మట్టికరిచిన ము౦బై, గెలుపును  అనుష్క కు గిప్ట్ గా ఇచ్చిన విరాట్
Spread the love

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. తీవ్ర ఒత్తిడి మధ్య ఈ మ్యాచ్‌లో బరిలో దిగిన కోహ్లి సేన.. ముంబైపై గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. 168 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. టిమ్ సౌథీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ చివరి బంతికి ఇషాన్ కిషన్‌ (0) బౌల్డ్ కాగా.. నాలుగో ఓవర్లో ఉమేశ్ వరుస బంతుల్లో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. తొలి బంతికే సూర్యకుమార్ (9)ను ఎల్బీగా బలిగొన్న ఉమేశ్.. మరుసటి బంతికి రోహిత్ శర్మను ఔట్ చేశాడు. దీంతో 21 పరుగులకే ముంబై 3 కీలక వికెట్లు కోల్పోయింది.

నాలుగు ఓవర్లలో 24/3తో రోహిత్ సేన కష్టాల్లో పడింది. పొలార్డ్, డుమిని కాసేపు పోరాడటంతో ముంబై పవర్ ప్లేలో 40/3తో నిలిచింది . కానీ 8వ ఓవర్ తొలి బంతికి పొలార్డ్‌ను సిరాజ్ ఔట్ చేశాడు. దీంతో ముంబై 47/4తో మరోసారి కష్టాల్లో పడింది.

ఈ దశలో హార్దిక్ పాండ్య, జేపీ డుమిని ఆదుకోవడంతో ముంబై ఇండియన్స్ పది ఓవర్లలో 77/4తో నిలిచింది. కోలుకుంటున్న దశలో డుమిని (23) అనవసర పరుగుకు యత్నించి రనౌట్ అయ్యాడు. దీంతో ముంబై 84 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. పాండ్య బ్రదర్స్ నిలకడగా ఆడి జట్టును గెలిపించే ప్రయత్నం చేశారు. కానీ చివరి ఓవర్లలో కృనాల్, హార్దిక్ (50) ఔటవడంతో మ్యాచ్ బెంగళూరు వైపు మొగ్గింది.

అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. మనన్ వోహ్రా (31 బంతుల్లో 45) ఆరంభంలో మెరవగా.. బ్రెండన్ మెక్‌కల్లమ్ (25 బంతుల్లో 37) దూకుడుగా ఆడాడు. కోహ్లితో కలిసి మూడో వికెట్‌కు 60 రన్స్ జోడించిన మెక్‌కల్లమ్‌ను హార్దిక్ డైరెక్ట్ త్రో విసిరి రనౌట్ చేశాడు. 14.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 121 రన్స్‌తో పటిష్టంగా కనిపించిన బెంగళూరు జోరును పాండ్య అడ్డుకున్నాడు. వరుస బంతుల్లో మన్‌దీప్ (14), కోహ్లి(26 బంతుల్లో 32)లను ఔట్ చేసిన హార్దిక్.. అదే ఓవర్ చివరి బంతికి వాషింగ్టన్ సుందర్‌ను పెవిలియన్ చేర్చాడు. ఒకే ఓవర్లో మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో బెంగళూరు స్కోరు బోర్డుపై ప్రభావం చూపింది. ఆఖరి ఓవర్లో గ్రాండ్ హోమ్ (10 బంతుల్లో 23) 3 సిక్స్‌లు బాదడంతో 24 పరుగులు వచ్చాయి. దీంతో 20 ఓవర్లలో బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 167 రన్స్ చేసింది.