మహనటీ  గురి౦చి తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విశేషాలు
Spread the love

ఇప్పుడందరి కళ్లు కీర్తి సురేష్ మీదే. ఈ మధ్య కాలంలో మిగతా హీరోయిన్ల కంటే ఆమె గురించే చర్చిస్తున్నారందరూ. కారణం ఆమె సావిత్రిగా నటించడమే. ఎంతో మందిని వెతికి చివరకు సావిత్రిగా కీర్తి సురేష్ ఎంచుకుంది నాగ్ అశ్విన్ టీమ్. అందుకు ఆమెను ఒప్పించి… భారీగానే రెమ్యునరేషన్ ముట్టజెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఆమె అందుకున్న పారితోషికం సమంత కాజల్ వంటి స్టార్ హీరోయిన్ల రెమ్యునరేషన్లో సమానంగా ఉందట.

నాగఅశ్విన్ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు సావిత్రి బయోపిక్. అందులో సావిత్రి పాత్రధారి కోసం వెతికి వెతికి కాస్త పోలికలున్న కీర్తి సురేష్ ను తీసుకున్నారు. అప్పట్లో ఈ ఎంపికపై చాలా విమర్శలు వచ్చాయి. అలనాటి నటి జమున అయితే బహిరంగంగాన విమర్శించింది. కీర్తికి ఏం అర్హత ఉందని సావిత్రిగా నటిస్తోందంటూ కామెంట్ చేసింది. దానికి కీర్తి కూడా ఘాటుగానే స్పందించింది. మొత్తమ్మీద  అవన్నీ సద్దుమణిగిపోయి సినిమా షూటింగ్ కూడా పూర్తయిపోయింది. మరో రెండు రోజుల్లో మహానటి సినిమా థియేటర్లలోకి రానుంది. అందుకే నాగ అశ్విన్ సినిమా ప్రమోషన్ను వేగవంతం చేశాడు. ఇప్పటి వరకు విడుదలై టీజర్లు పోస్టర్లు ట్రైలర్లు సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి.

ముఖ్యంగా కీర్తి సురేష్ లుక్ సావిత్రిలాగా అనిపించడంతో సినీ జనాల్లో మరింతగా ఆసక్తి పెరిగింది. లుక్స్ పరంగా కీర్తి మహానటి సినిమాకు న్యాయం చేసిందని మెచ్చుకుంటున్నారు చాలా మంది. ఇక మిగిలింది నటన. మే 9న సినిమా విడుదలయ్యాక అది కూడా తేలిపోతుంది. ఈ సినిమాకు కీర్తిని ఒప్పించేందుకు దాదాపు కోటిన్నర రూపాయలు ఇచ్చిందట సినిమా యూనిట్. ఇంతమొత్తం పారితోషకంగా అందుకోవడం కీర్తి సురేష్ ఇదే తొలిసారి. ఈ సినిమా తరువాత కోటిన్నర హీరోయిన్ల జాబితాలో ముందుంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం టాప్ రేంజ్లో ఉన్న సమంతనే అంత మొత్తాన్ని అందుకుంటోంది. కాజల్ కూడా సినిమాకు కోటిన్నరే తీసుకుంటోంది.

మహానటి సావిత్రిని జెమిని గణేశన్ పెళ్లి చేసుకోవడాని కంటే ముందే ఆయనకు ఇద్దరు భార్యలున్నారు. అందులో ఒకరు పుష్పవల్లి. ఆమెకు పుట్టిన సంతానమే బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ రేఖ. ఆమెకున్న ప్రాధన్యం దృష్ట్యా సావిత్రి జీవిత కథతో తెరకెక్కికన ‘మహానటి’లో తన పాత్రను చూపిస్తారనే భావిస్తున్నారు చాలామంది. ఆ పాత్ర ఎవరు చేశారనే ఆసక్తి కూడా జనాల్లో ఉంది. కానీ ఈ చిత్రంలో రేఖ పాత్రకు చోటు లేదని తేల్చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్.

