ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ :రణ్‌వీర్ సింగ్ దీపిక పదుకొణె
Spread the love

బాలీవుడ్‌లో మరో ప్రేమ జంట పెళ్లికి రెడీ అయ్యారు. గతకొంతకాలంగా బాలీవుడ్ నటులు రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకొణెలు ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం ఈ ఏడాది నవంబర్ 12-16 తేదీల్లో జరగనుందని సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ దినపత్రిక డీఎన్ఏ తన కథనంలో పేర్కొంది. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసిన ఈ జంట.. ఇటలీలో పెళ్లి చేసుకోనుంది.ఇటలీలో వీరి పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయనేది బాలీవుడ్ పత్రిక కథనంలో వెల్లడించింది.

అంతేకాకుండా రణ్‌వీర్, దీపికా పెళ్లి ఇటలీలోని లాంబార్డీలోని లేక్ కోమోలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు, అతిథులకు వసతి, ఇతర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం అని వారి సన్నిహితులు ధృవీకరించారు. త్వరలోనే అధికారికంగా వెల్లడించడానికి అవకాశం ఉంది. మీడియాకు దూరంగా ఈ పెళ్లి నిరాడంబరంగా జరిగేలా చర్యలు తీసుకొంటున్నారు. లేక్ కామో సహజసిద్ధమైన ప్రకృతి అందాలకు నిలయమని పేర్కొంటారు. ఉత్తర ఇటలీలోని ఆల్ప్స్ పర్వతాలకు చేరువగా ఉంటుంది.

గతంలో ఇదే తరహాలో రహస్యంగా క్రికెటర్ విరాట్ కోహ్లి, అనుష్క శర్మలు మీడియాకి దూరంగా ఇటలీలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రణ్‌వీర్-దీపికల నిశ్చితార్థం రహస్యంగా మాల్దీవుల్లో జరిగిందని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. కానీ ఈ వార్తని అటు దీపక ఫ్యామిలీ గానీ, రణ్ వీర్ ఫ్యామిలీ కానీ ఖండించలేదు. ఆ తర్వాత పెళ్లి గురించి బోలెడన్ని వార్తలు వచ్చాయి. అయినా దీపిక గానీ, అటు రణ్‌వీర్ గానీ పెళ్లిపై స్పందించలేదు.

పెళ్లిని దృష్టిలో పెట్టుకొని దీపిక, రణ్‌వీర్ తమ ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేసుకోవడం, కొన్నింటికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ముందస్తు షెడ్యూల్స్ ఏర్పాటు చేసుకోవడం లాంటివి చేస్తున్నారట. ఇటీవల బాలీవుడ్ మీడియాతో రణ్‌వీర్ మాట్లాడుతూ.. లైఫ్‌ను వర్క్‌ను బ్యాలెన్స్ చేస్తున్నాం అని చెప్పడం గమనార్హం.