మూవీ రివ్యూ: ‘సవ్యసాచి’
Spread the love

న‌టీన‌టులు: నాగ‌చైత‌న్య‌, నిధి అగ‌ర్వాల్, ఆర్.మాధ‌వ‌న్, భూమిక, వెన్నెల కిషోర్, స‌త్య, రావు ర‌మేష్, తాగుబోతు ర‌మేష్ త‌దిత‌రులు.

స‌ంగీతం: ఎం.ఎం.కీర‌వాణి

కూర్పు: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు

ఛాయాగ్ర‌హ‌ణం: యువ‌రాజ్‌

క‌ళ‌: రామ‌కృష్ణ‌

పోరాటాలు: రామ్‌ల‌క్ష్మ‌ణ్‌

నిర్మాత‌లు: న‌వీన్ యేర్నేని, ర‌విశంక‌ర్.వై, మోహ‌న్ చెరుకూరి(సివిఎం)

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: చ‌ందూ మొండేటి.

సంస్థ: మైత్రి మూవీ మేకర్స్

తొలి సినిమా ‘కార్తికేయ’తోనే తన ప్రత్యేకతను చాటుకున్న యువ దర్శకుడు చందూ మొండేటి.. ఆ తర్వాత ‘ప్రేమమ్’ రీమేక్ తోనూ మెప్పించాడు ఇప్పుడతను తన సొంత కథతో నాగచైతన్య హీరోగా తెరకెక్కించిన ‘సవ్యసాచి’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గర్భంలోనే ఇద్దరు కవలలు ఒకరిగా కలిసిపోతే ఏమవుతుందనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్ర‌మిది. మాధ‌వ‌న్ ఇందులో కీల‌క పాత్ర పోషించ‌డంతో సినిమాపై ఆస‌క్తి, అంచ‌నాలు పెరిగాయి. మ‌రి ఈ కాన్సెప్ట్‌, కాంబినేషన్‌ రేకెత్తించిన ఆస‌క్తి సినిమాలోనూ క‌నిపించిందా? ‘స‌వ్య‌సాచి’గా నాగ‌చైత‌న్య ఎలా ఉన్నాడు? ఆయ‌న‌కి ఈ చిత్రంతో ఎలాంటి ఇమేజ్ ల‌భించింది? త‌దిత‌ర విష‌యాలు తెలుసుకుందాం పదండి.

కథ:

విక్రమ్ (నాగచైతన్య) ఒక చిత్రమైన లక్షణంతో పుట్టిన కుర్రాడు. అతడి ఎడమ చేయి తన మాట వినదు. కవల సోదరుడిగా పుట్టాల్సిన వాడు.. అతడి శరీరంలో ఒక చేయిగా మారతాడు. ఆ చేతికి స్పర్శ వేరు. దాని ఆలోచనలు వేరు. ఈ చేతి వల్ల విక్రమ్ తరచుగా ఇబ్బందులు పడుతుంటాడు. దాన్ని అసహ్యించుకుంటూ ఉంటాడు. ఇలాగే పెరిగి పెద్దయిన విక్రమ్.. కాలేజీలో తన జూనియర్ అయిన చిత్రను ప్రేమిస్తాడు. అనుకోని కారణాలతో ఆమెకు దూరమైన విక్రమ్.. ఆరేళ్ల తర్వాత తిరిగి ఆమెను కలుస్తాడు. ప్రేయ‌సికి మ‌ళ్లీ ద‌గ్గ‌రై ఆనందంగా గ‌డుపుతున్న స‌మ‌యంలోనే విక్ర‌మ్ ఆదిత్య అక్క శ్రీదేవి (భూమిక‌) ఇంట్లో బాంబు పేలుతుంది. బావ చ‌నిపోగా, త‌న‌కి ఎంతో ఇష్ట‌మైన అక్క కూతురు మ‌హాల‌క్ష్మి కిడ్నాప్‌కి గుర‌వుతుంది. ఇంత‌కీ ఆ బాంబు పేలుడు వెన‌క ఎవ‌రున్నారు? కిడ్నాప్‌కి గురైన అక్క కూతురు మహాల‌క్ష్మిని విక్ర‌మ్ ఆదిత్య ఎలా ర‌క్షించాడు? ఎడ‌మ చేతిలో ఉన్న ఆదిత్య ఎలా సాయం చేశాడు? ఈ క‌థ‌లో అరుణ్ (మాధ‌వ‌న్ ) ఎవ‌రు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

హీరో ఎడమ చేయి అతడి మాట వినదు. అది వేరే మనిషి. దాని ఆలోచన వేరు. దాని ప్రవర్తన వేరు. వినడానికి చాలా ఎగ్జైటింగ్ గా అనిపించే కాన్సెప్ట్ ఇది. ‘సవ్యసాచి’ ఆరంభంలో ఈ కాన్సెప్ట్ ను పరిచయం చేస్తూ కన్విన్స్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. మరి ఈ వినూత్నమైన ఆలోచన చుట్టూ దర్శకుడు కథను ఎలా అల్లుతాడా.. సన్నివేశాల్ని ఎలా నడిపిస్తాడా అని ఎంతో ఆసక్తిగా చూస్తాం. కానీ ఆరంభంలో ఉన్న క్యూరియాసిటీకి.. ఆ తర్వాత నడిచే వ్యవహారానికి సంబంధం ఉండదు. ‘సవ్యసాచి’లో యునీక్ గా అనిపించిన.. ఎంతో ఆసక్తికరంగా అనిపించిన పాయింట్ గురించి గంట గడిచాక పూర్తిగా మరిచిపోతాం. కథకు కీలకమైన పాయింట్ ను పక్కన పెట్టేసి ఒక సగటు లవ్ స్టోరీ.. కామెడీ ట్రాక్ చూపిస్తాడు చందూ. ఈమాత్రం దానికి ఈ పాయింట్ ఎంచుకోవడం దేనికి అనే ఫీలింగ్ కలుగుతుంది.

నటీనటులు:

నాగచైతన్య తన కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ పాత్రలో రాణించాడు. ప్రథమార్ధం వరకు అతడి పాత్ర మామూలుగా అనిపించినా.. ద్వితీయార్ధంలో ప్రత్యేకత చాటుకుంటుంది. ఈ పాత్రలోని ఇంటెన్సిటీని చూపించే సన్నివేశాల్లో చైతూ ఆకట్టుకున్నాడు. కామెడీ, రొమాన్స్‌, ఎమోషనల్‌ సీన్స్‌తో పాటు యాక్షన్‌ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో డ్యాన్స్‌ కూడా చాలా బాగా చేశాడు చైతూ.

సాంకేతికవర్గం:

కీరవాణి సంగీతం ఓకే. సవ్యసాచి థీమ్ సాంగ్.. ఒక్కరంటే ఒక్కరు.. వైనాట్ పాటలు బాగున్నాయి. పాటల చిత్రీకరణ కూడా ఆకట్టుకుంటుంది. ప్రథమార్ధం వరకు నేపథ్య సంగీతం మామూలుగా అనిపించినా.. ద్వితీయార్ధంలో ప్రత్యేకత చాటుకుంటుంది. నేపథ్య సంగీతం యాక్షన్‌, ఎమోషనల్‌ సీన్స్‌కు మరింత హైప్‌ తీసుకువచ్చింది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ ;

క‌థ‌

నాగచైతన్య, మాధవన్‌ నటన

యాక్షన్‌ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌ ;

రొటీన్‌ టేకింగ్

రేటింగ్-2.5/5