జెమిని గణేశన్ కు మొత్తంగా నలుగురు భార్యలు. ఏడుగురు పిల్లలు. వాళ్లందరినీ చూపిస్తే సావిత్రి కథ డైల్యూట్ అయిపోతుందని భావించిన నాగ్ అశ్విన్.. అందరి జోలికి వెళ్లట్లేదట. నిజానికి కథ రాసుకునేటపుడు సావిత్రి జీవితంలో ప్రతి అంశం చూపించాలనే తాపత్రయం ఉండిందని.. దీంతో చాలా అంశాలు స్క్రిప్టులో చేర్చానని.. ఐతే అది మొత్తం చిత్రీకరిస్తే సినిమా నిడివి ఎక్కడికో వెళ్లిపోతుందని.. ఇబ్బంది తప్పదని భావించి స్క్రిప్టు దశలోనే ఎడిటింగ్ చేయాల్సి వచ్చిందని నాగ్ అశ్విన్ తెలిపాడు.

సావిత్రి అంటే చిన్నప్పట్నుంచి ఉన్న అభిమానంతోనే ఆమె మీద సినిమా తీయాలనుకున్నానని.. కెరీర్ ఆరంభ దశలోనే ఈ సినిమా చేయడం పట్ల తనకేమీ అభ్యంతరాలు లేవని అశ్విన్ చెప్పాడు. నిజానికి ‘ఎవడే సుబ్రమణ్యం’ లాంటి సినిమాను కొంచెం వయసు అయ్యాకే చేస్తారని.. తన తొలి సినిమాగా అలాంటిది చేయడంతో రెండో సినిమాగా ‘మహానటి’ చేయడానికి తనకేమీ ఇబ్బందిగా అనిపించలేదని అశ్విన్ తెలిపాడు.

సావిత్రి బయోపిక్ మహానటి ఇంకా రెండే రోజుల్లో వచ్చేయనుంది. ఈలోపే ఒక్కో క్యారెక్టర్ను వీడియోల రూపంలో యూట్యూబ్లో పరిచయం చేస్తోంది చిత్ర యూనిట్. ఇదిగో ఇప్పుడు సావిత్రి ప్రాణ స్నేహితురాలు సుశీల వంతు వచ్చింది. చిన్నప్పట్నించి కలిసి పెరిగిన వారిద్దరి మధ్య బంధాన్ని మహానటిలో అందంగా చూపించారట. అయితే మరి సుశీల పాత్ర ఎవరు చేస్తున్నారు?

అర్జున్ రెడ్డితో మంచి హిట్ అందుకుంది షాలినీ పాండే. ఆమెకే సావిత్రి స్నేహితురాలు సుశీల పాత్ర దక్కింది. సావిత్రి బాల్యంలోని తీపి గురుతు ఈమె. పెరిగి పెద్దయ్యాక కూడా వీరి స్నేహం అలాగే కొనసాగింది. స్టార్ గా మారాక కూడా సావిత్రి స్నేహితురాలిని వదిలిపెట్టలేదు. ఆ స్నేహితురాలిగా అందంగా మెరిసింది షాలినీ. ఆమె గెటప్ కూడా సాంప్రదాయ బద్ధంగా మెరిసింది. నుదటు పెద్దబొట్టుతో తలనిండా మల్లెపూలతో ముఖమంతా అందమైన నవ్వుతో ఎరుపు చీరలో ఆకట్టుకుంది షాలినీ. ఆమెకు నిజంగా ఇది గుర్తుండిపోయే చిత్రమే అవుతుంది.

ఇలా ఎల్వీ ప్రసాద్ గా చేస్తున్న అవసరాల క్యారెక్టర్ ను  అలమేలుగా నటిస్తున్న మాళవికా నాయర్ పాత్రను ఎస్వీరంగారావుగా చేస్తున్న మోహన్ బాబు పాత్రను ఇలా కొన్ని పాత్రలను వీడియోల రూపంలోనే పరిచయం చేశారు. అన్నట్టు ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కూడా ఈ సినిమాలో చిన్న పాత్ర చేస్తున్నాడు. ఆయన అలనాటి ప్రముఖ దర్శకుడు కేవీ రెడ్డిగా కనిపించనున్నారు. మాయా బజార్ వంటి అపురూప చిత్రాన్ని తీసింది ఆయనే.