టాక్సీవాలా మూవీ రివ్యూ
Spread the love

న‌టీన‌టులు: విజ‌య్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్, కళ్యాణి, మధునందన్, సిజ్జు, రవి ప్రకాష్, రవి వర్మ, ఉత్తేజ్, విష్ణు త‌దిత‌రులు

క‌ళ‌: శ్రీకాంత్ రామిశెట్టి

పాట‌లు: కృష్ణ కాంత్‌

సంగీతం: జేక్స్ బిజాయ్

కూర్పు: శ్రీజిత్ సారంగ్

ఛాయాగ్ర‌హ‌ణం: సుజిత్ సారంగ్

క‌థ‌నం, సంభాష‌ణ‌లు: సాయి కుమార్ రెడ్డి

నిర్మాత: ఎస్.కె.ఎన్

క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: రాహుల్ సంక్రిత్యాన్‌

విజ‌య్ దేవ‌ర‌కొండ ‘గీత గోవిందం’తో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకొన్నారు. అప్ప‌టిదాకా యువ‌తరానికే చేరువైన ఆయ‌న గోవింద్‌గా కుటుంబ ప్రేక్ష‌కుల‌కూ న‌చ్చేశారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన ‘నోటా’ మెప్పించ‌లేక‌పోయింది. తిరిగి ఫామ్‌ని అందుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ‘టాక్సీవాలా’తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు విజ‌య్‌. ఈ చిత్రం విడుద‌ల‌కి ముందే ప‌లు అవాంత‌రాల్ని ఎదుర్కొంది. అందుకు సాంకేతిక కార‌ణాల‌తో పాటు సినిమా పైర‌సీకి గురి కావ‌డం. దాంతో చిత్ర యూనిట్ త‌గు చ‌ర్య‌లు తీసుకున్నా.. సినిమా ప్రేక్ష‌కుల్లో ఎలాంటి ఆద‌ర‌ణ పొందుతుందోన‌నే టెన్ష‌న్ యూనిట్‌లో ఉండిపోయింది. మ‌రి `టాక్సీవాలా`తో విజ‌య్ మ‌రో స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడా? నిర్మాత‌ల క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కిందా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే ముందు క‌థేంటో చూద్దాం..

క‌థ‌:

శివ (విజయ్ దేవరకొండ) ఐదేళ్లలో అతి కష్టం మీద డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసమని హైదరాబాద్ వస్తాడు. రకరకాల ఉద్యోగాలు చేసి.. చివరికి వాటన్నిటికంటే మెరుగైందని భావించి క్యాబ్ డ్రైవర్ కావాలనుకుంటాడు. అతడి దగ్గరున్న తక్కువ డబ్బులకు పాతికేళ్ల ముందు నాటి పాత కారు మాత్రమే వస్తుంది. తన అన్న, వదినల సాయంతో పాత టాక్సీని తక్కువ ధరకు కొనుగోలు చేస్తాడు. కుటుంబ బాధ్యతల్ని మోస్తూ.. అన్నా వదినలకు అండగా ఉంటాడు. మొదటి పరిచయంలో డాక్టర్ అనూష (ప్రియాంక జువర్కర్), శివలు ప్రేమలో పడతారు. సాఫీగా సాగిపోతున్న శివ జీవితంలో ఊహించని మలుపు తిరుగుతుంది. తన టాక్సీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకోవడంతో అందులో దెయ్యం ఉందని తెలుసుకుంటాడు. అనుకోకుండా తన కారు ఎక్కిన డాక్టర్ (ఉత్తేజ్)ని టాక్సీలో ఉన్న దెయ్యం శివ కళ్ల ముందే చంపేస్తుంది. దాంతో తనకు కారు అమ్మిన ఓనర్ రఘ రామ్ ( షిజూ) ఇంటికి వెళ్లిన శివకు ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. అత‌ని ద్వారా కారు‌లో ఉన్న దెయ్యం తాలూకు వివ‌రాలు తెలుస్తాయి. అస‌లింత‌కీ ఆ దెయ్యం వెన‌క క‌థేమిటి? ఎందుకు డాక్ట‌ర్‌ని చంపేసింది? ఆ కారు ఎవ‌రిది? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌:

తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మున్న క‌థే ఇది. ఈమ‌ధ్య త‌క్కువ‌య్యాయి కానీ… ఇదివ‌ర‌కు ఇంట్లో దెయ్యం, బంగ‌ళాలో దెయ్యం అంటూ వాటి చుట్టూ న‌డిచే క‌థ‌లు త‌ర‌చుగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చేవి. ఇలాంటి కాన్సెప్ట్‌లు తెలుగులో మంచి విజ‌యాల్ని సొంతం చేసుకున్నాయి. ఇక్క‌డ ప్ర‌త్యేక‌త ఏంటంటే దెయ్యం టాక్సీలో ఉండ‌టం. దాని చుట్టూ కొత్త‌గా హాస్యం పండించే ప్ర‌య‌త్నం చేశారు.

ఐతే నిజానికి ‘ట్యాక్సీవాలా’కు అతి పెద్ద ఆకర్షణ మాత్రం ఇందులోని వినోదమే. ముఖ్యంగా ప్రథమార్ధంలో సిచువేషనల్ కామెడీ ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది. విజయ్ చెప్పినట్లు ‘పెళ్ళిచూపులు’లో ప్రియదర్శి.. ‘అర్జున్ రెడ్డి’లో రాహుల్ రామకృష్ణ తరహాలో మరో కొత్త కమెడియన్ ‘ట్యాక్సీవాలా’లో మెరిశాడు. విష్ణు అనే కొత్త కుర్రాడు చాలా క్యాజువల్ గా భలే వినోదం పంచాడు. అతడితో పాటు మధునందన్ కూడా మెరిశాడు. వీళ్ల కామెడీకి తోడు విజయ్ వన్ లైనర్స్ కూడా భలేగా పేలాయి. భారీ సన్నివేశాలు.. సెటప్ ఏమీ లేకుండానే సింపుల్ గా ప్రథమార్ధంలో వినోదం పండించాడు రాహుల్ సంకృత్యన్. హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్.. మాటే వినదుగా పాట కూడా కొంత వరకు ఎంగేజ్ చేస్తాయి. కారు-దయ్యం కాన్సెప్ట్ కూడా బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. ఇంటర్వెల్ మలుపు ఆకట్టుకుంటుంది. మొత్తంగా మొదటి అర్ధభాగంలో ‘ట్యాక్సీవాలా’ మనసులు గెలుస్తాడు.

