ప్రైవసీకి భంగం కల్గిస్తున్న గూగుల్‌
Spread the love

లొకేషన్‌ హిస్టరీని ఆఫ్‌ చేసినప్పటికీ గూగుల్‌ సర్వీసెస్‌ మన కదలికలను ట్రాక్‌ చేస్తోందంటూ కాలిఫోర్నియాకు చెందిన వ్యక్తి ఆ కంపెనీపై కోర్టులో శుక్రవారం కేసు వేశాడు. అనుమతి లేకుండానే తమ కదలికలను నిక్షిప్తం చేస్తూ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందంటూ గూగుల్‌ను శాన్‌ఫ్రాన్సిస్కో ఫెడరల్‌ కోర్టుకీడ్చాడో వ్యక్తి. అమెరికాలో ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు తమ కదలికలను రికార్డు చేయొద్దని గూగుల్‌ సెట్టింగ్స్‌లో లొకేషన్‌ హిస్టరీని ఆఫ్‌ చేసినప్పటికీ అవి సమాచారాన్ని రికార్డు చేస్తున్నాయని అతను ఆరోపించాడు. తాము ఎక్కడికి వెళ్తున్నాం ఏ మార్గంలో వెళ్తున్నాం లాంటి వ్యక్తిగత సమాచారాన్ని నిక్షిప్తం చేయకుండా ఉండేందుకు సెట్టింగ్స్‌లో లొకేషన్‌ హిస్టరీని ఆఫ్‌ చేసుకోవచ్చని గూగుల్‌ తన సపోర్ట్‌ పేజీలో తెలిపిందని అయితే అలా ఆఫ్‌ చేసినప్పటికీ గూగుల్‌ ఆ వివరాలను ట్రాకింగ్‌ చేస్తోందని, దీనిపై గూగుల్‌ చెప్పిందంతా అబద్ధమని తన దావాలో పేర్కొన్నాడు. ప్రైవసీ చట్టాన్ని గూగుల్‌ ఉల్లంఘించిందని.. గత వారం యూనివర్సిటీ పరిశోధకులు కూడా దీన్ని నిరూపించారని కోర్టుకు వివరించాడు.అయితే ఈ దావాపై స్పందించేందుకు గూగుల్‌ నిరాకరించింది. మరోవైపు ప్రైవసీ పాలసీకి సంబంధించి 2011 నాటి ఉత్తర్వులను గూగుల్‌ ఉల్లంఘించిందా అనే విషయాన్ని పరిశీలించాలని ది ఎలక్ట్రానిక్‌ ప్రైవసీ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ అనే సంస్థ కూడా అమెరికా ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌కు లేఖ రాసింది.