కాశీ మూవీ రివ్యూ: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ
Spread the love

నటీనటులు: విజయ్ ఆంటోనీ , అంజలి , సునైనా , అమృత అయ్యర్ , శిల్ప మంజునాథ్ , జయప్రకాష్, నాజర్

యోగిబాబు, ఆర్.కె.సురేష్ తదితరులు

సంగీతం: విజయ్ ఆంటోనీ

ఛాయాగ్రహణం: రిచర్డ్ ఎం.నాథన్

మాటలు: భాష్యశ్రీ

ఎడిటర్: లారెన్స్ కిషోర్

నిర్మాత: ఫాతిమా విజయ్ ఆంటోనీ

రచన – దర్శకత్వం: కృతిగ ఉదయనిధి

బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్‌లోనూ ఘనవిజయం సాధించాడు. విజ‌య్ ఆంటోనీ. అంత‌కు ముందు కొన్ని సినిమాలు చేసినా, అవి స‌రిగా ఆడ‌లేదు. కానీ కాన్సెప్ట్ ప‌రంగా మాత్రం ఆక‌ట్టుకున్నాయి. బిచ్చ‌గాడు హిట్ తో… `విజ‌య్ సినిమాలు కొంటే.. డ‌బ్బులొస్తాయిలే` అన్న న‌మ్మ‌కం క‌లిగాయి. దాంతో విజ‌య్ ఆంటోనీకి తెలుగులో మార్కెట్ ఏర్ప‌డింది. నటుడిగా, సంగీత దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా మారాడు విజయ్ నటించిన తాజా చిత్రం ‘కాశి’. సినిమా విడుదలకు ముందే 7 నిమిషాల సినిమాను విడుదల చేసి కథపై ఆసక్తిని క్రియేట్ చేశాడు. మరి ఈ చిత్రం ఆ ఆసక్తిని ఏమేరకు నిలబెట్టిందో చూద్దాం పదండి.

క‌థ‌:

భరత్ (విజయ్ ఆంటోనీ) అమెరికాలో పేరు మోసిన డాక్టర్. అతడి ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రి అమెరికాలోనే ది బెస్ట్ అనిపించుకునే దిశగా సాగుతుంటుంది. ఐతే భరత్ జీవితం చాలా సంతోషంగా సాగిపోతుంటుంది తరచూ భరత్‌కు ఎద్దు తనను పొడవబోతుంటే ఎవరో అడ్డు పడినట్లు, అలానే పెద్ద పాము కలలోకి వస్తుంటుంది. అసలు ఆ కల ఎందుకు వస్తుందో భరత్‌కు అర్ధం కాదు. అయితే కొద్దిరోజులకు భరత్ తల్లితండ్రులుగా అనుకుంటున్న వారు తనను కన్న తల్లితండ్రులు కాదని తెలుసుకుంటాడు. తన తల్లిదండ్రులు ఎవరని తెలుసుకొనేందుకు అమెరికా నుండి ఇండియాకు వస్తాడు. ఆ క్రమంలో తన చిన్నతనంలోనే తల్లి మరణించిందని, తన అసలు పేరు కాశీ అని తెలుసుకొంటాడు. ఆ తర్వాత తన తండ్రి కోసం వెతుకులాటను ప్రారంభిస్తాడు. ఆ నేపథ్యంలో కంచెర్లపాలెం చేరుకొంటాడు. అక్కడ ఆయుర్వేద డాక్టర్ (అంజలి) పరిచయం అవుతుంది. అసలు భరత్ తన తండ్రికి ఎలా దూరమయ్యాడు..? అనే విషయాలతో సినిమా నడుస్తుంది.

విశ్లేషణ:

బిచ్చగాడు’ చిత్రంతో తెలుగునాట క్రేజ్ తెచ్చుకున్న నటుడు విజయ్ ఆంటోనీ సినిమా విడుదలవుతుందంటే ఇక్కడి ప్రేక్షకులు కూడా కొత్తదనం ఉంటుందని భావిస్తున్నారు. అతడు నటించిన భేతాళుడు, ఇంద్రసేన వంటి చిత్రాలకు హిట్ టాక్ రానప్పటికీ ప్రయోగాత్మక చిత్రాలుగా మిగిలిపోయాయి. కానీ ఈసారి విజయ్ ఆంటోనీ ఏం నచ్చి ఈ సినిమా ఎన్నుకున్నాడనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఖ‌రీదైన జీవితాన్ని, గొప్ప ఉద్యోగాన్నీ వ‌దిలి.. ఇండియా వ‌చ్చి సాధార‌ణ‌మైన జీవితాన్ని గ‌డిపే ఓ కొడుకు క‌థ ఇది. విన‌డానికి ఇదీ `బిచ్చ‌గాడు` త‌ర‌హా సినిమానే అనిపిస్తుంది. కానీ ఆ స్థాయిలో క‌థ‌నం, ట్రీట్‌మెంట్ లేవు.