ఈ సినిమాలో కీ రోల్ పోషించిన మాళవిక నాయర్‌ని ‘టాక్సీవాలా’ టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఎమోషన్స్ సీన్స్‌ బాగా పండించింది. ఈ చిత్రంలో విజయ్‌కి వదినగా నటించిన కళ్యాణి, మాళవిక తల్లిగా నటించిన యమునలు తమ సీనియారిటీ మరోసారి తెరపై చూపించారు. మధునందన్, జబర్దస్త్ చమ్మక్ చంద్ర కామెడీతో నవ్వులు పూయించారు. ముఖ్యంగా విజయ్‌కి స్నేహితుడిగా నటించిన తన రియల్ లైఫ్ ఫ్రెండ్ విష్ణు.. ‘హాలీవుడ్’ క్యారెక్టర్‌లో పొట్ట చెక్కలు చేశారు. మంచి టైమింగ్‌తో తెలంగాణ యాసతో ఆకట్టుకున్నాడు. మార్చురీ సీన్‌‌లో ఒకప్పటి సునీల్‌ని గుర్తుచేశాడు.

నటీనటులు:

విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రోసారి త‌న పాత్ర‌లో ఒదిగిపోయారు. త‌న పాత సినిమాల తాలూకు ఇమేజ్‌తో సంబంధం లేకుండా పాత్ర‌లో ఎలా క‌నిపించాలో అలాగే చేశారు. క‌థానాయిక ప్రియాంక జ‌వాల్క‌ర్ పాత్రకి పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. కానీ ఆమె తెర‌పై క‌నిపించిన విధానం మాత్రం బాగుంది. ఒక ట్యాక్సీ డ్రైవర్ గానే చూస్తాం అతడిని. స్టైలింగ్ అదీ మరీ మోడర్న్ గా ఉండటం ఇబ్బందే కానీ.. బాడీ లాంగ్వేజ్.. పెర్ఫామెన్స్ పరంగా విజయ్ పర్ఫెక్ట్ గా చేశాడు. సహజమైన నటనతో.. తనదైన శైలి డైలాగ్ డెలివరీతో విజయ్ మెప్పించాడు. హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ చూడ్డానికి క్యూట్ గా ఉంది. నటన పరంగా ఆమె రుజువు చూసుకునేంత స్కోప్ ఈ క్యారెక్టర్ ఇవ్వలేదు. ద్వితీయార్ధంలో ఆమెకు అస్సలు అవకాశం లేకపోయింది. మాళవిక నాయర్ కు స్క్రీన్ టైం తక్కువే అయినా కీలకమైన పాత్ర కావడంతో ఆమె తన ప్రత్యేకతను చాటుకుంది. హీరో స్నేహితులుగా సపోర్టింగ్ రోల్ లో మధునందన్ తో పాటు కొత్త కుర్రాడు విష్ణు అదరగొట్టారు. సినిమాలో కామెడీ క్రెడిట్ ప్రధానంగా వీళ్లిద్దరిదే. చమ్మక్ చంద్ర కూడా ఉన్న కాసేపు నవ్వించాడు.

సాంకేతికవర్గం:

తెర‌పై దాన్ని తీర్చిదిద్దిన విధానం కూడా బాగుంది. శ్రీజిత్ స‌న్నివేశాల కూర్పు బాగా కుదిరింది. యువీ క్రియేష‌న్స్‌, జీఏ2 సంస్థ‌ల స్థాయిలో నిర్మాణ విలువ‌లున్నాయి. యువ ద‌ర్శ‌కుడు రాహుల్ సంక్రిత్యాన్ కాన్సెప్ట్‌ని అల్లుకున్న విధానం, దాన్ని తెర‌పైకి తీసుకురావ‌డంలో స్ప‌ష్ట‌త మెచ్చుకోద‌గిన రీతిలో ఉంది. నిర్మాణ విలువలు సినిమాలకు తగ్గట్లుగా ఉన్నాయి. దర్శకుడు రాహుల్ సంకృత్యన్.. రచయిత సాయికుమార్ రెడ్డి తమ పనితనం చూపించారు. స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా అనిపిస్తుంది. మాటలన్నీ సందర్భానుసారం వచ్చేవే. రాహుల్ హార్రర్ థ్రిల్లర్లను బాగా డీల్ చేయగలనని చాటుకున్నాడు. అతను ఈ తరం దర్శకుడని సినిమాలో చాలా చోట్ల తెలుస్తుంది. అతనెంచుకున్న పాయింట్ కొత్తదే కానీ.. సినిమాలో అంత కన్విన్సింగ్ గా చెప్పలేకపోయాడు. ఐతే సిచువేషనల్ కామెడీ పండించడంలో.. కథకు కీలకమైన సన్నివేశాల్ని డీల్ చేయడంలో అతడి పనితనం కనిపిస్తుంది.

చివరగా: ట్యాక్సీవాలా.. ఒక రైడ్ వేస్కోవచ్చు!

రేటింగ్‌: 3.0