‘గీత గోవిందం‌’ మూవీ రివ్యూ
Spread the love

సినిమా: గీత‌గోవిందం

న‌టీన‌టులు: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మందాన్న, నాగ‌బాబు, సుబ్బ‌రాజు, వెన్నెల కిషోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, గిరిబాబు, అన్న‌పూర్ణ‌మ్మ‌, మౌర్యాని, సుభాష్‌, అభ‌య్‌, స్వ‌ప్న‌క‌, స‌త్యం రాజేష్‌, దువ్వాసి మెహ‌న్‌, గుండు సుద‌ర్శ‌న్‌, గౌతంరాజు, అనీష‌, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, సంధ్య జ‌న‌క్ త‌దిత‌రులు…

స‌మ‌ర్ప‌ణ‌: అల్లు అర‌వింద్‌

నిర్మాత‌: బ‌న్నివాసు

ద‌ర్శ‌క‌త్వం: ప‌రుశురామ్‌

సంగీతం: గోపిసుంద‌ర్‌

సినిమాటోగ్రాఫ‌ర్‌: మ‌ణికంద‌న్‌

ఎడిట‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేష్

రచనా సహకారం‌: సీతారామ్‌

పాటలు‌: అనంత్ శ్రీరామ్‌, శ్రీమ‌ణి,

కొరియోగ్రఫి: ర‌ఘు, జాని

కొత్తగా ఉండే ప్రేమకథా చిత్రాలు విజయం సాధించాయి. రొటీన్ స్టోరీలు కనబడకుండాపోయాయి. అయినా దర్శకులు ప్రేమకథలతో ప్రేక్షకులని మెప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాంటి ప్రయత్నాల్లో ‘గీత గోవిందం’ ఒకటి. కాకపోతే హీరో విజయ్ దేవరకొండ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. `అర్జున్‌రెడ్డి`తో అది మ‌రో స్థాయికి వెళ్లింది. ఆ చిత్రం త‌ర్వాత విజ‌య్ క‌థ‌ల ఎంపిక‌పై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. అందుకు త‌గ్గ‌ట్టుగానే `గీత గోవిందం` ప్ర‌చార చిత్రాలు ఊరించాయి. `అర్జున్‌రెడ్డి` త‌ర్వాత విజ‌య్ నటించిన చిత్రం కావ‌డం… అది కూడా గీత ఆర్ట్స్ నుంచి వ‌స్తుండడంతో `గీత గోవిందం`పై మ‌రిన్ని అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కావ‌ల్సినంత ప్ర‌చారం సంపాదించుకున్న ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం!

Geetha Govindam review

క‌థ‌:

విజయ్ గోవింద్ (విజయ్ దేవరకొండ) ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్. సంస్కారవంతుడు.. సంప్రదాయాలు, పద్ధతులు, విలువలు తెలిసిన వ్యక్తి. తనకు రాబోయే భార్య గురించి గొప్పగా ఊహించుకుంటూ ఉంటాడు. ఆ ఊహల్లోనే బతుకుతూ ఉంటాడు. ఇలాంటి సమయంలో గీత (రష్మిక మందన్న) గోవింద్ కంటబడుతుంది. తర్వాత అదే అమ్మాయి ఒక రోజు అతడితో బస్సులో కలిసి ప్రయాణం చేస్తుంది. ఐతే అక్కడ అనుకోకుండా విజయ్ చేసిన ఓ తప్పుతో గీత అతడిని అపార్థం చేసుకుంటుంది. అతడిపై ద్వేషం పెంచుకుంటుంది. తర్వాత అనూహ్య పరిస్థితుల్లో గీత-గోవింద్ మధ్య బంధుత్వం కలుస్తుంది. అనుకోకుండా ఆమెని ముద్దు పెట్టుకుంటాడు. ఆ ముద్దు సెల్ఫీగా కూడా తీసుకుంటాడు. దాంతో కంగారుప‌డిన గీత త‌న అన్న‌య్య (సుబ్బరాజు)కి జ‌రిగిన విష‌యం చెబుతుంది. దాంతో కాకినాడ‌లో మాటువేసిన గీత అన్న‌య్య‌, అత‌డి బృందం గోవింద్‌ని ఏం చేశారు? గోవింద్, గీత ఆ త‌ర్వాత ఎలా ప్రేమ‌లో ప‌డ్డారు? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌:

