‘నోటా‌’ మూవీ రివ్యూ
Spread the love

న‌టీన‌టులు: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మెహ్రీన్, స‌త్య‌రాజ్, నాజ‌ర్, సంచ‌న న‌ట‌రాజ‌న్‌, య‌షికా ఆనంద్‌, అన‌స్తాసియా, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు

క‌థ‌: షాన్ క‌రుప్పుసామి

సంగీతం: శ్యామ్ సిఎస్‌

ఛాయాగ్ర‌హ‌ణం: శంతన్‌ కృష్ణ‌ణ్ ర‌విచంద్ర‌న్

కూర్పు: రేమాండ్ డెరిక్ క్రాస్టా

నిర్మాణం: కేఈ జ్ఞాన‌వేల్ రాజా

ద‌ర్శ‌కత్వం: ఆనంద్ శంక‌ర్

సంస్థ‌: స‌్టూడియో గ్రీన్

యూత్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న విజయ్ దేవరకొండ మొదటిసారిగా ఒక పొలిటికల్ డ్రామాలో నటించారు. అదే ‘నోటా’. ఈ మూవీ ద్వారా ఆయన తమిళ సినీ పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టారు. ‘నోటా’ తమిళ వర్షన్‌లో ఆయనే స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. ఆ చిత్రం క‌ర్ణాట‌క‌, కేర‌ళ రాష్ట్రాల్లో కూడా విడుద‌లైంది. రాజ‌కీయ నేప‌థ్యంతో కూడిన చిత్రాలు చేయ‌డానికి అగ్ర క‌థానాయ‌కులు సైతం ఆలోచిస్తుంటారు. కానీ, విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థ‌ల ఎంపిక‌లో తాను ప్ర‌త్యేకం అని చాటుతూ రాజ‌కీయ ప్ర‌ధాన‌మైన ‘నోటా’ చేసారు. మ‌రి యువ ముఖ్యమంత్రిగా ఆయ‌న చేసిన సందడి ఎలా ఉంది? వ‌రుస విజ‌యాల ప‌రంప‌ర ఈ చిత్రంతోనూ కొన‌సాగిస్తాడా?

కథ:

వరుణ్ (విజయ్ దేవరకొండ) ముఖ్యమంత్రి వాసుదేవ్ (నాజర్) కొడుకు. తన తండ్రికి దూరంగా లండన్‌లో ఉంటాడు. అప్పుడప్పుడు హైదరాబాద్‌కు వచ్చి వెళ్తుంటాడు. వాసుదేవ్ అనుకోకుండా ఒక కేసులో ఇరుక్కుంటాడు. ఈ కేసు నుంచి తప్పించుకోవాలంటే సీఎం పదవిని తన వారసుడికి అప్పగించాలని వాసుదేవ్ విపరీతంగా నమ్మే ఓ స్వామీజీ చెప్తాడు. అస‌లు రాజ‌కీయం అంటే ఏంటో తెలియ‌ని వ‌రుణ్‌కి అప్ప‌ట్నుంచి వ‌రుస‌గా స‌వాళ్లు ఎదుర‌వుతాయి. అసలు రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియకుండా సీఎం పదవి చేపట్టిన వరుణ్.. జర్నలిస్టు మహేందర్(సత్యరాజ్) సాయంతో ప్రజలు మెచ్చే నాయకుడవుతాడు. ఈ క్రమంలో తన తండ్రి గురించి కొన్ని భయంకరమైన నిజాలు వరుణ్‌కు తెలుస్తాయి. మరోవైపు పైకోర్టులో అప్పీల్ చేసుకోవడంతో వాసుదేవ్‌కు బెయిల్ వస్తుంది. అయితే బెయిల్‌పై విడుదలైన వాసుదేవ్‌పై బాంబ్ దాడి జరుగుతుంది. ఈ దాడిలో వాసుదేవ్‌కు ఏమైంది? వాసుదేవ్ గురించి వరుణ్‌కు తెలిసిన నిజాలేంటి? అసలు వాసుదేవ్‌పై దాడి చేసింది ఎవరు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌:

