కరీంనగర్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘోర రోడ్డు ప్రమాదం
Spread the love

రాజీవ్ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం ఘటన మరచిపోకముందే మరో దుర్ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్‌ జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. 40 మంది ప్రయాణికులతో కరీంనగర్‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొంది.  మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను స్థానికులు, పోలీసులు బయటకు తీశారు. క్షతగాత్రులను కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సును ఢీకొన్న లారీ అంతటితో ఆగకుండా బస్సు వెనుకే వస్తున్న రెండు ద్విచక్రవాహనాలను సైతం ఢీకొంది. దీంతో వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు.

హుజూరాబాద్ డిపోకు చెందిన బస్సు కరీంనగర్‌ నుంచి వరంగల్‌ వైపు వెళ్తున్న లారీ వేగంగా ఢీకొంది. రెండు లారీలు ఒకదానికొకటి ఓవర్‌టేక్‌ చేసుకుంటూ రావడంతో ఓ లారీ అదుపుతప్పి బస్సును మధ్య భాగంగా ఢీకొంది. దీంతో వెనుక భాగం తునాతునకలైంది. ఆ సీట్లలో కూర్చున్న ప్రయాణికుల్లో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ప్రాంతంలో మృతుల శరీర భాగాలు, రక్తంతో భయానక పరిస్థితి నెలకొంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లారీ అతివేగంతో రావడం, రహదారి మధ్యలో డివైడర్‌ లేకపోవడమే ఈ ప్రమాదానికి పోలీసులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో ముగ్గురు నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారికి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నట్టు సమాచారం.

క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఉన్నతాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కాగా, శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం రిమ్మనగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. బస్సు ప్రమాదంపై మంత్రి ఈటెల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి హుటాహుటిన చెంబజర్లకు బయలుదేరారు. ప్రమాద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి ప్రకటించారు.

అనంతరం ఆస్పత్రికి చేరుకున్న మంత్రి గాయపడిన వారిని పరామర్శించారు. ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.