‘పేపర్‌ బాయ్‌’ మూవీ రివ్యూ
Spread the love

నటీన‌టులు: సంతోష్‌ శోభ‌న్, రియా సుమ‌న్, తాన్యా హోప్, పోసాని కృష్ణ‌ముర‌ళి, అభిషేక్ మ‌హ‌ర్షి, విద్యురామ‌న్, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, బిత్తిరి స‌త్తి, స‌న్నీ, మ‌హేశ్ విట్టా త‌దిత‌రులు

సంగీతం: భీమ్స్ సిసిరేలియో

ఛాయాగ్ర‌హ‌ణం: సౌంద‌ర్ రాజన్

కూర్పు: త‌మ్మిరాజు

క‌ళ‌: రాజీవ్

నిర్మాత‌లు: స‌ంప‌త్ నంది, రాములు, వెంక‌ట్, న‌ర‌సింహా

ద‌ర్శ‌కత్వం: జ‌య‌శంక‌ర్

సంస్థ‌: స‌ంప‌త్ నంది టీం వ‌ర్క్స్, బిఎల్ఎన్ సినిమా, ప్ర‌చిత్ర క్రియేష‌న్స్

దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ ‘తను నేను’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. హీరోగా తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంతోష్.. ఇప్పుడు ‘పేపర్ బాయ్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప‌రిమిత వ్య‌యంతో తెర‌కెక్కుతున్న చిత్రాలు కూడా ఈ మ‌ధ్య విభిన్న‌మైన క‌థ‌, క‌థ‌నాలతో ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నాయి. ఆ ర‌కంగా కూడా `పేప‌ర్‌బాయ్` విడుద‌ల‌కి ముందే ప్రేక్ష‌కుల్ని ఆక‌ర్షించింది. `గోల్కొండ హైస్కూల్‌`, `త‌ను నేను` చిత్రాల్లో న‌టించిన సంతోష్ శోభ‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

కథ:

డాక్టర్ మేఘ (తాన్య హోప్) ప్రాణాంతక వ్యాధితో మరికొద్ది రోజుల్లో చనిపోబోతుంది. దేవుడు ప్రతి వ్యక్తిని ఒక పర్పస్ కోసం పుట్టిస్తాడని, తను మాత్రం దాన్ని పూర్తిచేయకుండానే చనిపోతున్నానని బాధపడుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో తనకు ఒక డైరీ దొరుకుంది. అది రవి (సంతోష్ శోభన్) రాసుకున్న డైరీ. దీనిలో ధరణి (రియా సుమన్) ప్రేమ గురించి రాసుకుంటాడు. బీటెక్ చదివిన పేదింటి కుర్రాడు రవి. తల్లిదండ్రులకు సాయంగా ఇంటింటికీ పేపర్ వేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో గద్వాల్ రెడ్డి కుమార్తె ధరణిని ప్రేమిస్తాడు. ఆమె కూడా రవిని ప్రేమిస్తుంది. వీరి పెళ్లికి గద్వాల్ రెడ్డి ఒప్పుకుంటాడు. అయితే అమెరికా నుంచి వచ్చిన ధరణి ఇద్దరు అన్నయ్యలకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఇష్టం ఉన్నట్లే నటిస్తుంటారు. మరి వాళ్లు వీరి పెళ్లికి అడ్డుపడ్డారా..? రవి, ధరణిల ప్రేమకథలో మేఘ పాత్ర ఏమిటి..? వీరి ప్రేమకథ ఎలా ముగిసింది..?

విశ్లేషణ ;

ఓ పేదింటి కుర్రాడు.. పెద్దింటి అమ్మాయి మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థే ఈ చిత్రం. ప్రేమ‌లో నిజాయ‌తీ ఉంటే చాల‌ని చెప్పే ఈ క‌థ‌లో కొత్త‌ద‌నం అంటూ ఏమీ లేదు. నేప‌థ్య‌మే కాస్త కొత్త‌గా అనిపిస్తుంది.  ప్ర‌తి స‌న్నివేశం ప్రేక్ష‌కుడి ఊహ‌కు త‌గ్గ‌ట్టుగానే సాగుతుంటుంది. ప‌తాక స‌న్నివేశాలైతే మ‌రీ సాధార‌ణంగా అనిపిస్తాయి. పాత క‌థే అయినా.. సినిమా మొత్తం రిచ్‌గానే సాగుతుంది. క‌థానాయ‌కుడు పేప‌ర్‌బాయ్ అనే విష‌యం అప్పుడ‌ప్పుడు గుర్తు చేయ‌డం మిన‌హా ఆ పాత్ర‌ని నిజంగా ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడిగా, ఆ జీవితానికి అద్దం ప‌ట్టేలా చూపించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు ద‌ర్శ‌కుడు. ఛాయాగ్రాహ‌కుడు సౌంద‌ర్ రాజ‌న్ ప్ర‌తి ఫ్రేమ్‌నీ అందంగా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. దాంతో సినిమా మొత్తం రిచ్ ఫ్లేవ‌ర్‌లోనే సాగుతుంది.

సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సంపత్ నంది డైలాగులు గురించి. ప్రేక్షకులకు చాలా సులభంగా కనెక్ట్ అయ్యే డైలాగులు ఆయన రాశారు. ‘ముద్దంటే పెదవులు మార్చుకోవడం కాదు ఊపిరి మార్చుకోవడం’, ‘అది బతకడం కోసం, ఇది భవిష్యత్తు కోసం’ వంటి డైలాగులు ఆకట్టుకుంటాయి. భీమ్స్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. అలాగే సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సన్నివేశాలకు బలాన్ని చేకూర్చాయి.

ఎవరెలా చేశారంటే:

హీరో సంతోష్ శోభన్ పేపర్ బాయ్‌గా బాగా సరిపోయాడు. అంతేబాగా నటించాడు. అతను డైలాగులు చెప్పే విధానం చాలా బాగుంది. సరదాగా నవ్విస్తూనే.. సున్నితమైన భావోద్వేగాలను తన కళ్లలో చూపించాడు. బిత్తిరి స‌త్తి, విద్యుల్లేఖ రామ‌న్ న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. ఇక మిగిలిన పాత్ర‌ల గురించి చెప్పుకోవా‌ల్సినంత ఏమీ లేదు.

సాంకేతిక విభాగం:

సినిమా ఉన్న‌తంగా ఉంది. సౌంద‌ర్ ‌రాజ‌న్ ఛాయాగ్రహ‌ణం సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. ముఖ్యంగా పాటల్ని చాలా బాగా చిత్రీక‌రించారు. రాజీవ్ క‌ళా నైపుణ్యం అడుగ‌డుగునా క‌నిపిస్తుంది. సంప‌త్ నంది రాసిన క‌థ‌, క‌థ‌నాల్లో కొత్త‌ద‌నం లేదు. భీమ్స్ పాటలు, సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం బాగున్నాయి. బిక్కిన తమ్మిరాజు ఎడిటింగ్ పనితనం కలిసొచ్చింది. సినిమాను మరీ ఎక్కువగా సాగదీయకుండా రెండు గంటల నిడివితో బాగా కుదించారు.

బ‌లాలు:

కెమెరా ప‌నిత‌నం

మాట‌లు

నేపథ్య సంగీతం

బ‌ల‌హీన‌త‌లు:

క‌థ‌, క‌థ‌నం

కొత్త‌ద‌నం కొర‌వ‌డ‌టం

చివరగా:  పేపర్ బాయ్.. మధ్యలో దారి తప్పాడు

రేటింగ్:2.5