హైదరాబాద్‌లో 2 రోజుల్లో రెచ్చిపోయిన చైన్‌ స్నాచర్లు
Spread the love

అంతర్రాష్ట్ర ముఠాల ముట్టడి ఆగిపోయిందని సంబరపడిన పోలీసులకు సవాల్‌ విసురుతూ రెండు రోజుల వ్యవధిలో తొమ్మిది చోరీలకు పాల్పడ్డారు. బుధవారం నాడు సాయంత్రం గంట వ్యవధిలో వరుసగా మీర్‌పేట, వనస్థలిపురం, హయత్‌నగర్‌, ఎల్‌బీనగర్‌ల్లో అయిదుగురు మహిళల మెడల్లో నుంచి గొలుసులు తెంపుకెళ్లిన దుండగులు.. గురువారం తెల్లవారుతూనే మరోసారి విరుచుకుపడ్డారు. ఉదయం 7 గంటలకు చైతన్యపురిలో చోరీల పరంపరను మొదలుపెట్టి 40 నిమిషాల వ్యవధిలో వనస్థలిపురం, హయత్‌నగర్‌లలో నలుగురు మహిళల నుంచి దాదాపు 12.5 తులాల ఆభరణాల్ని లాక్కెళ్లారు.

వనస్థలిపురం, ఎల్బీనగర్, మీర్‌పేట, హయత్‌నగర్‌ ఠాణాల పరిధుల్లో గొలుసు దొంగలు ఐదు చోట్ల 19 తులాలకు పైగా బంగారు నగలు అపహరించుకపోయిన  స్నాచర్లు గురువారం ఉదయం 7 నుంచి 7.40 లోపు చైతన్యపురి, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో నాలుగు చోరీలకు పాల్పడ్డారు. ఇందులో 13 తులాల బంగారు ఆభరణాలు లాక్కెళ్లారు. బుధ, గురువారాల్లో మొత్తం 32 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు.

అబ్దుల్లాపూర్‌మెట్‌ నుంచి చైతన్యపురికి గురువారం ఉదయం 6.45 గంటలకు చేరుకున్న చైన్‌స్నాచర్లు టెలిఫోన్‌కాలనీ రోడ్‌ నెం.3లో ఉదయం 7 గంటలకు ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న ఈశ్వరి(40) మెడలోని ఐదు తులాల పుస్తెలతాడును తెంపబోతుండగా ప్రతిఘటించింది. దాంతో చేతికి వచ్చిన సగం గొలుసుతో స్నాచర్లు పరారయ్యారు. వెంటనే వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ సహారారోడ్డులోని ఇందిరానగర్‌ కాలనీ వాసి ధనలక్ష్మి(46)  ఉదయం మార్నింగ్‌ వాక్‌కు వెళ్లి వస్తుండగా ఎంఈ రెడ్డి ఫంక్షన్‌హాల్‌ వద్ద ఆమె మెడలోని నాలుగు తులాల పుస్తెల తాడును తెంచుకుని పారిపోయారు.