కర్ణాటకలో ఇప్పుడు అందరి కళ్లూ గవర్నర్‌పైనే
Spread the love

కర్ణాటకలో రాజకీయ రంగులరాట్నం ఇంకా తిరుగుతూనే ఉంది. మంగళవారం మధ్యాహ్నం మొదలైన ఆట.. బుధవారం కూడా కొనసాగుతూనే ఉంది. ఇవాళ బీజేపీ శాసనసభా పక్షం బెంగళూరులో సమావేశం కానుంది. ఈ సమావేశానికి  కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, ధర్మేంద్రప్రదాన్, జేపీ నడ్డాలు పరిశీలకులుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప మాట్లాడుతూ.. శాసనసభా పక్షం సమావేశం అనంతరం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు విజ్ఞప్తి చేస్తామని తెలిపారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ వాతావరణం నెలకొంది. 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ, 37 సీట్లతో తృతీయ పార్టీగా అవతరించిన జేడీఎస్‌ పార్టీలు వేర్వేరుగా రాష్ట్ర గవర్నర్‌ విజుభాయ్‌ రుడాభాయ్‌ వాలాను కలుసుకొని ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరాయి. తమకు జేడీఎస్‌లోని 12మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప గవర్నర్‌ ముందు ప్రకటించుకున్నారు. ఇక జేడీఎస్‌ నాయకుడు కుమారస్వామి తమ పార్టీలో ఎలాంటి చీలికలు లేవని, తమకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇస్తోందని, తమకే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

ఈ క్రమంలో ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిందీ గవర్నరే. ఆయన విధుల్లో జోక్యం చేసుకునే అధికారం రాజ్యాంగంలోని 361 అధికరణం కింద కోర్టులకు లేవు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టే 1952లో మొదటిసారి స్పష్టం చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గవర్నర్‌ విధులను నిర్దేశిస్తున్న రాజ్యాంగ అధికరణం, సుప్రీంకోర్టు తీర్పు యథాతథంగా వర్తిస్తోంది. అయితే కోర్టులు గవర్నర్‌ తీసుకున్న నిర్ణయాలపై తమ అభిప్రాయలను వ్యక్తం చేయవచ్చు. హంగ్‌ అసెంబ్లీ ఏర్పడిన సందర్భాల్లో ఎన్నికలకు ముందే ఏర్పడిన కూటమికి అతిపెద్ద పార్టీగా అవిర్భవించిన పార్టీకన్నా ఎక్కువ సీట్లు వస్తే, ఆ కూటమికే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని పలు సుప్రీంకోర్టు తీర్పులు సూచిస్తున్నాయి. అలాలేని సందర్భాల్లో అతిపెద్ద పార్టీని ఆహ్వానించడమే సమంజసమని, అయితే తుది నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్‌దేనని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

1989లో లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పుడు అప్పటి ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి అయిన రాజీవ్‌ గాంధీని అప్పటి రాష్ట్రపతి ఆర్‌. వెంకట్రామన్‌ ప్రభుత్వం ఏర్పాటుకు అహ్వానించారు. 1996లో లోక్‌సభలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పుడు అప్పటి రాష్ట్రపతి శంకర్‌ దయాళ శర్మ ప్రభుత్వం ఏర్పాటుకు అటల్‌ బిహారి వాజ్‌పేయిని ఆహ్వానించారు. అయితే, ఇంతకుముందు పరిణామాలు బీజేపీని ప్రశ్నించే పరిస్థితిని తెచ్చిపెట్టాయి.

గోవాలో 17 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ పార్టీని కాదని, ఎన్నికల అనంతరం ఇతర పార్టీ సభ్యుల మద్దతు తమకే ఎక్కువగా ఉన్నందున తమకే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని బీజేపీ కోరింది. బీజేపీకి ఆ ఎన్నికల్లో 13 సీట్లే వచ్చాయి. అంతేగాక, గత సంవత్సరం జరిగిన మణిపూర్‌ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. కాంగ్రెస్‌ పార్టీకి 28 సీట్లురాగా, బీజేపీకి 21 సీట్లు వచ్చాయి. అప్పుడు గవర్నర్‌గా ఉన్న నజ్మా హెప్తుల్లా నేరుగా ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించారు.