ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు
Spread the love

ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోందని హైదరాబాద్‌ జిల్లా హెచ్‌పీ గ్యాస్‌ నోడల్‌ అధికారి తరుణ్‌ కుమార్‌ అన్నారు. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 90.92 లక్షల గృహాలు ఉండగా.. ఇప్పటికే మూడు చమురు సంస్థలు కోటికి పైగా గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చి వందకు 110 శాతం లక్ష్యాన్ని సాధించాయి. కొందరు రెండు, మూడు కనెక్షన్లు కూడా తీసుకోవడం వల్లే కనెక్షన్ల కుటుంబాల కంటే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు వివరించారు. పట్టణాలు, నగరాలు కలిగిన జిల్లాల్లో నిర్దేశించిన సంఖ్య కంటే ఎక్కువగా కనెక్షన్లు ఉండగా..  గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండే జిల్లాల్లో కనెక్షన్ల సంఖ్య చాలా తక్కువగా ఉన్నాది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ భాగం కుటుంబాలు వంటచెరకుపై ఆధారపడ్డాయని చమురు సంస్థలు అంచనా వేస్తున్నాయి. గ్యాస్‌ ధరను భారంగా భావించి ముందుకు రావడంలేదని అధికారులు భావిస్తున్నారు.

హైదరాబాద్‌లోని  సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రేటర్‌ ఎల్‌పీజీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అశోక్‌కుమార్‌, కార్యదర్శి రాజేందర్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ జిల్లాలో 935 కనెక్షన్లు ఇచ్చామన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యువజన కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ 18002666696, జనరల్‌ టోల్‌ఫ్రీ నంబరు (గ్యాస్‌ సబ్సిడీ రాకపోవడం, తదితర ఫిర్యాదు చేయడానికి) 18002333555కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చన్నారు. హైదరాబాద్‌ జిల్లాకు సంబంధించి ఇబ్బందులు ఉంటే (తరుణ్‌కుమార్‌- 9550633999)కు చేయొచ్చన్నారు.