26/11 దాడుల సూత్రధారులను శిక్షిస్తామన్న తమ హామీని పాక్‌ నిలబెట్టుకోవాలి. కానీ వారందరినీ పాక్‌ వదిలేసింది. అందరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అంటే భారత్‌పై ఉగ్రదాడికి పాల్పడిన వారిని తాము ఉపేక్షిస్తామని పాక్‌ పరోక్షంగా చెబుతోంది’ అని అన్నారు. దాడుల సమయంలో అమెరికా జాతీయ భద్రతా మండలి దక్షిణాసియా విభాగ డైరెక్టర్‌గా ఉన్న అనీశ్‌ గోయెల్‌ మాట్లాడుతూ ‘భారత్‌–పాక్‌ల యుద్ధాన్ని నివారించడమే నాడు మా ప్రధాన లక్ష్యం. నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్‌ బుష్, నాటి భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ఫోన్‌ చేసి సంయమనం పాటించాలని కోరారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఓ దశలో పాక్‌పై భారత్‌ యుద్ధానికి దిగుతుందని కూడా నాడు అనిపించింది’ అని తెలియజేసారు.