తన తండ్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో హీరోకు ఒక్కొక్కరి మీదా సందేహం కలుగుతుంది. ఆ వ్యక్తిని కలిసి తన గతం గురించి అడుగుతాడు. అతను కథ ఆరంభించగానే.. ఫ్లాష్ బ్యాక్ లో ఆ పాత్రలోకి విజయ్ దూరిపోతాడు. ఇంతకుముందు సిద్దార్థ్ నటించిన ‘బావ’ సినిమాలో తన తండ్రి అయిన రాజేంద్ర ప్రసాద్ కు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ లో సిద్ధు కనిపించడం గుర్తుండే ఉంటుంది. ఐతే అక్కడ తండ్రీ కొడుకుల్ని అలా చూస్తాం. ఇలాంటి క‌థ‌ల్ని ఆస‌క్తిక‌రంగానూ చెప్పొచ్చు. కానీ ఈ విష‌యంలో ద‌ర్శ‌కురాలు విఫ‌లం అయ్యింది.

క‌థ ఎంత బ‌ల‌హీనంగా ఉందో..  క‌థ‌నం అంత‌కంటే పేల‌వంగా క‌నిపిస్తుంది. ఈ క‌థ‌లో మూడు ఉప‌క‌థ‌లున్నాయి. వాటితో అస‌లు క‌థ‌కు అంత‌గా సంబంధం ఉండ‌దు.  ఒక్కో ఉప క‌థ‌.. ఓ సినిమాలా అనిపిస్తుంది.  మొత్తం సినిమాలో విజయ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తాడు. పాత్రల్లో పరకాయప్రవేశం చేసే విజయ్ ఆంటోనీ ఈ మూవీలో నటించేందుకు చాలా కష్టపడ్డాడు. లవ్, సెంటిమెంట్, రొమాన్స్ ఇలా ఏ ఒక్క ఎమోషన్‌ను కూడా సరిగ్గా క్యారీ చేయలేకపోయాడు.

హీరోయిన్ అంజలిపాత్ర గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. కనీసం సినిమాలో ఆమె పాత్రకు ఒక పాట కూడా దక్కలేదు. మరో హీరోయన్ సునయన తన నటనతో ఆకట్టుకుంది. అమృత అయ్యర్, శిల్పా మంజునాథ్‌లు కేవలం పాటలకే పరిమితమయ్యారు. శిల్పా మంజునాథ్ గెటప్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఏమాత్రం ఆసక్తి లేకుండా నత్తనడకన సాగే ఈ సినిమాను భరించడానికి చాలా ఓపిక కావాలి.

సాంకేతిక వ‌ర్గం:

క‌థ‌లో ఎలాంటి మ‌లుపులూ లేవు. విజయ్ ఆంటోనీ సంగీతం అతడి స్టయిల్లోనే సాగింది. ఐతే పాటలేవీ రిజిస్టర్ కావు. తమిళ టచ్ ఎక్కువగా కనిపిస్తుంది. నేపథ్య సంగీతం ఓకే. రిచర్డ్ ఎం.నాథన్ ఛాయాగ్రహణం మామూలుగానే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ విషయంలో కొంచెం శ్రద్ధ చూపించారు. భాష్యశ్రీ మాటలైతే ఏమంత ప్రత్యేకంగా లేవు. ఒక సినిమా లాగా కాకుండా సీరియల్ స్టయిల్లో ఆమె సినిమాను నడిపించింది. రచయితగా.. దర్శకురాలిగా కృతిగ నుంచి ఏ మెరుపులూ లేవు.

ప్లస్ పాయింట్స్ :

సినిమాటోగ్రఫీ

ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్ :

మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్

స్క్రీన్ ప్లే

రేటింగ్ : 2.5