హీరో హీరోయిన్‌ని చూసి ఇష్ట‌ప‌డ‌టం… అనుకోకుండా హీరోయిన్ హీరోకి ఎదురైన‌ప్పుడు సీన్స్‌లో హీరో గురించి చెడుగా అనుకోవ‌డం.. అస‌లు విష‌యం తెలిశాక‌. అత‌నితో ప్రేమ‌లో ప‌డ‌టం.. హీరోయిన్ త‌న ప్రేమ‌ను చెప్పినా హీరో అంగీకరించడు. చివ‌ర‌కు హీరోకి నిజం తెలిసే స‌రికి.. హీరోయిన్‌కి పెళ్లి ఫిక్స్ కావ‌డం.. నాట‌కీయ ప‌రిస్థితుల మ‌ధ్య హీరో, హీరోయిన్ ఒక‌టి కావ‌డం. క‌థ సింపుల్‌గానే ఉన్నా.. ఇలాంటి క‌థ‌ల‌ను స‌న్నివేశాల ప‌రంగా.. భావోద్వేగాలను మేళవించి సినిమా చేయ‌డం క‌ష్టమే. అయితే డైరెక్ట‌ర్ ప‌రుశురాం సినిమాను చాలా చ‌క్క‌గా నడిపించాడు. స‌న్నివేశాలు ఎలా ఉంటాయో ప్రేక్ష‌కుడికి అర్థ‌మైపోయినా.. వాటిని దర్శకుడు మలిచిన తీరు అభినంద‌నీయం.

ముఖ్యంగా క‌థానాయ‌కుడికీ, అత‌డి స్నేహితుల‌కీ మ‌ధ్య స‌న్నివేశాలు బాగా పండాయి. ‘అర్జున్‌రెడ్డి’లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి స్నేహితుడిగా క‌నిపించి న‌వ్వించిన రాహుల్ రామ‌కృష్ణ ఈ చిత్రంలోనూ అదే స్థాయిలో న‌వ్వించాడు. గోవింద్‌, గీత‌ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు కూడా చ‌క్క‌టి వినోదాన్ని పంచుతాయి. మేడ‌మ్.. మేడ‌మ్ అంటూ విజ‌య్ చేసే హంగామా… ప్ర‌తి విష‌యంలోనూ అనుమానపడుతూ గోవింద్‌ని త‌న చుట్టూ తిప్పించుకునే గీత మ‌ధ్య స‌న్నివేశాలు బాగా పండాయి. ద్వితీయార్ధంలో అక్క‌డ‌క్క‌డా సన్నివేశాలు సాగదీత‌గా అనిపించినా వినోదం మాటున అదేమీ ఇబ్బందిగా అనిపించ‌దు. ప‌తాక స‌న్నివేశాలపై మ‌ళ్లీ ద‌ర్శ‌కుడు ప‌ట్టు ప్ర‌ద‌ర్శించాడు. భావోద్వేగాలు పంచుతూనే.. న‌వ్వులు పండించాడు.

సినిమాను హడావుడిగా సినిమాను ముగింపు దశకు తీసుకెళ్లిపోయిన భావన కలుగుతుంది. హీరో హీరోయిన్ దూరం కావడానికి చూపించిన కారణాలు కూడా సమంజసంగా అనిపించవు. ఐతే ఈ దశలో వెన్నెల కిషోర్ వచ్చి ట్రాక్ తప్పుతున్న సినిమాను మళ్లీ గాడిలో పెట్టాడు. తనకు బాగా అలవాటైన ‘టెంపరరీ పెళ్లికొడుకు’ పాత్రలో కిషోర్ మరోసారి అదరగొట్టేశాడు. అన్నపూర్ణతో కలిసి అతను పండించిన కామెడీ కడుపుబ్బ నవ్విస్తుంది. సినిమాను లైటర్ వీన్ లో ముగించడం కోసం కొంచెం లాజిక్ కు దూరంగానే వెళ్లాడు పరశురామ్. అది బాగానే వర్కవుటైంది. ప్రేక్షకులు చిరునవ్వులతో.. మంచి ఫీలింగ్ తో థియేటర్ల నుంచి బయటికి వస్తారు. ఓవరాల్ గా కొన్ని కంప్లైంట్లు ఉన్నప్పటికీ పెద్దగా బోర్ కొట్టించకుండా.. వినోదాత్మకంగా సాగిపోయే ‘గీత గోవిందం’ విజయ్ అభిమానులకు.. యువతకు బాగానే నచ్చే అవకాశముంది.

