పందెంకోడి 2 రివ్యూ
Spread the love

బ్యాన‌ర్స్‌: లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ ఎల్‌ఎల్‌పి, విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌

న‌టీనటులు విశాల్‌, కీర్తిసురేశ్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, రాజ్‌కిర‌ణ్, హ‌రీష్ పేర‌డే, గంజా క‌రుప్పు త‌దిత‌రులు

ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ కె.ఎల్‌

కెమెరా: కె.ఎ.శ‌క్తివేల్‌

సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా

నిర్మాతలు: విశాల్‌, దవళ్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతిలాల్‌ గడా

దర్శకత్వం: ఎన్‌.లింగుస్వామి

మాస్ హీరో విశాల్ కెరియర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది ‘పందెం కోడి’ సినిమా. 2005 సంవత్సరంలో విడుదలయిన ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి కొనసాగింపుగా 13 ఏళ్ల తరువాత తెరకెక్కిన ‘పందెం కోడి 2’ విజయదశమి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఆ త‌ర్వాత విశాల్‌కు భ‌ర‌ణి, పొగ‌రు చిత్రాలు కూడా తెలుగులో మంచి విజ‌యాన్ని అందించి మాస్ హీరోగా నిల‌బెట్టాయి. ఇలా తెలుగు, తమిళంలో ఆద‌ర‌ణ ఉన్న అతి త‌క్కువ మంది హీరోల్లో విశాల్ ఒక‌రయ్యారు. అలాంటి హీరో విశాల్ త‌న 25వ సినిమాగా త‌న‌కు బ్రేక్ ఇచ్చిన పందెంకోడి సీక్వెల్‌గా `పందెంకోడి 2`ని న‌టిస్తూ నిర్మించ‌డం విశేషం. మ‌రి ఈ `పందెంకోడి 2` విశాల్‌కు ఎలాంటి స‌క్సెస్‌ను అందించిందో తెలుసుకోవాలంటే క‌థేంటో చూడాల్సిందే.

క‌థ‌:

పందెం కోడిలో చూపినట్టుగానే విశాల్ తండ్రి చుట్టుపక్కల అన్ని ఊళ్లకీ పెద్ద, అయితే ఆ ఊళ్లన్నీ కలిసి చేసుకునే వీరభద్ర స్వామి జాతరలో చోటు చేసుకున్న చిన్న వివాదం చిలికి చిలికి రెండు కుటుంబాల మధ్య పగగా మారుతుంది. ఒక కుటుంబంలో అసలు వారసుడే లేకుండా చేయాలని మరో కుటుంబం ప్రయత్నిస్తుంది. ఇలాంటి సమయంలో బాలు తిరిగి సొంత ఊరికి వస్తాడు. కొన్నేళ్లుగా ఆగిన ఊరి జాతరను వైభవంగా జరిపించి ఫ్యాక్షన్ గ్రామాల్లో శాంతి నెలకొల్పడానికి రాజారెడ్డి ప్రయత్నిస్తుంటే భవాని మనుషులు అడ్డం పడుతుంటారు. వారిని అడ్డుకుని తండ్రి సంకల్పాన్ని బాలు ఎలా నెరవేర్చాడు అన్నది మిగతా కథ.

విశ్లేషణ:

మాస్ కథల్ని క్లాస్ కు కూడా నచ్చేలా చెప్పడం దర్శకుడు లింగుస్వామి స్టయిల్. ‘రన్’.. ‘పందెం కోడి’.. ‘ఆవారా’.. వీటన్నింటిలోనూ బోలెడంత యాక్షన్ ఉంటుంది. వాటిలో మాస్ అంశాలకు లోటు ఉండదు. కానీ ఆ కథల్ని స్టైలిష్ గా ప్రెజెంట్ చేసి అందరికీ ఆమోద యోగ్యంగా మార్చాడు లింగుస్వామి. ఎలాంటి ఇమేజ్ లేని విశాల్ ను కూడా ‘పందెంకోడి’లో మాస్ హీరోగా చూపించి మెప్పించాడతను.