అత్యంత ప్రజాధారణ ఉన్న సీఎం అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడం లేదా చనిపోవడం.. అసలు రాజకీయమంటేనే తెలియని ఆయన కొడుకు సీఎం కావడం.. ఆ తరవాత మంచి సీఎంగా ప్రజల మన్ననలు పొందడం.. రాజకీయ ప్రత్యర్థుల నుంచి సవాళ్లు ఎదుర్కోవడం.. ఇలాంటి అంశాలతో ఇప్పటి వరకు తెలుగులో సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా ‘లీడర్’, ‘భరత్ అనే నేను’ ఈ కోవకు చెందినవే. ‘నోటా’ కూడా ఇలాంటి సినిమానే. కాకపోతే దీనిలో కాస్త కొత్తధనం ఉంది. గత సినిమాల్లో తండ్రిని మంచోడిగా చూపించారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ శైలి, స‌న్నివేశాలు పండ‌టం మొద‌ల‌వుతుంది. అయితే ఆ జోరు చివ‌రివ‌ర‌కు కొన‌సాగుంటే ఈ సినిమా ఫ‌లితం మ‌రోలా ఉండేది. అల్ల‌ర్ల‌ని అదుపు చేయ‌డం కోసం ముఖ్య‌మంత్రి తీసుకునే నిర్ణ‌యాలు… మూడు రోజులు ఎవ్వ‌రూ బ‌య‌టికి రావొద్దంటూ అల్టిమేటం జారీ చేసిన విధానం అస‌లు సిస‌లు రాజకీయ డ్రామాని త‌ల‌పిస్తుంది. కానీ, ఆ త‌ర్వాత నుంచే క‌థ గాడి తప్పినట్లు అనిపిస్తుంది. రౌడీ సీఎం వ‌స్తున్నాడ‌ని చెప్పండి అంటూ విరామం స‌మ‌యంలో విజ‌య్‌ దేవ‌ర‌కొండ చెప్పిన డైలాగ్ ద్వితీయార్ధం వైపు ఆస‌క్తిగా చూసేలా చేసింది. అయితే, వ‌ర‌ద ముప్పు నుంచి త‌ప్పించ‌డం వంటి స‌న్నివేశాల వ‌ర‌కు మాత్ర‌మే ఎఫెక్టివ్‌గా అనిపించినా… ఆ త‌ర్వాత స‌న్నివేశాల‌న్నీ సాదాసీదాగా అనిపించాయి.

NOTA Movie Review in Telugu

నటీనటులు ;

సినిమాకు ప్రధాన బలం విజయ్‌ దేవరకొండ. ఒక్కో సినిమాలో ఒక్కో డిఫరెంట్‌ క్యారెక్టర్‌తో అభిమానులకు షాక్‌ ఇస్తున్నాడు విజయ్‌. సినిమా అంతా తన భుజాల మీదే నడిపించాడు. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో డిఫరెంట్‌ లుక్‌, క్యారెక్టరైజేషన్‌తో మెప్పించాడు. రౌడీ సీఎం పాత్రలో పర్ఫెక్ట్‌ గా సూట్‌ అయ్యాడు. యువ రాజకీయ ప్రత్యర్థి పాత్రలో సంచన నటరాజన్ నటన బాగుంది. ఇక హీరోయిన్ మెహ్రీన్ పాత్రకు అస్సలు ప్రాధాన్యత లేదు. ఎం.ఎస్.భాస్కర్, ప్రియదర్శి తమ పాత్రల పరిధి మేర నటించారు. దర్శకుడు ఆనంద్ శంకర్ గురువు ఎ.ఆర్.మురుగుదాస్ కూడా ఒక చిన్న పాత్రలో మెరిశారు.

సాంకేతికంగా:

స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మాణ విలువలు బాగున్నాయి. జ్ఞానవేల్ రాజా ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించినట్లు విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. ‘రామ్ లీల’, ‘హ్యాపీ న్యూ ఇయర్’ వంటి బాలీవుడ్ సినిమాలకు అసిస్టెంట్ కెమెరామెన్‌గా పనిచేసిన సంతాన క్రిష్ణన్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.

బ‌లాలు

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న

ప్ర‌థ‌మార్ధం

ఆర్ట్ వ‌ర్క్, లొకేష‌న్స్ బావున్నాయి.

ఆక‌ట్టుకునే కీల‌క స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు

క‌థ‌నం

డ్రామా పండ‌క‌పోవ‌డం

హీరోయిన్ పాత్ర‌కు స్కోపే లేదు

రేటింగ్: 2.5