Geetha Govindam review

నటీనటులు:

సినిమాపై ఈ స్థాయిలో హైప్‌ క్రియేట్‌ అవ్వడానికి ముఖ్య కారణం విజయ్‌ దేవరకొండ. అర్జున్‌ రెడ్డి సినిమాలో తన యాటిట్యూడ్‌తో ప్రేక్షకులను ఫిదా చేసిన విజయ్, ఈ సినిమాలో పూర్తి కాంట్రాస్ట్‌ క్యారెక్టర్‌లో కనిపించాడు. తడి పాత్ర యువ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేస్తుంది. ఈ సినిమాతో మిగతా వాళ్లు కూడా అతడిని ఇష్టపడతారు. విజయ్ ఎమోషనల్ సీన్లలోనూ ఆకట్టుకున్నాడు. రష్మిక మందానా కూడా బాగానే చేసింది. కానీ ఒక దశ దాటాక ఆమె హావభావాలు రిపిటీటివ్ గా అనిపిస్తాయి. ఎమోషనల్ సీన్లలో రష్మిక బాగా చేసింది. కొన్ని సన్నివేశాల్లో అందంగా కనిపించే రష్మిక.. కొన్ని సీన్లలో అంత బాగా అనిపించదు. అక్కడక్కడా మేకప్ – కాస్ట్యూమ్స్ తేడా కొట్టేయడమే అందుక్కారణం. వెన్నెల కిషోర్ ఉన్న కాసేపట్లోనూ మెరుపులు మెరిపించాడు. రాహుల్ రామకృష్ణ కూడా నవ్వించాడు. అన్నపూర్ణ కూడా తనదైన ముద్ర వేసింది. సుబ్బరాజు.. నాగబాబు.. మిగతా నటీనటులంతా ఓకే.

సాంకేతికవర్గం:

అల్లు అరవింద్ సమర్పణలో వచ్చిన చిత్రం అంటే నిర్మాణ విలువల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ బడ్జెట్‌లో చాలా అందమైన చిత్రాన్ని అందించారు. దర్శకుడు పరశురాం చెప్పినట్లు ఇప్పటి వరకు వచ్చిన ఆయన సినిమాలకు ఇది భిన్నం. కొత్తదనం చూపించారు. గోపీసుందర్ పాటలు బాగున్నాయి. ఇంకేం ఇంకేం కావాలే.. అక్షరం చదవకుండా.. పాటలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఐతే పాటలు ఆడియోలో ఉన్నంత బాగా తెరమీద లేవు. ముఖ్యంగా ‘ఇంకేం కావాలే..’ పాట చిత్రీకరణ సాధారణంగా అనిపిస్తుంది. ఆ పాటను సరిగా ఉపయోగించుకోలేదు. మణికందన్ ఛాయాగ్రహణం బాగుంది. సినిమా అంతా కలర్ ఫుల్ గా సాగుతూ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ పరశురామ్.. ఓకే అనిపించాడు. అతడి గత సినిమాలతో పోలిస్తే ఇందులో కథ బలహీనమే. కానీ ప్రధాన పాత్రల్ని తీర్చిదిద్దడంలో అతడి ప్రత్యేకత కనిపిస్తుంది. ఈసారి అతను యూత్ ఫుల్ ఆలోచనలతో యువతకు నచ్చేలా సన్నివేశాల్ని నడిపించడం ద్వారా ఆ వర్గం ప్రేక్షకులకు చేరువయ్యాడు.

Geetha Govindam review

ప్ల‌స్ పాయింట్స్‌:

విజ‌య దేవ‌ర‌కొండ‌

ఇంకేం ఇంకేం కావాల‌నే పాట‌

సందర్భానుసారంగా వచ్చే హాస్య సన్నివేశాలు

నేప‌థ్య సంగీతం

మైన‌స్ పాయింట్స్:

కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ లేదు

భావోద్వేగ సన్నివేశాల్లో ర‌ష్మిక ఇంకా బాగా చేసుండాల్సింది

చివరిగా:

తిడితే పడాలి, కొడితే భరించాలి, జీవితాంతం ఓపికగా భార్య చెప్పింది వినాలి.. ఇలాంటి అబ్బాయిలనే అమ్మాయిలు కోరుకుంటారట. మీరూ సినిమా చూసి చెప్పండి. రెండున్నర గంటల హాయిగా నవ్వుకోండి.

చివరగా: గీత గోవిందం.. వినోదంతో విజయం

రేటింగ్: 3.5/5