జనరల్‌ కేటగిరీలో ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు శుభవార్త
Spread the love

వరంగల్‌కు చెందిన రేవంత్‌ అనుకోకుండా హైదరాబాద్‌కు బయలుదేరాడు. టికెట్‌ కోసం రైల్వే స్టేషన్‌లోని బుకింగ్‌ కౌంటర్‌కు వెళ్తే రద్దీ ఎక్కువగా ఉండటంతో అప్పటికే కదులుతున్న రైలెక్కాడు. టిక్కెట్‌ లేకుండా రైలెక్కావంటూ టీసీ జరిమానా విధించారు. ఇలాంటి సంఘటనలు ప్రతీరోజు కోకొళ్లలు. ఇకనుంచి ఇలాంటి బాధలు తప్పబోతున్నాయి. ఇందుకోసం రైల్వే శాఖ ఒక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనిద్వారా ఇంటినుంచే జనరల్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు.

జనరల్‌ కేటగిరీలో ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఇకనుంచి వీరు హడావుడిగా స్టేషన్‌కు వెళ్లి భారీ క్యూలైన్‌లో నిలబడి టెన్షన్‌టెన్షన్‌తో టికెట్‌ తీసుకొని తీరా లోపలికి వెళితే రైలు ఉందా.. పోయిందా అనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తాపీగా ఇంటినుంచే టికెట్‌ బుక్‌ చేసుకొని ప్రశాంతంగా బయలుదేరవచ్చు. కాకపోతే వారి వద్ద స్మార్ట్‌ఫోన్‌ ఉండాలి. రెండో తరగతి రైల్వే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ సరికొత్త యాప్‌ తీసుకువచ్చింది. సహజంగా ముందుగానే టిక్కెట్‌లు రిజర్వేషన్‌ చేయుంచుకునేందుకు రైల్వే బుకింగ్‌ కేంద్రాలు, మెబైల్‌ యాప్‌లు ఉన్నాయి. కాని రిజర్వేషన్‌ అవసరం లేని టికెట్‌లు మాత్రం నేరుగా రైల్వే స్టేషన్‌కు వెళ్లి తీసుకోవాల్సి వచ్చేది. దీని వల్ల ఇబ్బందులు అంతా ఇంతా కావు. సమయం వృథా అయ్యేది. క్యూలో గంటల తరబడి నిలబడాల్సి వచ్చేది. ఇకపై ఇలాంటి సమస్యలు ఉండవు. ఎంచక్కా యాప్‌లోనే నేరుగా టిక్కెట్‌లు పొందవచ్చు.

యూటీఎస్‌ (అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్‌ సర్వీస్‌) ఆన్‌ మెబైల్‌ రిజర్వేషన్‌ అవసరం లేని ప్రయాణికుల కోసం ఈ సరికొత్త యాప్‌ తీసుకొచ్చారు. టికెట్‌లు తీసుకోవడమే కాదు అవసరమైతే రద్దు కూడా చేసుకోవ చ్చు. అంతేగాకుండా ప్రయాణానికి గంట ముందే టికెట్‌లు తీసుకోవచ్చు. అయితే ప్రయాణికులు రిజర్వేషన్‌ చేసుకోవడానికి ముందే నగదును రైల్వే వ్యాలెట్‌లో జమ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారానే చెల్లింపులు జరిగి టికెట్‌ ఖరారు అవుతుంది.

మెదటగా (ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కార్పోరేషన్‌) ఐఆర్‌సీటీసీలో మనం ఒక అకౌంట్‌ను క్రియేట్‌ చేసుకోవాలి. ఈ అకౌంట్‌లో నంబర్‌లో రూ. వెయ్యి నుంచి రూ.10 వేల వరకు నగదు జమచేసుకోవచ్చు. దీంట్లో నెట్‌బ్యాంకింగ్‌, డెబిట్‌ కార్డుద్వారా మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న నగదు మనం కొనుగోలు చేసే సాధారణ టికెట్‌కు ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. ఇంతకు ముందు ఈ ఐఆర్‌సీటీసీ అకౌంట్‌ ఫస్ట్‌క్లాస్‌ టికెట్‌, రిజర్వేషన్‌కు మాత్రమే ఉండేది. ఇప్పుడు జనరల్‌ టిక్కెట్‌ కూడా అవకాశం కల్పించారు.

  • మొదట గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి యూటిఎస్‌ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి
  • తరువాత మీపేరు, జనన తేది, మెబైల్‌ నంబర్‌తో రిజిస్టర్‌ చేసుకుంటే యూజర్‌ ఐడి, పాస్‌ వర్డ్‌ వస్తుంది.
  • యూజర్‌ ఐడి, పాస్‌ వర్డ్‌ను ఉపయోగించి యాప్‌లో ప్రవేశించవచ్చు
  • అప్పటికే ఐఆర్‌సీటీసీ వ్యాలెట్‌లో నగదు బ్యాలెన్స్‌ ఉంచుకోవాలి
  • ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో వివరాలు నమోదు చేసి నేరుగా ఐఆర్‌సిటిసీ వ్యాలెట్‌ ద్వారా చెల్లింపులు చేయవచ్చు
  • యాప్‌ ద్వారా మనం తీసుకున్న టికెట్‌ కాపీ ప్రింట్‌ను తీసుకెళ్లవచ్చు. అలా వీలుకాకపోయినా తనిఖీ అధికారి వచ్చినప్పుడు యాప్‌లో టికెట్‌ ఆప్షన్‌ నేరుగా చూపించినా సరిపోతుంది.