సెప్టెంబరు నెలలో దేశానికి రఫేల్‌
Spread the love

రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు సంబంధించి  ఈరోజు లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌ విమానాల కొనుగోలుకు సంబంధించి వివరణ ఇచ్చారు. భారత్‌ కొనుగోలు చేసిన మొదటి రఫేల్‌ యుద్ధ విమానం 2019 సెప్టెంబరు నెలలో దేశానికి వస్తుందని, మిగిలిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు 2022 నాటి కల్లా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారం పూర్తవడానికి 14నెలల సమయం పట్టిందన్నారు. డిఫెన్స్‌ డీలింగ్స్‌కు.. డీలింగ్‌ ఇన్‌ డిఫెన్స్‌కు తేడా ఉందని వ్యాఖ్యానించారు. తాము డిఫెన్స్‌ డీలింగ్స్‌ చేయమని అన్నారు. దేశ భద్రతను, ప్రాధాన్యాలను దృష్టిలో పెట్టుకునే ఒప్పందాలు చేసుకుంటామని అన్నారు.

పొరుగుదేశాలైన చైనా, పాకిస్థాన్‌లు రక్షణ సంబంధ విషయాల్లో దూకుడుగా ఉంటే, అప్పట్లో యూపీఏ ప్రభుత్వం కేవలం 18 యుద్ధవిమానాలను మాత్రమే కొనుగోలు చేసి, భారత్‌ను ఎటూ కదల్లేని స్థితికి తెచ్చిందని ఆరోపించారు. ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో తగిన సామగ్రిని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే దీన్ని అత్యవసరంగా గుర్తించామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో నిర్మలా సీతారామన్‌ వారికి గట్టిగానే చురకలంటించారు. తన సమాధానం వినేందుకు కూడా ప్రతిపక్ష సభ్యులు ఆసక్తి చూపడం లేదని విమర్శించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, యుద్ధ విమానాల కొనుగోలు దేశ భద్రతకు సంబంధించిన విషయమని అందరు గుర్తుంచుకోవాలన్నారు. ‘ఏ ఏ(అనిల్‌ అంబానీని ఉద్దేశిస్తూ)’ కోసమే యుద్ధ విమానాల కొనుగోలు చేశామని కాంగ్రెస్‌ భావిస్తే, ప్రతి ‘ఏఏ’ వెనుక ఒక ‘క్యూ(ఖత్రోకీని ఉద్దేశిస్తూ)’, ‘ఆర్‌వి(రాబర్ట్‌ వాద్రాను ఉద్దేశిస్తూ)’ ఉన్నారంటూ నిర్మలా సీతారామన్‌ విమర్శించారు.