సంక్రాంతి తర్వాత జిల్లా  కార్యాలయాలకు శంకుస్థాపనలు
Spread the love

తెలంగాణ రాష్ట్ర సమితిని బలోపేతం చేసేందుకు ఆరు నెలల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. త్వరలోనే అన్నిస్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఎంపికలు జరుగుతాయని, పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ఆమోదంతో అవి అమలులోకి వస్తాయన్నారు. కొత్త ఓటర్ల నమోదులో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ప్రధానంగా ఓటర్ల నమోదు, కొత్త జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు, పంచాయతీ ఎన్నికలపై చర్చించారు. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. అర్హులందరికీ ఓటుహక్కు కల్పించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జనవరి 25 వరకు కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటర్ల నమోదుపై ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. గత ఎన్నికల్లో ఓటుహక్కు పొందలేకపోయినవారిని గుర్తించి వారందరికీ ఓటుహక్కు కల్పించాలని సూచించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఓటరు నమోదుపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని కోరారు.