‘అభిమన్యుడు’ సినిమా రివ్యూ
Spread the love

నటీనటులు: విశాల్‌, సమంత, అర్జున్‌, దిల్లీ గణేశ్‌, శ్రీజ రవి, రోబో శంకర్‌ తదితరులు

సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా

ఛాయాగ్ర‌హ‌ణం : జార్స్‌ సి.విలియమ్స్‌

ఎడిటింగ్‌: రుబెన్‌

క‌ళ‌: ఉమేశ్ కుమార్‌

నిర్మాత: జి.హ‌రి

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి.ఎస్‌.మిత్రన్‌

బ్యానర్‌: విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ

మాట‌లు: రాజేశ్ ఎ.మూర్తి

ద‌ర్శ‌క‌త్వం: పి.ఎస్‌.మిత్ర‌న్‌

కోలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో విశాల్‌, టాలీవుడ్‌లో మార్కెట్‌ సాధించేందుకు చాలా రోజులుగా కష్టపడుతున్నాడు. ఇటీవల యువ కథానాయకులు ఎంచుకునే కథల నేపథ్యం పూర్తిగా కొత్త పంథాలో సాగుతోంది. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటూనే సామాజిక సమస్యల ఇతివృత్తంగా వచ్చే కథలకు మరో ఆలోచన లేకుండా పచ్చజెండా ఊపుతున్నారు. తమిళంలో ఇతర కథానాయకులతో పోలిస్తే విశాల్‌ శైలి కాస్త భిన్నం. ఇటవలే ‘డిటెక్టివ్‌’ అంటూ ఓ కొత్త తరహా కథతో ఆకట్టుకున్న ఆయన తాజాగా లక్షల మంది ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సైబర్‌ మోసాల నేపథ్యంలో తీసిన చిత్రం ‘అభిమన్యుడు’. ‘ఇరుంబు తిరై’గా తమిళంలో విడుదలై ఘన విజయం సాధించిన ఈ చిత్రం కాస్త ఆలస్యంగా తెలుగులో విడుదలైంది.  గతంలో అతను నటించిన కొన్ని చిత్రాలు ఇక్కడా విజయాలు సాధించి విశాల్‌కు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. అదే ఊపులో మరో డిఫరెంట్‌ ఎంటర్‌టైనర్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశాల్‌. కోలీవుడ్‌లో సూపర్‌ హిట్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించిందా..?  చూద్దాం

క‌థ‌ :

క‌రుణ (విశాల్‌) ఓ మిల‌ట‌రీ మేజ‌ర్‌. నిజాయ‌తీ గ‌ల ఆఫీస‌ర్‌. అన్యాయం క‌న‌ప‌డితే ఎదురు తిరుగుతుంటాడు. కోపం ఎక్కువ .. దీని కార‌ణంగా గొడ‌వ‌లు ఎక్కువ కావ‌డంతో ఆర్మీ అత‌న్ని ఓ సైక్రియాటిస్ట్ ద‌గ్గ‌ర ఆరు వారాల పాటు ట్రీట్‌మెంట్ తీసుకుని వ‌స్తే డ్యూటీలో జాయిన్ కావ‌చ్చున‌నే కండిష‌న్ పెడుతుంది. ఉద్యోగం కోసం క‌రుణాక‌ర్ సైక్రియాటిస్ట్ ల‌తాదేవి(స‌మంత‌)ని క‌లుస్తాడు. తండ్రి అప్పులు చేసి దాక్కోవ‌డం, త‌ల్లి కుట్టు మిష‌న్ కుట్టి త‌న‌ను చ‌దివించ‌డం.. తన చెల్లాయి పెళ్లి కోసం.. ఊర్లో ఉన్న భూమిని నాలుగు ల‌క్ష‌ల‌కు అమ్మేస్తాడు. మ‌రో ఆరు ల‌క్ష‌లు బ్యాంకులోంచి లోన్‌గా తీసుకుంటాడు. ఈ ప‌ది ల‌క్ష‌లు ఒకేసారి ఎకౌంట్లోంచి మాయం అవుతాయి. దానికి కార‌ణం.. ‘సైబ‌ర్ క్రైమ్‌’. ఇది క‌రుణ స‌మ‌స్యే కాదు.. దేశం మొత్తమ్మీద ఇలా మోస‌పోయిన‌వాళ్లెంత‌మందో?

