నక్సల్స్ దాడిలో……దూరదర్శన్ కెమెరామెన్, ఇద్దరు జవాన్లు మృతి
Spread the love

చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. దంతెవాడ జిల్లా ఆరాన్‌పూర్‌లో మావోయిస్టులు జరిపిన మెరుపుదాడిలో దూరదర్శన్‌ కెమెరామెన్‌తో పాటు ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. బిజాపూర్‌ జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తోన్న వాహనాన్ని మావోయిస్టులు పేల్చేసిన ఘటనలో నలుగురు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. దంతెవాడలో ఎన్నికల ప్రచారాన్ని కవర్‌ చేయడానికి దూరదర్శన్‌ బృందం అక్కడికి రాగా, అదే సమయంలో మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. మావోయిస్టుల దాడిలో రుద్ర ప్రతాప్, కానిస్టేబుల్ మంగళ్, ఢిల్లీకి చెందిన దూరదర్శన్ కెమెరామెన్ అచ్యుతానంద సాహు ప్రాణాలుకోల్పోయారని ఉన్నతాధికారులు చెప్పారు.

వచ్చే నెలలో ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 12న తొలి దశ, 20వ తేదీన రెండో దశ పోలింగ్‌ నిర్వహించనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మొదటి దశ పోలింగ్‌ జరగనుంది. నిన్న ఛత్తీస్‌గఢ్‌లోని భాజపా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు తగ్గుముఖం పట్టాయని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడటం గమనార్హం.