ఫేక్‌ వెబ్‌సైట్‌ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది
Spread the love

డిజిటల్‌ మార్కెటింగ్, ఈ– కామర్స్‌ మార్కెట్ల పుణ్యమా అని షాపులకు వెళ్లకుండానే మనకు కావాల్సిన వస్తువులను నేరుగా ఇంటి వద్దకే తెప్పించుకునే వెసులుబాటుతో ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. నాణేనికి ఇది ఒకవైపు మాత్రమే. నిజానికి ఆన్‌లైన్‌లో మనం చూసే వెబ్‌సైట్లలో ఎక్కువ నకిలీవి పుట్టుకొస్తున్నాయి. ఇంటర్నెట్‌ బ్రౌసింగ్‌ ప్రారంభించగానే మీకు ఫ్రీగా స్మార్ట్‌ ఫోన్‌ అందిస్తాం. చౌకగా ల్యాబ్‌టాప్‌ పంపిస్తామనే  ప్రకటనలు కనిపిస్తుంటాయి. ఈ ప్రాసెస్‌లో మీరు చేయాల్సింది ఒక్కటే మీ డిటైల్స్‌తో కూడిన ఫామ్‌ను పూరించి తమకు అందించడమే తరువాయి. వారం రోజుల్లో సెలక్ట్‌ చేసుకున్న ప్రొడక్ట్‌ మీ ఇంటికి పంపిస్తామనే ప్రకటనలతో అమాయకుల డబ్బులు కాజేసి బురిడీ కొట్టిస్తున్నాయి కొన్ని వెబ్‌సైట్లు.

ఏ కంపెనీ ఉచితంగా గిఫ్టూ ఇవ్వదు. కాబట్టి కొందరు ఇదేం పట్టించుకోక సదరు కంపెనీకి తమ వ్యక్తిగత డాటాను చేరవేస్తారు. ఇలా సంబంధిత వ్యక్తి వివరాలను తీసుకుని రెండు రోజుల్లో ప్రాసెస్‌ జరుగుతుందని నమ్మించి.. ఆ తర్వాత మీ ప్రొడక్ట్‌ రెడీగా ఉన్నాది కానీ కస్టమ్స్‌ చార్జీలు పంపించండని చెబుతారు. ప్రొడక్ట్‌ విలువను బట్టి కస్టమ్స్‌ చార్జీలను నిర్ణయిస్తామంటారు. వినియోగదారుడు పూర్తిగా నమ్మితే గాని ఖాతా వివరాలను షేర్‌ చేయరు. ఖాతా వివరాలను పంపిన తర్వాత మీ ప్రొడక్ట్‌ వ్యాల్యూ లక్ష రూపాయలు అని, మీరు కేవలం పదిశాతం పన్ను చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. సదరు వ్యక్తి డిపాజిట్‌ చేసిన తర్వాత నుంచి వినియోగదారునికి ఎటువంటి రిప్లై ఇన్ఫర్మేషన్‌ లభించదు.

జియో ల్యాపీ రూ.599కే.. ఈ లింక్‌ చూశారా..?

ఇలాంటిదే మరో ఫేక్‌ వెబ్‌సైట్‌ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. అదే జియో వెబ్‌సైట్‌ ఆన్‌లైన్‌. చిత్రంలో కనిపిస్తున్న వెబ్‌సైట్‌ను చూశారు కదా. ఈ వెబ్‌సైట్‌లోకి వెళితే జియోకి సంబంధించిన వస్తువులన్నీ తక్కువ ధరకే అందుబాటులోకి ఉన్నాయని చెబుతోంది.

ఇంత తక్కువ ధరకు సాధ్యమేనా..?

రూ.24,999 విలువైన జియో ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.599కే అందించడం సాధ్యమా.  విచిత్రమేమిటంటే అసలు జియోలో ల్యాప్‌టాప్‌ ఇంతవరకు మార్కెట్లోకే రాలేదు. ఇది నకిలీదని.. మరి అత్యంత తక్కువ ధరకి వాళ్లు ఎలా విక్రయిస్తారన్న సందేహం మనకు తప్పకుండా రావాలి. ఇవే కాకుండా ఈ తరహా దోపిడీ చేసే నకిలీ వెబ్‌సైట్లకు చెందిన పలు యాడ్స్‌ ఇప్పుడు ఫేస్‌బుక్‌లో కోకొల్లలుగా దర్శనమిస్తున్నాయి. అందుకే ఏమరుపాటుగా ఉండటం మన బాధ్యత. తస్మాత్‌ జాగ్రత్త.