ఇక తెలంగాణలో చంద్రబాబు, లోకేశ్‌లు తిరగరు
Spread the love

2019 సంవత్సరం పార్టీకి కీలకమని, పదహారు ఎంపీ సీట్లు గెలవడం లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని చెప్పారు. టీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలంతా కృషిచేయాలని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో పార్టీకి దూరమైన వారిని మళ్లీ దగ్గరకు తెచ్చుకుందామని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పలుచోట్ల మెజార్టీ తగ్గడం వ్యక్తిగతంగా బాధ కలిగించిందని, ఇందుకు ఓట్ల గల్లంతు కూడా కారణమని తెలిపారు. బుధవారం సనత్‌నగర్‌ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌లో నిర్వహించారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన వారు గెలిచిన పరిస్థితి లేదన్నారు. ఇందిరాగాంధీ, వాజ్‌పేయీ, ఎన్టీఆర్‌, చంద్రబాబు ముందస్తుగా సభలను రద్దుచేసి ఎన్నికలకు వెళ్లిన సందర్భాల్లో చేదు అనుభవం ఎదురైందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సెప్టెంబరు 6న అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి గంటల వ్యవధిలోనే 105 మందిని అభ్యర్థులుగా ప్రకటించి సంచలనం సృష్టించారన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఓటరు నమోదులో తప్పిదాలు, లోపాల కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని తెలిపారు. ఓటరు నమోదులో కార్యకర్తలు, నాయకులు క్రియాశీలకంగా ఉంటే పార్టీ అభ్యర్థులకు మరింత మెజార్టీ వచ్చేదని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇలాంటివి పునరావృతం కాకుం డా జనవరి 25 వరకు జరిగే ఓటర్ల నమోదును విస్తృతంగా చేపట్టాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో 12వేల చొప్పున ఓటరు ఎన్‌రోల్‌మెంట్ ఫారాలను అందించామని, పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ఓటరు నమోదు కార్యక్రమాన్ని సవాల్‌గా తీసుకుని పనిచేయాలని అన్నారు. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో డివిజన్లు, బూత్‌లవారీగా పోలైన ఓట్లు పరిశీలించి.. ప్రస్తుత ఓటర్ల జాబితాను సమీక్షించుకోవాలని సూచించారు.