‘సంజు’ రివ్యూ
Spread the love

నటీనటులు: రణ్‌బీర్‌ కపూర్‌, విక్కీ కౌశల్‌, మనీశా కోయిరాలా, పరేశ్‌ రావల్‌, సోనమ్‌ కపూర్‌, అనుష్క శర్మ, దియా మీర్జా, టబు, షియాజీ షిండే తదితరులు

సంగీతం: ఏ.ఆర్‌ రెహమాన్‌(సంజయ్‌ నటించిన సినిమాలోని పాటలు కూడా వాడారు)

సినిమాటోగ్రఫీ: రవి వర్మన్‌

కూర్పు: రాజ్‌కుమార్‌ హిరాణీ

నిర్మాణ సంస్థలు: రాజ్‌కుమార్‌ హిరాణీ ఫిలింస్‌

నిర్మాతలు: విధు వినోద్‌ చోప్రా, రాజ్‌కుమార్‌ హిరాణీ

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజ్‌కుమార్‌ హిరాణీ

బాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో ఎన్నో బయోపిక్‌లు వచ్చాయి కానీ ‘సంజు’ బయోపిక్‌పై ఉన్న అంచనాలు మరే సినిమాపై లేవనే చెప్పాలి. సంజయ్‌ దత్‌ జీవితాధారంగా బయోపిక్‌ తెరకెక్కించాలనుకుంటున్నట్లు దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ ప్రకటించినప్పుడే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ట్రైలర్‌తో, పోస్టర్లతో సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో రెట్టింపైంది. మొత్తానికి ‘సంజు’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పైగా సక్సెస్‌ లేక సతమతమవుతున్న యువ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ను సంజు రోల్‌కు తీసుకోవటం ఆశ్చర్యం కలిగించింది. అయితే ట్రైలర్‌-ప్రొమోల్లో అచ్చం సంజు బాబాల కనిపించిన రణ్‌బీర్‌ ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చాడు. భారీ అంచనాల మధ్య సంజు ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సంజుగా రణ్‌బీర్‌ ఏమేర అలరించాడో చూద్దాం…

కథేంటంటే:

సంజయ్‌ దత్‌(రణ్‌బీర్‌ కపూర్‌) తన జీవితాధారంగా రాసిన బయోగ్రఫీని చదువుతున్న సన్నివేశంతో సినిమా మొదలవుతుంది. ఆ బయోగ్రఫీలో ఓ చోట తనను మహాత్మా గాంధీతో పోలుస్తూ రాసుంటుంది. ఆ తర్వాత సినిమా వేగంగా సంజయ్‌ జీవితంలోకి వెళ్లిపోతుంది. కథానాయకుడిగా సంజయ్‌ అందుకున్న విజయాలు, గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఎఫైర్స్‌, మాదక ద్రవ్యాలకు అలవాటుపడటం ఇలా ఆయన జీవితంలోని ఒక్కో అంశాన్ని చూపించారు దర్శకుడు హిరాణీ. ఆయుధాల కేసులో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తనకు తానుగా లొంగిపోవాలని సంజు భావిస్తాడు. కానీ, అంతకు ముందే తన జీవిత కథగా మలిచేందుకు ప్రయత్నిస్తాడు. రచయిత కోసం ఎదురుచూస్తున్న తరుణంలో విన్నె(అనుష్క శర్మ) ముందుకు వస్తుంది. తన జీవితంలోని ముఖ్య ఘట్టాలను సంజు.. విన్నెకు వివరిస్తూ కథ సాగుతుంది.

