సినిమా రివ్యూ మెహబూబా: ప్రేమకథ
Spread the love

జానర్ : లవ్‌ ఎంటర్‌టైనర్‌

తారాగణం : ఆకాష్‌ పూరి, నేహా శెట్టి, విషు రెడ్డి, మురళీ శర్మ, షియాజీ షిండే

సంగీతం : సందీప్‌ చౌతా

దర్శకత్వం : పూరి జగన్నాథ్‌

నిర్మాత : పూరి కనెక్ట్స్‌

సినిమాటోగ్రఫి: విష్ణు శర్మ

ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ

 ఫైట్స్: రియల్ సతీష్

 బ్యానర్: పీసీ కనెక్ట్, పూరీ టూరింగ్ టాకీస్

దర్శకుడు పూరీ జగన్నాథ్ అంటే అమ్మ, నాన్న తమిళ అమ్మాయి, పోకిరి, బిజినెస్‌మెన్‌ లాంటి చిత్రాలు కళ్లముందు కదలాడుతాయి. ఆయన డైలాగ్స్, టేకింగ్ ప్రేక్షకులను మైమరిపిస్తాయి. పూరీ చెప్పిన ప్రేమకథలు విశేషంగా ఆకట్టుకొన్నాయి. ఒక్క హిట్.. ఒకే ఒక్క హిట్ అంటూ తండ్రీ కొడుకులు పూరీ జగన్నాథ్, ఆకాష్ పూరీలు ‘మెహబూబా’ చిత్రంతో శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌గా ఎన్నో హిట్ చిత్రాలను అందించిన పూరి జగన్నాథ్‌ తన తనయుడు ఆకాశ్ పూరిని హీరోగా పరిచయం చేస్తున్న చిత్రం ‘మెహబూబా’. నేహాశెట్టి హీరోయిన్. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి కనెక్ట్స్‌ నిర్మించింది. ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్లు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచాయి. మరి ఈ సినిమాకు ఆడియన్స్ ఎంతవరకు కనెక్ట్ అయ్యారు..? పూరికి ఈ చిత్రం పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిందా..? అనే విషయాలు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ ;

రోషన్ (ఆకాష్ పూరి)కి చిన్నప్పటినుండి తనను ఎవరో చంపేసినట్లు, తను ఎవరికో మాట ఇచ్చినట్లు రకరకాల కలలు వస్తుంటాయి. అదే సమయంలో లాహోర్‌ లో ఉన్న అఫ్రీన్‌ (నేహా శెట్టి)కు కూడా ఇలాంటి కలే వస్తుంది. తనను ఎవరో చంపేసారని భయపడుతుంటుంది, రోషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసి మిలిటరీ జాయిన్ అవ్వాలని చూస్తుంటాడు. అదే సమయంలో అఫ్రీన్ కూడా చదువు కోసం ఇండియాకు రావాలని అనుకుంటుంది.అఫ్రీన్‌. ఇంట్లో వాళ్లు చేసే పెళ్లి ఇష్టం లేని అఫ్రీన్‌, చదువుకోవాలన్న కారణం చెప్పి ఇండియా వచ్చేస్తుంది, అఫ్రీన్ ఓ సమస్యలో ఉన్నప్పుడు రోషన్ ఆమెను కాపాడతాడు. కానీ ఇద్దరూ ఒకరినొకరు చూసుకోలేరు.

అప్పటినుండి రోషన్‌కు థాంక్స్ చెప్పాలని ప్రయత్నించి చివరికి ట్రైన్‌లో అతడిని కలుసుకుంటుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకోగానే ఇదివరకే పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఎక్కడ, ఎలా కలిసామనే విషయం మాత్రం గుర్తుకురాదు. అఫ్రీన్ తిరిగి పాకిస్థాన్‌కు వెళ్ళిపోతుంది. ట్రెక్కింగ్ కోసం హిమాలయాలకు వెళ్ళిన రోషన్‌కు అఫ్రీన్‌కు తనకు సంబంధించిన ఓ ముఖ్యమైన విషయం తెలుస్తుంది. అఫ్రీన్‌ను వెతుక్కుంటూ పాకిస్థాన్‌కు వెళ్తాడు. అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు?