ఈ సినిమాలో కామెడీ పార్ట్ అనేదేదైనా ఉందంటే అది కీర్తిసురేశ్ వ‌ల్ల‌నే క్రియేట్ అయ్యింది. త‌ను జాత‌ర‌లో వేసే స్టెప్పులు ఆక‌తాయి పిల్ల‌లాగా ప‌లికే డైలాగులు అన్ని ఫుల్ ఎన‌ర్జీతో ఉన్నాయి. ఇక వ‌ర‌ల‌క్ష్మి విల‌నిజం బావుంది. రివేంజ్ డ్రామాలో వ‌ర‌ల‌క్ష్మి న‌ట‌న త‌నలో కొత్త కోణాన్ని ఆవిష్క‌రింప‌చేస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో.. రాజారెడ్డి పాత్ర‌లో రాజ్‌కిర‌ణ్ మ‌రోసారి త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించారు. ఇక గంజా క‌రుప్పు, రాందాస్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల మేర న‌ట‌న‌తో ఆకట్టుకున్నారు. ఇక లింగుస్వామి సినిమాను షార్ప్‌గా తెర‌కెక్కించాడు. రివేంజ్ డ్రామానే అయినా.. ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించాడు. జాత‌ర‌లో విశాల్ ఫైట్‌తో పాటు విశాల్ తండ్రికి ఇచ్చిన మాట‌ను కాపాడుకునే క్ర‌మంలో తీసుకునే నిర్ణయాలు ఆక‌ట్టుకుంటాయి. ఇక రాందాస్ న‌ట‌న సినిమాకు ప్ర‌ధానంగా మారింది. సినిమాలో మీరా జాస్మిన్ పాత్ర ఏమైంద‌నే విష‌యాన్ని క్లారిటీతో చూపించ‌లేక‌పోయారు. అలాగే విల‌న్ ఇంటిలోని పిచ్చివాడు పాత్ర గురించి ఎక్క‌డా ప్ర‌స్తావించ‌రు కానీ.. చివ‌ర‌ల్లో మాత్రం చూపించేస్తారు. ఇక క్లైమాక్స్ ఏంట‌నేది పూర్తిగా తెలిసిపోయినా… ద‌ర్శ‌కుడు లింగుస్వామి ఆ పాయింట్‌ను డీల్ చేసిన తీరు బావుంది. అయితే కొన్ని స‌న్నివేశాల్లో లాజిక్స్ మిస్ అయ్యాయి. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

నటీనటులు:

యాక్షన్ ఘట్టాల్లో ఎలివేషన్ సీన్లలో అతడి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఎక్కడా ఓవర్ ద టాప్ అనిపించకుండా.. లింగుస్వామి స్టయిల్లో సింపుల్ గా తన పాత్రను చేసుకెళ్లాడు విశాల్. కీర్తి సురేష్ కూడా బాగా చేసింది. హీరోయిన్‌గా కీర్తి సురేష్‌కు మరో మంచి పాత్ర దక్కింది. తను గతంలో చేయని డిఫరెంట్ క్యారెక్టర్‌లో కీర్తి ఆకట్టుకుంది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆడియన్స్‌ను అలరించింది.

సాంకేతికవర్గం:

యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతంతో సినిమాకు పిల్లర్ లాగా నిలిచాడు. సినిమా నడతకు తగ్గట్లుగా అతను చక్కటి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. జాతర నేపథ్యంలో సాగే సన్నివేశాలకు యాక్షన్ ఎపిసోడ్లకు అతను నేపథ్య సంగీతం బలంగా నిలిచింది.

ప్ల‌స్ పాయింట్స్‌:

విశాల్ నటన

బ్యాగ్రౌండ్ స్కోర్

కెమెరా వ‌ర్క్‌

మైన‌స్ పాయింట్స్‌:

రొటీన్‌ స్టోరి

నేటివిటి

క‌థంతా ఓ చోట‌నే తిరుగుతుంటుంది.

రేటింగ్ : 2.5 / 5