ఇవాళ కేరళలో బంద్
Spread the love

శబరిమల పరిరక్షణ సమితి పిలుపు ఇవాళ కేరళలో బంద్ కొనసాగుతుంది. నిన్న అయ్యప్పను మహిళలు దర్శించుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. శబరిమలలో మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. బంద్ సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరువైపుల బారీ సంఖ్యలో‌ పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దాంతో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు.  కేరళ వైపు వెళ్లే బస్సులను కోయంబత్తూరు, నాగర్ కోయిల్ లొనే నిలిపివేయటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  కేరళలో బంద్ ప్రబావం తీవ్రంగా ఉండటంతో ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయోనన్న ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి.

బంద్‌ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు యూనివర్శిటీలు పరీక్షలు వాయిదా వేశాయి. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్టీసీ) కేరళకు బస్సు సర్వీసులను నిలిపివేసింది. బంద్‌ సందర్భంగా జనజీవనం స్తంభించింది. మరోవైపు ఆందోళనల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.