చలికాలంలో పొడిబారే చర్మానికి ఇంటి చిట్కాలు..!
Spread the love

చలికాలం మన చర్మాన్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తుందో అందరికీ తెలిసిందే. ఈ కాలంలో ఎవరి చర్మం అయినా పొడిబారుతుంది. కొందరికి అయితే చర్మం పై భాగంలో పొట్టు రాలుతుంది. అయితే ఇలాంటి చర్మ సమస్యలకు మన ఇంట్లో పదార్థాలతోనే సులభమైన పరిష్కారం దొరుకుతుంది. అందుకు ఏం చేయాలంటే…

పాలల్లో వెజిటబుల్ ఆయిల్‌ను కలిపి కాటన్‌తో చర్మంపై రాసుకుంటే పొడి చర్మం సమస్య నుంచి బయట పడవచ్చు. చర్మం మృదువుగా మారుతుంది.

మృదువైన చర్మం కలిగిన వారు ఆరెంజ్ జ్యూస్‌లో తేనె కలిపి చర్మానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి. దాంతో చర్మం కాంతివంతంగా మారుతుంది.

పెరుగు, పసుపు, తేనెలను కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాలు ఆగాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మ సమస్యలు పోతాయి. చర్మం మృదువుగా మారుతుంది.

తేనె, రోజ్ వాటర్, పాలపొడి కలిపి మిశ్రమంగా చేసి దాన్ని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాలు ఆగాక కడిగేయాలి. దాంతో చర్మం పొడి బారడం తగ్గుతుంది. ఈ మిశ్రమంలో గుడ్డు సొనను కూడా ఉపయోగించవచ్చు.

అరటిపండు, బొప్పాయి, యాపిల్ పండ్ల గుజ్జును కలిపి మిశ్రమంగా చేసి దాన్ని ముఖానికి రాయాలి. 20 నిమిషాలు ఆగాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

మసాజ్ ఆయిల్, గంధం పొడి, రోజ్ వాటర్, తేనె కలిపి మిశ్రమంగా చేసుకుని దాన్ని శరీరంపై మసాజ్ చేస్తూ రాయాలి. అనంతరం కొంత సేపు ఆగాక స్నానం చేయాలి. ఇలా కనీసం వారానికి ఒక్క సారి చేసినా చర్మం పొడిబారకుండా, మృదువుగా తయారవుతుంది.

స్నానం చేసిన వెంటనే కొందరికి చర్మం పగులుతుంది. అలాంటి వారు స్నానానికి సబ్బుకు బదులుగా సున్నిపిండి ఉపయోస్తే ఫలితం ఉంటుంది. స్నానం చేశాక వెనిగర్ కలిపిన నీళ్లను చర్మంపై పోసుకున్నా ఫలితం ఉంటుంది.

గ్లిజరిన్, రోజ్ వాటర్, తేనె కలిపిన మిశ్రమాన్ని రోజూ కాళ్లు, చేతులకు రాసుకుంటే ఆ భాగాలు మృదువుగా ఉంటాయి. పగుళ్లు తగ్గుతాయి.