రోజూ కాఫీ తాగితే పార్కిన్సన్స్ వ్యాధి దూరం..!
Spread the love

రోజూ కాఫీ తాగితే పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. కాఫీలో ఉండే రెండు సమ్మేళనాలు పార్కిన్సన్స్, దెమెంతియా వ్యాధులకు ఔషధాలుగా పనిచేస్తాయని వారు అంటున్నారు. రట్‌గర్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కాఫీలో ఉండే కెఫీన్‌ను ఒక ప్రత్యేకమైన ప్రొటెక్టివ్ ఏజెంట్‌గా గుర్తించారు. దీన్ని కాఫీ బీన్స్ వాక్స్ కోటింగ్‌లో ఉండే మరో సమ్మేళనంతో కలిపి ఎలుకలపై పరీక్షించారు. దాంతో వాటిల్లో మెదడుకు చెందిన కణాల క్షీణత తగ్గిందని గుర్తించారు. కాఫీ బీన్స్‌లో ఉండే ఈహెచ్‌టీ అనే సమ్మేళనం ఎలుకల్లో మెదడు కణాలను రక్షించిందని, పార్కిన్సన్స్, దెమెంతియా వ్యాధులకు కారణమయ్యే ఓ ప్రోటీన్ బారి నుంచి కూడా మెదడును సదరు సమ్మేళనం రక్షించిందని సైంటిస్టులు గుర్తించారు. దీని వల్ల వారు చెబుతున్నదేమిటంటే.. నిత్యం కాఫీ తాగడం వల్ల మెదడు కణాలు సురక్షితంగా ఉంటాయని, వాటి క్షీణత తగ్గుతుందని, అందువల్ల పార్కిన్సన్స్ వ్యాధి రాకుండా ఉంటుందని వారు అంటున్నారు. పార్కిన్సన్స్ వచ్చిన వారిలో నాడీ వ్యవస్థకు చెందిన కణజాలం క్షీణిస్తుంది. దీని వల్ల శరీరంలో కదలికలపై ఆ ప్రభావం పడుతుంది. కాలి కండరాలు పట్టేస్తుంటాయి. కండరాల నొప్పులు ఉంటాయి. బ్యాలెన్స్ తప్పిపోతుంటారు. మాట్లాడడం, రాయడంలో మార్పులు వస్తాయి. కనుక ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే నిత్యం కాఫీ తాగాలని ఆ సైంటిస్టులు సూచిస్తున్నారు. కాగా సైంటిస్టులు చేసిన ఈ అధ్యయనాన్ని ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ప్రచురించారు.