శరీరంలో వాతపిత్తకఫాలను వృద్ధిచేసే ఆహారాలు
Spread the love

మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన యొక్క ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. ఆయా ఆహారాలు మనశరీరతత్వానికి అనుగుణంగా ఉన్నాయో లేవో చూసుకొని తీసుకున్నచో మనకి అనారోగ్య సమస్యలు దరిచేరవు . రోగం వచ్చినప్పుడు చికిత్స తీసుకోవడం కన్నా ఆ రోగం రావడానికి గల కారణాలు గుర్తించి సరైన జాగ్రత్తలు పాటించడం

చాలా మంచిది .

ఇప్పుడు నేను మీకు వివరించబోయే ఆహార విషయాలు ఆయా శరీరతత్వాల వారు పాటించి పడని ఆహారపదార్థాలుకు దూరంగా అయినా ఉండటం లేదా అతితక్కువ మోతాదులో ఎప్పుడో ఒకసారి తీసుకోవడం వలన ఆనారోగ్యానికి గురికాకుండా ఉంటారు.

* శరీరంలో వాతాన్ని కలిగించు ఆహారాలు –

అతిగా వ్యాయామం చేయడం , అతిగా ఉపవాసాలు , ఎత్తు నుంచి దూకుట , కాళ్లు చేతులు విరుగుట, ధాతుక్షయం, రాత్రిజాగారం, మలమూత్రాలు బంధించుట లేదా బలవంతంగా విసర్జించుట, అతిగా వాంతులు మరియు విరేచనాల వలన, కషాయాలు మరియు చేదు వస్తువులను అతిగా వాడుట, అతిగా భాధపడుట, భయం , అతిగా ఏడవటం వంటివాటివలన సంధ్యాసమయాలలో, వర్షాకాలంలోనూ, భోజన ముందు సమయాలలోను వాతం వృద్ధిచెందును.

* శరీరంలో పిత్తాన్ని కలిగించు పదార్థాలు –

అతి పులుపు , అతికారం , ఉప్పు వంటి తీక్షణ పదార్థాలు తీసుకోవడం , అతిగా కోపగించుకొనుట, ఎండలో ఎక్కువ తిరుగుట, నువ్వులు , పెరుగు , తరవాణి వంటివాటిని అతిగా సేవించుట వలన , మద్యసేవన వలన , అన్నం జీర్ణం అయ్యే సమయంలోను ,శరత్,గ్రీష్మ ఋతువుల్లోనూ , మధ్యాన్న , మధ్యరాత్రి సమయాల్లోనూ శరీరంలో పిత్తం వృద్ది చెందును .

* శరీరంలో కఫం వృద్ధి కలిగించు పదార్దాలు –

చిక్కని మధుర పదార్దాలు అతిగా సేవించుట , పెరుగు , బెల్లం, వెన్న, నెయ్యితో చేయబడిన మధురపదార్ధాల వలన , పగటినిద్ర వలన, హేమంత, వసంత ఋతువులలోను , భోజనం అయినవెంటనే పగలు , రాత్రుల ప్రారంభ సమయాలలో కఫవృద్ధి జరుగును.

ఇప్పుడు శరీరంలో వాత,పిత్త,కఫాన్ని తగ్గించు ఆహారవిహారాల గురించి తెలియచేస్తాను .

* శరీరంలో వాతాన్ని తగ్గించు ఆహారవిహారాలు –

తియ్యని,పుల్లని , లవణ రసాలు కలిగిన మృదువు కలిగి ఉండి కొంచం ఉష్ణం కలిగించు ఆహారపదార్థాలు .

* శరీరంలో పిత్తాన్ని తగ్గించు ఆహారవిహారాలు –

కషాయ , చేదు రుచులు కలిగిన చల్లని మధురమైన మృదువు, సాంద్రత కలిగిన ఆహారవిహారాలు .

* శరీరంలో కఫాన్ని తగ్గించు ఆహారవిహారాలు –

వగరు,కారం,చేదు కలిగిన ఆహార పానీయాలు , తీక్షణత, వేడి కలిగిన ఆహారవిహారాలు కఫాన్ని నాశనం చేస్తాయి.

కావున పైన చెప్పినవిధంగా ఆయా దోషాలు కలిగినవారు వాటికి తగ్గ ఆహారపదార్థాలు సేవించడం , విడిచిపెట్టడం ద్వారా మీయొక్క ఆరోగ్యాలు కాపాడుకొనవలెను .