దీపావళి పండుగ పూట దంపతులను బలిగొన్న షేర్‌ మార్కెట్‌
Spread the love

పెద్దలు కుదిర్చిన వివాహంతో ఒక్కటయ్యారు.. ఇద్దరూ కలిసి ఒకేచోట ఉద్యోగం చేస్తున్నారు.. సుఖసంతోషాల సంసారానికి కానుకగా వీరికి ఓ పాప తోడైంది… ఇలా చక్కగా సాగుతున్న తరుణంలో.. జీతంతో తృప్తిచెందక భర్త షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాడు.. క్రమేణా అది వ్యసనంగా మారి చివరికి దంపతులిద్దరి ఆత్మహత్యకు దారితీసింది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లో కూకట్‌పల్లిలో జరిగింది. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన బాపయ్య చౌదరి-శిరీష దంపతులు గచ్చిబౌలిలో ఉద్యోగం చేస్తున్నారు. వీరి పాప పద్మప్రియ(3) శిరీష తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించాలనే ఆశతో బాపయ్య షేర్‌మార్కెట్‌లో పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టాడు. భారీ నష్టం రావడంతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.

ఈ క్రమంలో పెండ్లి సమయంలో ఇచ్చిన ఆస్తులను భర్త విక్రయించాడని శిరీశకు తెలిసింది. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె బుధవారం నాడు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. విషయం తెలుసుకున్న మృతురాలి సోదరుడు ..బావకు విషయం చెప్పాడు. దాంతో తీవ్ర ఆవేదనకు గురైన బాపయ్య సైతం గురువారం ఉదయం సనత్‌నగర్ రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. మృతురాలి సోదరుడు కృష్ణ చైతన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.