శ్రీరెడ్డికి నేనున్నా అంటున్న వర్మ
Spread the love

కాస్టింగ్ కౌచ్ వివాదంలో శ్రీరెడ్డి వెనుక ఉండి పవన్ కళ్యాణ్ ను అభ్యంతరకర బాషలో తిట్టించింది తానే అని ఒప్పుకున్న తర్వాత వర్మ విషయంలో ఎంత రచ్చ జరిగిందో తెలిసిన విషయమే. ఇది పక్కన పెడితే వర్మకు అసలైన టాస్క్ ముందుంది. అదే ఆఫీసర్ విడుదల. మే 25కు నెల రోజులు సమయం కూడా లేదు. ఇంకా ప్రమోషన్ మొదలు పెట్టనే లేదు. ఒక డేట్ ప్రకటించాక రిలీజ్ పోస్ట్ పోన్ చేయటం వర్మ ఇంతవరకు చేయలేదు.సో పరిశ్రమతో పాటు సినిమా ప్రేమికుల్లో సైతం తన మీద తీవ్ర ఆగ్రహావేశాలు ఉన్న తరుణంలో ఆఫీసర్ నడక సజావుగా సాగుతుందా అంటే అబ్బే ఇబ్బందేం లేదు అంటున్నాడు వర్మ. కాస్టింగ్ కౌచ్ విషయంలో పరిశ్రమ పెద్దలు తాము చేయాల్సింది చేస్తున్నారు అంటూనే క్యాష్ కమిటీలు ఉన్నాయి కదా సమస్యలు తీరుస్తాయి అని చెప్పేస్తున్నాడు. ఇక శ్రీరెడ్డి ప్రస్తావన వస్తే మాత్రం వర్మ నిర్మొహమాటంగా తప్పుని ఒప్పేసుకుంటున్నాడు.

సరైన పాత్ర ఉంటే శ్రీరెడ్డికి తన సినిమాలో అవకాశం కూడా ఇస్తాను అంటున్న వర్మ అన్నంత పని చేసినా చేస్తాడు. అయినా ఇప్పుడు శ్రీరెడ్డి మీద బ్యాన్ లాంటిది ప్రస్తుతానికి ఏమి లేదు కాబట్టి వర్మ స్టేట్మెంట్ ని తప్పు బట్టడానికి లేదు. ఆఫీసర్ ని కాని తనను కాని బాయ్ కాట్ చేస్తామని ఇంతవరకు పరిశ్రమలో ఎవరూ చెప్పలేదని అంటున్న వర్మ అన్ని కమిటీలే చూసుకుంటాయని ధీమాగా చెబుతున్నాడు. ఒక పక్క పరిశ్రమలోని వారంతా ఒక తాటి పైకి వచ్చి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అని వార్తలు వచ్చిన నేపధ్యంలో వర్మ అనుసరించబోయే ఎత్తుగడ ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా ఆసక్తి నెలకొంది. వర్మను టెక్నికల్ గా బ్యాన్ చేయటం అసాధ్యమని అందరికి తెలుసు. వర్మ ధైర్యానికి కారణం కూడా అదే. ఇప్పుడు శ్రీరెడ్డి కి ఫ్యూచర్ లో సినిమా ఛాన్స్ ఇస్తాను అంటున్న వర్మ కొత్త అనుమానాలు రేపుతున్నాడా లేక విషయాన్నీ పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడా అనే ప్రశ్నకు సమాధానం ఒక్క వర్మ దగ్గరే ఉంది.