విశ్లేషణ:

దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఆ బ్యాక్ డ్రాప్‌లోనే కథను రాసుకున్నాడు. పాకిస్థాన్‌కు చెందిన ఒక సైనికుడు, హిందుస్థాన్ అమ్మాయిని ప్రేమిస్తాడు. తన ప్రేమను దక్కించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉండే సరిహద్దుల కారణంగా వీరి ప్రేమ విఫలమవుతుంది. ప్రేమికులిద్దరూ కూడా చనిపోతారు. తన ప్రేమికురాలికి నేను మళ్ళీ వస్తాను అంటూ మాట ఇచ్చిన కుర్రాడు ఆమె కోసం మళ్ళీ పుడతాడు. ఈ జన్మలో ఈ ఇద్దరూ ఎలా కలిసారనే సంఘటనలను ఆసక్తికరంగా చిత్రీకరించడంలో దర్శకుడిగా పూరి సక్సెస్ కాలేకపోయాడు.

మెహబూబా ఫస్టాఫ్

మెహబూబా చిత్ర ప్రథమార్థంలో రోషన్, ఆఫ్రీన్ గత జన్మ జ్ఞాపకాలతో కథ మొదలవుతుంది. రోషన్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్, చదువు కోసం ఆఫ్రీన్ హైదరాబాద్‌కు రావడం అనే అంశాలతో చకచకా సాగిపోతుంది. పాకిస్థాన్, ఇండియా క్రికెట్ మ్యాచ్ సందర్బంగా వచ్చే సన్నివేశాలలో పూరీ మార్కు కనిపిస్తుంది. పూరీ మార్కు డైలాగ్స్‌తో జోష్ కూడా కనిపిస్తుంది. ఆఫ్రీన్‌ను దుండగుల దాడిని నుంచి కాపాడే సీన్లు పూరీ స్టయిల్‌ను గుర్తు చేస్తాయి. రోషన్ కోసం ఆఫ్రీన్ వెతుకులాటలో ఎమోషన్ కనిపిస్తుంది. తనకు వెంటాడే మెమోరీస్‌ను ఛేదించే క్రమంలో రోషన్ ఆవేదన ఆకట్టుకొనేలా ఉంటుంది. ఇంటర్వెల్ ముందు ఆసక్తికరమైన మలుపుతో కథ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది.

Movie Review Mahabooba

సాధారణంగా పూరి సినిమాలలో అతి కాస్త ఎక్కువే ఉంటుంది. ఈ సినిమాలో కూడా అది మిస్ చేయలేదు ఈ క్రియేటివ్ డైరెక్టర్. సినిమాకు ఏదైనా హైలైట్ ఉంది అంటే అది క్లైమాక్స్ ఎపిసోడ్ అనే చెప్పాలి. అయితే బాగుంది అనుకునేలోపు ఆ సన్నివేశాలను మరింత సాగదీసి విసిగించాడు. హీరోగా ఆకాష్ పూరి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. నటన పరంగా మెప్పించాడు. యాక్షన్ సీన్స్ హెవీగా లేకుండా ఆకాష్ కోసం సింపుల్‌గా డిజైన్ చేశారు. వాటిల్లో అవలీలగా నటించేసాడు ఆకాష్. అయితే తెరపై హీరోగా ఆయన్ను యాక్సెప్ట్ చేయడానికి ప్రేక్షకులను మరో రెండు, మూడేళ్ళు పడుతుంది. ఎంత మేకోవర్ చేసినా ఆకాష్‌లో ఆ చిన్నతనం పోలేదనిపిస్తుంది.

క్లైమాక్స్ లో ‘ఇస్లాం జిందాబాద్ అని ఒప్పుకున్నవాడు.. పాకిస్థాన్ జిందాబాద్ అనడానికి మాత్రం అంగీకరించడు’ ఇది ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించేలా చేసింది. ఇలా సినిమాలో ఇండియాను ఎలివేట్ చేసే ప్రతి సీన్ బాగా పండింది. నేహాశెట్టికి తెలుగులో ఇది మొదటి సినిమా. తన పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. కొద్ది సమయంలో హిందుస్థానీగా, మిగిలిన సినిమా మొత్తం ముస్లింగా ఆమె లుక్స్ ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నుబాగాలో చిత్రీకరించారు. హిమాలయ సన్నివేశాలు కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. పాటలలో కూడా లోకేషన్స్ బాగున్నాయి. కానీ సందీప్ చౌతా అందించిన సంగీతం సినిమాకు సెట్ అవ్వలేదు. ” అనే బీజియం తప్ప ఏ ఒక్క పాట కూడా అలరించదు. సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా సరిగ్గా లేదు. ఎడిటింగ్ వర్క్ పై ఇంకాస్త శ్రద్ధ చూపాల్సివుంది

రేటింగ్: 2.5/5