ట్వీట్ తెచ్చిన  తంటా……సల్మాన్‌ఖాన్‌
Spread the love

దేని విషయంలోనైనా కాస్త ఆలస్యంగా స్పందించడం కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌కున్న మా చెడ్డ అలవాటు. సినిమాల్లో బిజీగా ఉండడమో లేక, ఆచితూచి స్పందించాలన్న అభిమతమో గాని అతడి ‘మందగమనం’ ఇప్పుడు అతడిని పెద్ద చిక్కులో పడేసింది.వరద విపత్తుతో విలవిల్లాడిన కేరళ మీద దేశవ్యాప్తంగా సానుభూతి కురుస్తోంది. మాటలకే పరిమితం కాకుండా ఎంతోమంది సెలబ్రిటీలు చేతనైనంత విరాళం ప్రకటిస్తూ తమ దొడ్డబుద్ధిని చాటుకుంటున్నారు. రెండు వారాలుగా జరుగుతున్న ఈ తతంగంపై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ 21వ తేదీ ఒక చిన్నపాటి ట్వీట్ చేసి చేతులు దులిపేసుకున్నారు.
ఆ తర్వాత అదే ట్విట్టర్‌ని తన సినిమా ప్రమోషన్ కోసం వాడుకున్నాడు. అంతేతప్ప కేరళ మీద సల్మాన్ ధ్యాస మళ్ళలేదు. ఇందుకేనేమో బాలీవుడ్ నటుడు జావేద్ జాఫ్రీ ‘చెయ్యి’ చేసుకున్నాడు. ‘కేరళ బాధితుల కోసం 12 కోట్ల విరాళం ఇచ్చిన సల్మాన్‌కి అభినందనలు’ అంటూ ట్వీట్ చేశాడితడు.
కానీ కేరళ సీఎం ప్రకటించిన విరాళాల జాబితాలో సల్మాన్ పేరు లేకపోవడం సల్మాన్ నుంచి అటువంటి ప్రకటనేదీ రాకపోవడంతో నెటిజన్లు జాఫ్రీని ఒక ఆట ఆడుకోవడం మొదలుపెట్టారు. మెసేజ్‌లు, ట్వీట్లతో బాగా ట్రోల్ చేశారు .
ఈ మొత్తం తతంగం సల్మాన్ దాకా చేరిందో లేదో తెలీదు. ఒకవేళ చేరివుంటే మాత్రం సల్మాన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని మరో రకం ట్రోలింగ్ మొదలైంది. కేరళ కోసం తాను నయాపైసా కూడా ఇవ్వనందుకు సల్మాన్ బాధ పడతాడని, ఇప్పటికిప్పుడు నిజంగానే 12 కోట్లు ఇచ్చేస్తాడని కొంతమంది చురకలంటిస్తున్నారు. ఏదేమైనా కేరళ వరద విపత్తు సల్మాన్‌కి శీల పరీక్ష పెట్టినట్లయింది కదూ