డీఎస్సీ-2018 నోటిఫికేషన్‌ రేపు విడుదల కానట్టే
Spread the love

డీఎస్సీ-2018 నోటిఫికేషన్‌ వాయిదా పడింది. ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల 10న నోటిఫికేషన్‌ విడుదల కావాల్సి ఉన్నా… ఆచరణకు అవసరమైన లాంఛనాలు ఇంకా పూర్తి కాకపోవడంతో వాయిదా అనివార్యంగా మారింది. ఎన్ని పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీచేయాలి, విద్యాశాఖతో పాటు ఏయే శాఖలకు చెందిన ఖాళీలను ఇందులో కలపాలి, ఏ విధానంలో డీఎస్సీ నిర్వహించాలనే అంశాలపై స్పష్టత రాకపోవడంతో పాఠశాల విద్యా కమిషనరేట్‌ ఇంకా తుది షెడ్యూల్‌ను రూపొందించలేదు. వివిధ అంశాలపై స్పష్టత వచ్చాక ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉన్నాది. పాఠశాల విద్యాశాఖకు చెందిన పోస్టులకు రోస్టర్‌ సిద్ధమైనప్పటికీ ఇతర శాఖల నుంచి రావాలి. మున్సిపల్‌ శాఖ ఇప్పటికే రోస్టర్‌ ఇచ్చి తమ పోస్టులను కూడా ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయాలని కోరింది.

కానీ ఇప్పుడు మున్సిపల్‌ పాఠశాలల్లో పనిచేస్తోన్న టీచర్లకు బదిలీలు నిర్వహించాలన్న ప్రతిపాదన తెరపైకి రావడంతో సాంకేతికపరమైన సమస్య తలెత్తే పరిస్థితి నెలకొంది. బీసీ సంక్షేమశాఖ తమ పరిధిలోని పోస్టుల భర్తీకి సంసిద్ధత తెలిపినా ఇంకా రోస్టర్‌ పూర్తిచేసి పంపాల్సి ఉన్నాది. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల నుంచి టీచర్‌ పోస్టుల భర్తీపై బుధవారానికిగానీ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నాది. వాళ్లు అంగీకరించినా ఆయా పోస్టులకు రోస్టర్‌ చేసి పంపాల్సి ఉన్నాది. పీఈటీ పోస్టులను పెంచాలన్న డిమాండ్లపైనా విద్యాశాఖలో తర్జనభర్జన జరుగుతోంది. గతంలో 1056 పీఈటీ ఖాళీలు ఉన్నట్లు చెప్పి ఆర్థికశాఖకు ప్రతిపాదించగా కేవలం 47 పోస్టుల భర్తీకే అనుమతించడంపై సంబంధిత అర్హతలున్న నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మరో 300 పీఈటీ పోస్టులనైనా పెంచే విధంగా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. టెట్‌ కమ్‌ టీఆర్టీ, టీఆర్టీ నిర్వహణకు సంబంధించి గతంలో పాఠశాల విద్యాశాఖ పంపిన ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్‌ లభించలేదు. డీఎస్సీ-2018 నోటిఫికేషన్‌ కు ముందస్తుగా పూర్తిచేయాల్సిన లాంఛనాలపై నిర్ణయాలు తీసుకోకపోవడంతో అనిశ్చితి ఏర్పడింది. డీఎస్సీ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పినా… ఈ అంశంపైనా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో డీఎస్సీ-2018 నోటిఫికేషన్‌ తేదీనే కాదు… షెడ్యూల్‌ కూడా మారనుంది.