ఎలా ఉందంటే:

మనకు బాగా తెలిసిన వ్యక్తి జీవితంలోని ఆసక్తికర అంశాలను కూలంకుశంగా తెలుసుకోవాలనే ఆసక్తి సహజం.‘ఒక్క మనిషి పలు కోణాలు’ అంటూ ట్యాగ్‌ లైన్‌తోనే సంజు జీవితంలోని దశలను దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ వివరించే యత్నం చేశాడు. అయితే వివాదాల నటుడు సంజయ్‌ దత్‌ లైఫ్‌ను తెరపై హిరాణీ డీల్‌ చేసిన విధానం అద్భుతం. వివాదాలను కూడా ఎమోషనల్‌గా మలిచిన తీరుకు హ్యాట్సాఫ్‌ చెప్పకుండా ఉండలేం. తన జీవితంలో ఎత్తుపల్లాలను పూసగూచ్చినట్లు వివరిస్తూ సంజు కథ ముందుకు సాగుతుంది. తల్లి మరణం, హీరోగా ఎదిగే క్రమంలో డ్రగ్స్‌ అలవాటుతో సంజు సతమతమయ్యే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

ఆ అలవాటు నుంచి బయటపడ్డాక అక్రమ ఆయుధాలు కలిగున్న కేసు సంజు మెడకు చుట్టుకుంటుంది. అయితే ఆ కేసుతో సంజయ్‌కు ఉన్న సంబంధమేంటి? అతను నేరం చేశాడా? ఆయన నిజజీవితంలో కథానాయకుడా? ప్రతినాయకుడా? అనే విషయాలను ‘సంజు’ సినిమాలో చూపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చివర్లో సంజయ్‌ దత్‌ కొన్ని క్షణాలు కన్పించి సర్‌ప్రైజ్‌ చేయడం ఆకట్టుకుంటుంది.

నటీనటుల విషయానికొస్తే..

ఇందులో టైటిల్‌ పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ నటించారు. కానీ సినిమా చూస్తున్నంత సేపు తెరపై ఉన్నది సంజయే అనిపిస్తుంది. అంతలా లీనమై నటించారు. ఆయన నటనకు తోడు మేకప్‌ కూడా చక్కగా సరిపోయింది. సంజు తల్లి నర్గిస్‌ దత్‌ పాత్రలో మనీశా కోయిరాలా, తండ్రి సునీల్‌ దత్‌ పాత్రలో పరేశ్‌ రావల్‌ నటించారు. నర్గిస్‌ పాత్రలో మనీశాను తప్ప మరెవర్నీ ఊహించలేం అన్నంతగా పాత్రలో ఒదిగిపోయారు. సునీల్‌గా పరేశ్‌ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చూస్తే నిజంగానే వారు తండ్రీకొడుకుల్లాగే అనిపిస్తారు. ఇక దియా మీర్జా సంజయ్‌ రెండో భార్య మాన్యత పాత్ర పోషించారు. ఇక సంజు బెస్ట్‌ ఫ్రెండ్‌ కమలేష్‌(విక్కీ కౌశల్‌) పాత్ర సినిమాకు మరో ఆకర్షణ. కష్టాల్లో ఉన్న స్నేహితుడికి అండగా ఉండటం, సంజు-కమలేష్‌ కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు మంచి అనుభూతిని కలిగిస్తాయి. నర్గీస్‌ దత్‌ పాత్రలో సీనియర్‌ నటి మనీషా కోయిరాలాకు పెద్దగా సీన్లు లేవు. అయినా ఉన్నంతలో ఆమె పాత్ర అలరిస్తుంది. భార్య మాన్యతా పాత్రలో దియా మీర్జా మెప్పించారు. సోనమ్‌ కపూర్‌, అనుష్క శర్మ, మిగతా పాత్రలు ఓకే. పలువురు సెలబ్రిటీలు, చివర్లో కాసేపు స్వయంగా  సంజయ్‌ దత్‌ కనిపించటం ఆకట్టుకుంది.

బలాలు:

రణ్‌బీర్‌కపూర్‌, మనీశా, పరేశ్‌ నటన

కథనం

సంగీతం

మిగతా పాత్రలు

బలహీనతలు:

అక్కడక్కడా అనవసరమైన సన్నివేశాలు

కొన్ని ఆసక్తికరమైన అంశాలను చూపించకపోవటం

రేటింగ్:2.5/5