రేపు, ఎల్లుండి బ్యాంకులు బంద్
Spread the love

దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల బంద్ కు పిలుపునిచ్చారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కేవలం 2శాతమే వేతన పెంపును ఆఫర్ చేయడాన్ని నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు తాజాగా బంద్ కు దిగారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగానికి చెందిన బ్యాంకు ఉద్యోగులు మే 30, 31 తేదీల్లో ఈ బంద్‌లో పాల్గొననున్నారు. ఈ రెండు రోజులు బ్యాంకింగ్‌ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. నెల ముగింపు కావడంతో, ఉద్యోగుల వేతనాలు పడేది కూడా ఈ రోజుల్లోనే. మే 30, 31 తేదీల్లో బ్యాంకుల బంద్‌ కాబట్టి, కంపెనీలు లేదా ఆర్గనైజేషన్స్‌ తమ ఉద్యోగుల వేతనాలను ఈ రోజే(మంగళవారమే) క్రెడిట్‌ చేసే అవకాశముంది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇటీవల చోటు చేసుకున్న కుంభకోణాలు చూస్తునే ఉన్నాం. ఈ కుంభకోణాలు బ్యాంకులను భారీ మొత్తంలో ముంచేత్తుతున్నాయి. తాజాగా సమాచార హక్కు చట్టంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో చోటు చేసుకున్న బ్యాంకింగ్‌ కుంభకోణాలతో దేశంలో ఉన్న 21 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.25,775 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడైంది. వీటిలో ఎక్కువగా నష్టపోయింది పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకేనని తెలిసింది. ఈ ఏడాది ముగింపు వరకు వివిధ రకాల కుంభకోణాలతో పిఎన్‌బికి అత్యధిక మొత్తంలో రూ.6461.13 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆర్‌టిఐ డేటాలో తేలింది. చంద్రశేఖర్‌ గౌడ్‌ అనే వ్యక్తి రిజర్వుబ్యాంకు ఆఫ్‌ ఇండియా వద్ద ఈ పిటిషన్‌ దాఖలు చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వేతనాలను మంగళవారం వేసేశాయట అయితే వేతనాలు ఉద్యోగుల అకౌంట్లలో పడ్డప్పటికీ ఏటీఎంలలో విత్ డ్రా చేసుకునే వీలు లేకుండా పోయింది. రెండు రోజులు బంద్ కావడంతో ఏటీఎంలలో డబ్బు పెట్టే ఉద్యోగులు లేక వెలవెలబోతున్నాయి. అదీ కాక సెక్యూరిటీ గార్డులు సైతం బంద్ లో పాల్గొనడంతో ఏటీఎంలు రెండు రోజులు మూతపడబోతున్నాయి. ఈ బ్యాంకింగ్‌ కుంభకోణాల్లో అతిపెద్దది డైమండ్‌ కింగ్‌ నీరవ్‌ మోడీ, మెహుల్‌ చౌక్సిలది. వీరు పిఎన్‌బి అధికారులతో కుమ్మక్కై, బ్యాంకులో దాదాపు రూ.12,636 కోట్ల కుంభకోణానికి పాల్పడి దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఈ కేసులో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ దర్యాప్తు చేస్తున్నాయి.

మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌దిగ్గజం భారతీయ స్టేట్‌ బ్యాంకుకు ఈ ఆర్థిక సంవత్సరంలో కుంభకోణాల కారణంగా 2390.75 కోట్ల నష్టం వచ్చిందని ఆర్‌టిఐకి వివరణ ఇచ్చింది. అలాగే బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు రూ.2224.86కోట్లు, బ్యాంకు ఆఫ్‌ బరోడాకు రూ.1,928.25 కోట్లు, అలహాబాద్‌ బ్యాంకుకు రూ.1520.37 కోట్లు, ఆంధ్రాబ్యాంకుకు రూ.1.303.30 కోట్లు, యూకో బ్యాంకుకు రూ.1,224.64 కోట్లు, ఐడిబిఐ బ్యాంకుకు రూ.1,116.53 కోట్లు, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు రూ.1,095.84 కోట్లు, సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు రూ.1,084.50కోట్లు, బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్రకు రూ.1,029.23 కోట్లు, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకుకు రూ.1,015.79 కోట్ల నష్టం వచ్చినట్లు వెల్లడైంది. కుంభకోణాలతో ప్రస్తుతం బ్యాంకులు తీవ్ర ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నాయని ఆర్థికవేత్త జయంతిలాల్‌ భండారి అన్నారు.

ఇప్పటివరకు 12సార్లు పలు దఫాలుగా చర్చలు జరిపినా వేతన సవరణ ఒప్పందం అసంపూర్తిగానే మిగిలిపోయిందన్నారు.  గత రెండు నుంచి మూడేళ్లుగా బ్యాంకు ఉద్యోగులు ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం జన్‌ధన్‌, డిమానిటైజేషన్‌, ముద్రా, అటల్‌ పెన్షన్‌ యోజన వంటి వాటిని ఎంతో కృతనిశ్చయంతో అమలు చేస్తూ వస్తున్నారని, కానీ ప్రభుత్వం మాత్రం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని యూనిటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంకు యూనియన్ల  కన్వినర్‌ దేవిదాస్‌ తుల్జపుర్కర్‌ అన్నారు. 2017 నవంబర్‌ నుంచి వేతనాల పున:సమీక్ష పెండింగ్‌లో ఉందని, వెంటనే వాటిని సమీక్షించాలని డిమాండ్ చేశారు.