అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే ఉసిరికాయ‌..!
Spread the love

ఉసిరికాయ‌లు మ‌న‌కు ఈ సీజ‌న్‌లో ఎక్కువ‌గా ల‌భిస్తాయి. స‌హ‌జంగానే ఈ సీజ‌న్‌లో చాలా మందికి ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం, శ్వాస కోశ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అయితే ఆయా స‌మ‌స్య‌ల‌కు ఉసిరికాయ‌లు మ‌న‌కు చ‌క్క‌ని ప‌రిష్కారాన్ని చూపుతాయి. ఉసిరి కాయ‌ల వ‌ల్ల ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఉసిరిలో యాంటీయాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మకణాలను కాంతిమంతంగా ఉంచుతాయి. దాంతో వయసు పైబడిన లక్షణాలు దరిచేరవు. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్‌, ఎర్రరక్తకణాలను వృద్ధి చేసి, రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉసిరికి ఉన్నాది. ఉసిరి కాయ జ్యూస్‌ను నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గడుపునే తాగితే ఈ లాభాలు క‌లుగుతాయి.

2. గొంతు నొప్పి, దగ్గు ఉంటే ఒక టీస్పూన్‌ ఉసిరికాయ రసానికి, అర టీస్పూన్ తేనె, అర టీస్పూన్ అల్లం రసం కలిపి తాగాలి. చాలా తక్కువ సమయంలో ఉపశమనం కలుగుతుంది.

3. రక్తంలోని చక్కెరశాతాన్ని తగ్గించే ఔషధగుణాలు ఇందులో ఉన్నాయి. చక్కెరవ్యాధి ఉన్నవారు రోజూ ఉసిరికాయ జ్యూస్‌ను తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది.

4. ఉసిరిలో నీరూ, పీచుశాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ రెండూ జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. అంతేకాదు కడుపు ఉబ్బరం, అజీర్తిని కూడా అరికడ‌తాయి. అలాగే విటమిన్‌ సి అధికంగా ఉండే ఉసిరికాయ‌ల‌ను ఆహారంలో చేర్చుకుంటే, జీర్ణాశయంలో పుండ్లు ఏర్పడకుండా ఉంటాయి.

5. యాంటీయాక్సిడెంట్లూ, విటమిన్లూ సమృద్ధిగా ఉండే ఉసిరికాయను ప్రతీరోజూ ఆహారంలో తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకల‌ ఆరోగ్యానికి ఇందులోని క్యాల్షియం తోడ్పడుతుంది.

6. హృద్రోగాలకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ శాతాన్ని పెంచడంలో ఉసిరికాయ‌లు కీలకంగా పనిచేస్తాయి. అంతేకాదు గుండెలోని రక్తనాళాల గోడలు దృఢంగా మారకుండా ఉసిరికాయ‌లు కాపాడుతాయి. దాంతో హృద్రోగాల బారిన ప‌డ‌కుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు.