‘నీవెవరో’ మూవీ రివ్యూ
Spread the love

న‌టీన‌టులు: ఆది పినిశెట్టి, తాప్సి, రితికా సింగ్, వెన్నెల‌కిషోర్‌, తుల‌సి, శివాజీరాజా, శ్రీకాంత్ అయ్య‌ర్‌, స‌త్య‌కృష్ణ‌న్‌, సప్త‌గిరి, ఆద‌ర్శ్ త‌దిత‌రులు : ఛాయాగ్ర‌హ‌ణం: సాయిశ్రీరామ్‌

క‌ళ‌: చిన్నా

కూర్పు: ప్ర‌దీప్ ఇ.రాఘ‌వ్‌

సంగీతం: అచ్చు రాజ‌మ‌ణి, ప్ర‌స‌న్

పోరాటాలు: వెంక‌ట్‌

ర‌చ‌న‌, స‌మ‌ర్ప‌ణ‌: కోన వెంక‌ట్

నిర్మాత‌: ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌

ద‌ర్శ‌క‌త్వం: హ‌రినాథ్‌

సంస్థ‌: కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌, ఎం.వి.వి సినిమా

సరైనోడు, నిన్నుకోరి,రంగస్థలం లాంటి చిత్రాలతో నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి ‘నీవెవరో’ అంటూ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కోన వెంకట్ ఈ సినిమాకు కథ అందించగా.. హరినాథ్ దర్శకత్వం వహించారు. తాప్సీ పన్ను, రితికా సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ ఫ్యాక్టరీ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ తెరకెక్కించారు. ‘రంగ‌స్థ‌లం’లో కుమార్‌బాబుగా ఆయ‌న పోషించిన పాత్ర‌లు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నాయి. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు ఏ మేర‌కు న‌చ్చుతుంద‌ని చూద్దాం…

క‌థ‌:

ఒక ప్ర‌మాదంలో త‌న ప‌దిహేనేళ్ల వ‌య‌సులోనే కంటి చూపును కోల్పోతాడు క‌ల్యాణ్ (ఆది పినిశెట్టి). కళ్లు లేక‌పోవ‌డం త‌న ఎదుగుద‌లకి అడ్డంకి కాద‌ని నిరూపిస్తూ పెద్ద‌య్యాక చెఫ్‌గా మారి, సొంతంగా ఓ పెద్ద రెస్టారెంట్ న‌డుపుతుంటాడు. చిన్న‌ప్ప‌ట్నుంచీ స్నేహితులైన అను (రితికాసింగ్‌), క‌ల్యాణ్‌ల‌కి పెళ్లి చేయాల‌నుకుంటారు కుటుంబ స‌భ్యులు. ఇంత‌లో క‌ల్యాణ్‌కి వెన్నెల (తాప్సి) ప‌రిచ‌య‌మ‌వుతుంది. వెన్నెల మంచి మ‌న‌సుని అర్థం చేసుకుని ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు క‌ల్యాణ్‌. త‌న మ‌న‌సులో ఉన్న ప్రేమ‌ని బ‌య‌ట‌పెట్ట‌గానే వెన్నెల త‌నకున్న క‌ష్టాల గురించి క‌ల్యాణ్‌కి వివ‌రిస్తుంది. అత‌నితో ఆమెకున్న ప‌రిచ‌యం ప్రేమ‌గా మారుతుంది. అదే స‌మ‌యంలో ఆమె కాల్ మ‌నీ క‌ష్టాల్లో ఉన్న‌ట్టు అర్థం చేసుకున్న క‌ల్యాణ్ త‌న ద‌గ్గ‌రున్న రూ.25ల‌క్ష‌ల‌ను ఆమెకు ఇవ్వ‌డానికి ముందుకొస్తాడు. అంత‌లోనే అత‌నికి యాక్సిడెంట్ జ‌రుగుతుంది. ఈ సారి జ‌రిగిన ఆప‌రేషన్ వ‌ల్ల చూపుకూడా వ‌స్తుంది. క‌ళ్లు తెరిచేస‌రికి అత‌నికి వెన్నెల క‌నిపించ‌దు. ఆమె ఏమైన‌ట్టు…? కాల్ మ‌నీ గొడ‌వ‌ల్లో వెన్నెల తండ్రి మ‌రణించాడా? అస‌లు వెన్నెల తండ్రి మ‌ర‌ణం వెనుక ఉన్న ప‌థ‌కం ఏంటి? ఎవ‌రు విల‌న్‌? చివ‌రికి క‌ల్యాణ్ ఎవ‌రిని చేసుకున్నాడు? వ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు.

విశ్లేష‌ణ‌:

అనాథ‌ల‌ను టార్గెట్ చేసి ఇన్స్యూరెన్స్ లు క్లైమ్ చేసుకోవ‌డం అనే కాన్సెప్ట్ తో గ‌తంలో త‌మిళంలో విడుద‌లైన ఓ సినిమాను `భ‌ద్ర‌మ్‌` పేరుతో తెలుగులో విడుద‌ల చేశారు. `నెపోలియ‌న్‌` కూడా ఇంచుమించు ఈ త‌ర‌హా చిత్ర‌మే. ఇప్పుడు అదే త‌ర‌హాలో కాస్త కాన్సెప్ట్ లో చేంజ్ చేసి త‌మిళంలో తెర‌కెక్కిన సినిమా `అదే క‌న్‌గ‌ళ్‌`. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అంధుల లిస్ట్ ను సేక‌రించి వారి పంచ‌న చేరి, ప్రేమిస్తున్న‌ట్టు న‌టించి వారి ద‌గ్గ‌ర నుంచి త‌లా రూ.25ల‌క్ష‌లు కొట్టేసే అమ్మాయిగా ఇందులో తాప్సీ న‌టించారు.

కళ్యాణ్, అనుల పెళ్లికి ఇద్దరి ఇళ్లల్లోని వారు ఒప్పుకోవడం, అదే సమయంలో వెన్నెలను కళ్యాణ్ ప్రేమించడం.. ఇలా ఫస్టాఫ్ ఫర్వాలేదనిపిస్తుంది. సెకండాఫ్‌లో కాసేపటికే కథ మీద ప్రేక్షకుడికి క్లారిటీ వచ్చేస్తుంది. వెన్నెల నిజ స్వరూపం అర్థం కావడానికి హీరోకు టైం పడుతుంది. కానీ ఆడియెన్స్‌కు మాత్రం పెద్దగా టైం పట్టదు. ఆమెను పట్టుకోవడం కోసం సాగే ప్రయత్నం ప్రేక్షకులకు నచ్చుతుంది.

స‌ప్త‌గిరి పాత్ర ప్ర‌వేశం త‌ర్వాతే స‌న్నివేశాలు ప‌రుగు అందుకుంటాయి. ప‌తాక స‌న్నివేశాలు ఆక‌ట్టుకున్నప్ప‌టికీ… అస‌లు విల‌న్ ఎవ‌ర‌నే విష‌యం ప్రేక్ష‌కుడి ఊహ‌ల‌కు అంద‌కుండా క‌థనాన్ని న‌డిపించ‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యాడు. కానిస్టేబుల్ చొక్కారావుగా వెన్నెల‌కిషోర్, సెల్‌ఫోన్ ట్రాక‌ర్ జ‌గ‌దీష్‌గా స‌ప్త‌గిరి ద్వితీయార్థంలో అక్క‌డ‌క్క‌డా నవ్విస్తారు.

సాంకేతిక విభాగం:

దర్శకుడిగా హరినాథ్ ఫర్వాలేదనిపించాడు. కథ బాగున్నా.. తాప్సీ క్యారెక్టర్ ఏంటనేది ముందే ఊహించగలగడం ఈ సినిమాకు మైనస్. కానీ ఆకట్టుకునేలా కథనం సాగుతుంది. ‘ఏంటో ఇలా ఏమైందో నా మనసుకి..’ సాంగ్ వినడానికే కాకుండా తెర మీద చూసేందుకు కూడా అద్భుతంగా ఉంది. ప్రదీప్ ఎడిటింగ్ వర్క్ బాగుంది. ఒక రీమేక్ సినిమా తీసిన‌ప్పుడు మాతృక‌లోని లోటుపాట్ల‌ని కూడా స‌రిచేసే వెసులుబాటు ఉంటుంది. కానీ ద‌ర్శ‌కుడు హ‌రినాథ్ ప‌నితీరు ఎక్క‌డా ప్ర‌భావం చూపించ‌లేదు. చాలా స‌న్నివేశాలు పేల‌వంగా సాగుతున్న‌ట్టు అనిపిస్తాయి. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగానే ఉన్నాయి.

బలాలు:

క‌థ‌

ఆర్ట్ వర్క్

ఆది, తాప్సి న‌ట‌న

ప‌తాక స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు:

క‌థ‌నం

ప్రేక్ష‌కుడి ఊహించే స్క్రీన్‌ప్లే

రేటింగ్‌: 2/5