శంభో శంకర రివ్యూ
Spread the love

తారాగ‌ణం: శ‌ంక‌ర్‌, కారుణ్య‌, నాగినీడు, అజ‌య్ ఘోష్‌, ర‌విప్ర‌కాశ్‌, ఏడిద శ్రీరాం, ప్ర‌భు త‌దిత‌రులు

సంగీతం: సాయికార్తిక్‌

కెమెరా: రాజ‌శేఖ‌ర్‌

కూర్పు: ఛోటా కె.ప్ర‌సాద్‌

నిర్మాత‌లు: వై.ర‌మణారెడ్డి

ద‌ర్శ‌క‌త్వం: శ‌్రీధ‌ర్ ఎన్‌

క‌మెడియ‌న్స్ హీరోలుగా మారి విజ‌యాలు అందుకుంటున్నారు. ఒక‌వైపు క‌మెడియ‌న్‌గా రాణిస్తూమ‌రో ఒక వైపు హీరోలుగా సినిమాలు చేసుకుంటున్నారు. అలాంటి క‌మెడియ‌న్ ట‌ర్న్‌డ్ హీరోల్లో ష‌క‌ల‌క శంక‌ర్ అడుగుపెట్టారు. తొలి చిత్రం శంక‌ర‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. మైసూర్ పాక్‌లో మైసూరు, బందరు ల‌డ్డుల్లో బంద‌రు ఎలా ఉండ‌దో క‌మిడియ‌న్లు హీరోగా చేసే సినిమాల్లో కామెడీ ఉండ‌ద‌ని ఆడియ‌న్స్ ఫిక్స‌యిపోవాల్సివ‌స్తోంది. అదేంటో క‌మిడియ‌న్ల ద‌గ్గ‌ర ఓ చెడ్డ అల‌వాటు ఉంది.

క‌థ‌:

ప్రెసిడెంటు (అజ‌య్ ఘోష్‌) దౌర్జ‌న్యాల‌కు, అవినీతికి బ‌లైపోతున్న గ్రామం అది. పోలీసులు కూడా ప్రెసిడెంటు మ‌నుషులే. అందుకే ఆ ఊరికి క‌ష్టాలు ఎక్కువైపోతాయి. ఎలాగైనా పోలీసై ఆ ఊరిని క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కించాల‌ని భావించే కుర్రాడు శంక‌ర్ (ష‌క‌ల‌క శంక‌ర్‌). ప్రెసిడెంటుకి ఎదురు తిరిగిన పాపానికి, చేతుల్లోకి వ‌చ్చిన పోలీసు ఉద్యోగం పోగొట్టుకుంటాడు. ఓసారి పోలీస్ సెల‌క్ష‌న్స్‌లో ఎంపికైన శంక‌ర్‌ను ప‌క్క‌న పెట్టేస్తారు. నీటి స‌మ‌స్య ఊరిని, రైతుల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తుంటుంది. ప్రెసిడెంట్ స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోడు. శంక‌ర్ చెల్లెల్ని ప్రెసిడెంట్ కొడుకు ప్రేమ పేరుతో లొంగ‌దీసుకోవాల‌నుకుంటాడు. ఆమె ఎదురు తిర‌గ‌డంతో ఆమెను చంపేస్తాడు. దాంతో శంక‌ర్, ప్రెసిడెంట్ కొడుకుని చంపేస్తాడు.ఎస్‌.పి(నాగినీడు)కి శంక‌ర్ గురించి తెలుసు కాబ‌ట్టి అత‌ను శంక‌ర్‌ని త‌న పూచీ క‌త్తుపై విడుద‌ల చేస్తాడు. శంక‌ర్ వెళ్లి ప్రెసిడెంట్‌ని ఢీ కొట్టాల‌నుకుంటాడు. అప్పుడు శంక‌ర్ ఏం చేస్తాడు? ప‌్రెసిడెంట్ ఏం చేస్తాడు? క‌థ చివ‌ర‌కి ఏమ‌వుతుందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌:

