ఆధార్‌ కార్డు అవసరం లేదు: కేంద్రం ఆదేశం
Spread the love

ఆధార్‌ కార్డును ప్రతి ఒక్క అవసరానికి తప్పనిసరి చేయడంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో ఆధార్‌ కార్డు తప్పనిసరిపై సుప్రీంకోర్టులో వాదనలు కూడా జరుగుతున్నాయి. సిమ్ కావాలంటే ఆధార్ కార్డును సమర్పించాల్సిన అవసరం లేదంటూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.  డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు, ఓటర్‌ ఐడి తదితర ఫోటో గుర్తింపు కార్డుల ఆధారంగా సిమ్‌ జారీ చేయాలని కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొంది. వినియోగదారులకు అసౌకర్యం కలిగించకుండా వెంటనే ఈ ఆదేశాలను అమలు చేయాలని టెలికాం సెక్రటరీ అరుణ్‌ సుందరరాజన్‌ తెలిపారు. 

‘అన్నిటెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీచేస్తున్నాం. ఆధార్‌ నెంబర్‌ లేదని వినియోగదారులకు సిమ్‌ కార్డు ఇవ్వడాన్ని నిరాకరించవద్దు. ఇతర కేవైసీ దరఖాస్తులు, డాక్యుమెంట్లను సమర్పించాలని కోరండి. సిమ్‌ కార్డుల జారీని కొనసాగించండి’ అని సుందరరాజన్‌ తెలిపారు. అంతకముందు టెలికాం డిపార్ట్‌మెంట్‌ ఇచ్చిన ఆదేశాలతో మొబైల్‌ కంపెనీలు ఆధార్‌ వెరిఫికేషన్‌ను చేపడుతున్నాయి. ఈ నిర్ణయం నుంచి ఎన్‌ఆర్‌ఐలకు, విదేశీయులకు మినహాయింపు ఇచ్చింది.

కస్టమర్లను ఆధార్ కోసం ఇబ్బంది పెట్టుకుండా వెంటనే ఇతర ఐడీ ప్రూఫ్ లతో సిమ్ జారీ చేయాలని టెలికం ఆపరేటర్లను కోరినట్టు చెప్పారు. ఆధార్ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంలో విచారణ సాగుతోంది. తుది నిర్ణయం వచ్చేవరకు సిమ్ కార్డులు తీసుకోవడానికి పాతపద్ధతినే కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో టెలికం శాఖ తాజాగా  ఆదేశాలు జారీ చేసింది.