తృప్తి దేశాయ్‌ను అడ్డుకున్న నిరసనకారులు
Spread the love

శబరిమల దర్శనానికి బయల్దేరిన ప్రముఖ సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌ను కోచి ఎయిర్‌పోర్టులో ఆందోళనకారులు అడ్డుకున్నారు. పుణె నుంచి బయల్దేరిన తృప్తి, ఆమె బృందం శుక్రవారం నాడు తెల్లవారుజామున 4.40గంటలకు కోచి ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అయితే అప్పటికే ఆందోళనకారులు విమానాశ్రయానికి చేరుకుని తృప్తి బృందాన్ని అడ్డుకున్నారు. ఆమెను ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లనివ్వం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. దాంతో తృప్తి విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చింది.

శబరిమలకు వెళ్లకుండా ఆమెను నిరోధించేందుకు విమనాశ్రయం వెలుపల పెద్ద ఎత్తు ఆందోళనకు దిగాయి. కాగా, శబరిమలకు బయలుదేరిన తమను హతమారుస్తామని, దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని, పోలీసులు తమకు ఎలాంటి భద్రత కల్పించకపోయినా శబరిమలకు వెళ్లి తీరుతామని తృప్తి దేశాయ్‌ స్పష్టం చేశారు.

మరోవైపు తన శబరిమల యాత్రకు భద్రత కల్పించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఆమె మెయిల్‌ చేశారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను హిందూ సంస్థలతో పాటు బీజేపీ, ఆరెస్సెస్‌ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకునేంతవరకు తాను మహారాష్ట్ర తిరిగి వెళ్లేది లేదని తృప్తి పట్టుబడుతున్నారు. కేరళ ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని, వారు తమకు భద్రత కల్పిస్తారని అంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. మండల పూజ నిమిత్తం శబరిమల అయ్యప్పస్వామి ఆలయం శుక్రవారం నాడు సాయంత్రం తెరుచుకోనుంది.