ఓ మాస్ హీరో కోసం క‌థ రాసుకుని `ఇలాంటి క‌థ నేను చేయ‌ను బాబోయ్‌` అంటూ వాళ్లు తిప్పి కొడితే దాన్ని ష‌క‌ల‌క శంక‌ర్‌తో లాగించేసిన‌ట్టుంది. క‌మెడియ‌న్ హీరోలుగా మారిన హీరోలుగా వారి స‌క్సెస్ రేట్ అంతంత మాత్ర‌మే. కొంద‌రు క‌మెడియ‌న్స్‌గా అవ‌కాశం ఉన్న‌ప్పుడ‌ల్లా హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. హీరో కావాల‌ని ఆశ ప‌డ్డ ష‌క‌ల‌క శంక‌ర్‌.. ఓ మంచి క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సింది. ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ క‌థంతా ఓ ప‌ల్లెటూరిని బేస్ చేసుకుని రాసుకున్నాడు. స‌న్నివేశాల‌ను లింకుల‌తో రాసుకున్నాడా? అంటే లేద‌నే చెప్పాలి. ప్ర‌తి సీన్ ఎందుకు వ‌స్తుందో.. ఎందుకు ఎండ్ అవుతుందో అనే చందాన తెర‌పై మ‌న‌కు క‌న‌ప‌డుతుంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభిమానిగా శంక‌ర్ త‌నని చూపించుకునే ప్ర‌య‌త్నం చేశాడు కానీ.. ఆ అభిమానం మ‌రి ఎక్కువైంది. హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ ఫ‌స్టాఫ్ ఓ గోల్ లేకుండా ఉంటుంది.

ఓ చోట హీరో హీరోయిన్లు కౌగిలించుకుని డ్రీముల్లోకి వెళ్లిపోతారు. అది చూస్తే ‘ఇక్క‌డ పాటొస్తుందేమో’ అన్నంత భ‌యం వేస్తుంది. అది ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కూ అర్థ‌మైపోయి.. డైరెక్ట్‌గా నెక్ట్స్ సీన్‌లోకి వెళ్లిపోయారు. దాంతో.. ‘హ‌మ్మ‌య్య‌’ అనుకున్నారు ఆడియ‌న్స్‌. దీన్ని బ‌ట్టి… వాళ్ల కెమెస్ట్రీ, రొమాన్స్ ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోండి.

ఇవ‌న్నీ ఒక యెత్తు. క్లైమాక్స్ మ‌రో ఎత్తు. ‘ఈ సినిమాకి ఇదే ప్రాణం.. దీని కోసమే సినిమా తీశాం’ అన్న‌ట్టుగా ఓ ట్విస్టు దాచారు. అది చూసి ప్రేక్ష‌కుడేం ఆశ్చ‌ర్య‌పోడు. ‘దీని కోసం ఇంకొచెం సేపు ఈ సినిమా చూడాలా’ అన్న భ‌యం వేస్తుంది. అలా మొత్తానికి శంక‌రుడు… అను క్ష‌ణం స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తూ.. కాస్త కాస్త హింసిస్తూ ముందుకు పోయాడు.

న‌టీన‌టులు:

శంక‌ర్‌కి ఏదో చేయాల‌న్న త‌ప‌న ఉంది. కానీ ఈ క‌థ స‌రైన వేదిక కాదు. త‌న‌లోని కామెడీని చంపేసుకుంటూ సీరియెస్‌నెస్ పలికిద్దామ‌ని చేసిన ప్ర‌య‌త్నాల్లో త‌న వ‌ర‌కూ విజ‌య‌వంత‌మైనా వాటిని చూడ్డానికి ప్రేక్ష‌కుడు ఇంకా సిద్ధంగా లేడ‌న్న విష‌యాన్ని గుర్తించాలి. డాన్సులు, ఫైట్లు బ్ర‌హ్మాండంగా చేశాడు. కాక‌పోతే పాట‌ల‌కు డూప్‌ని పెట్టి చేయిస్తున్న‌ట్టు అనిపించింది.

సాంకేతికంగా:

సాయికార్తిక్ రిజెక్టెడ్ ట్యూన్లు ఇక్క‌డ వాడుకునే అవ‌కాశం ద‌క్కింది. పెద్ద హీరో కి ఇచ్చిన‌ట్టు భీక‌ర‌మైన ఆర్‌.ఆర్ కొట్టేశాడు. శంక‌ర్‌కి స‌రిప‌డా క‌థ‌, సన్నివేశాలు రాసుకోవ‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యాడు. నిర్మాణ విలువ‌లూ అంతంత‌మాత్రంగానే ఉన్నాయి.

రేటింగ్‌:1.5/5