విశ్లేష‌ణ‌:

సినిమా మొత్తం సైబర్‌ క్రైమ్‌ నేపథ్యంలో సాగుతుంది. మనం రోజూ పేపర్లో చూస్తున్న విషయాలే ఇవి. మన అకౌంట్‌లో డబ్బులను మన ప్రమేయం లేకుండానే ఎవరో దర్జాగా దొంగిలిస్తున్నారు. ఈ సమస్యను దర్శకుడు కథగా ఎంచుకున్నాడు. దాని మూలాల్లోకి వెళ్లి సైబర్‌క్రైమ్‌ జరిగే పద్ధతిని చాలా విపులంగా అందరికీ అర్థమయ్యేలా సైబర్‌క్రైమ్‌ ఏ స్థాయిలో విజృంభిస్తుందో అందరికీ తెలిసేలా చూపించాడు. షాపింగ్ మాల్‌కి వెళ్తాం. మ‌ధ్య‌లో ఒక‌రు అడ్డు త‌గులుతారు. బంప‌ర్ గిఫ్ట్ ఇస్తాం… మీ పేరు, ఫోన్ నెంబ‌ర్‌, ఈమెయిల్ ఐడీ రాసివ్వండి అంటారు. ల‌క్కీ డ్రాలో ఏదో వ‌స్తుందిలే అని మ‌ధ్య‌త‌ర‌గ‌తి మ‌న‌స్త‌త్వంతో మ‌న స‌మాచారాన్నంతా ఫ్రీగా ఇచ్చేస్తాం. వాటితో… ఎవ‌రు, ఎన్నెన్ని మోసాలు.. దారుణాలు చేయ‌గ‌ల‌రో  వెండి తెర‌పై చూపించి భ‌య‌పెట్టిన సినిమా ‘అభిమ‌న్యుడు’. సినిమా చూస్తుంటే… ‘అభిమ‌న్యుడు’ విశాల్ కాదు… మ‌న‌లో ప్ర‌తి ఒక్క‌డూ… అనే ఫీలింగ్ వేస్తుంది. మ‌న‌కు తెలియ‌కుండా… ఓ నిఘా నేత్రం మ‌న‌ల్ని త‌రుముతోంద‌న్న భ‌యం క‌లుగుతుంది. అక్క‌డే ద‌ర్శ‌కుడు స‌క్సెస్ కొట్టేశాడు. ఇది మ‌న కథ‌. నిత్యం మ‌న‌కు ఎదుర‌య్యేదో, మ‌న స్నేహితుల‌కు తార‌స ప‌డేదో, లేదంటే పేప‌ర్లో, టీవీలో చూసేదో.. ఓ భ‌యంక‌ర‌మైన స‌మ‌స్య‌ని క‌థ‌గా రాసుకున్నాడు. అందుకే క‌థ‌లో ప్రేక్ష‌కుడు లీన‌మైపోతాడు.

ఎప్పుడైతే సమస్య తన వరకూ వచ్చిందో దాన్ని ఎదుర్కోవడానికి రంగంలోకి దిగుతాడు కథానాయకుడు. అక్కడి నుంచి కథలో వేగం వస్తుంది. ద్వితీయార్ధం మొత్తం హీరో-విలన్ల మధ్య పోరాటమే. బలమైన ప్రతినాయకుడి పాత్రను రాసుకుంటే సన్నివేశాలు ఎంత బాగా వస్తాయో చెప్పడానికి ‘అభిమన్యుడు’ని ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే ద‌ర్శ‌కుడు తెలివిగా… విజ‌య్ మాల్యా, డిజిట‌ల్ ఇండియా లాంటి ఇష్యూల్ని వాడుకున్నాడు. సైబ‌ర్ క్రైమ్‌కి సంబంధించిన అంశాలు ఎంత వేడి పుట్టిస్తాయో – విశాల్ ఇంటి వ్య‌వ‌హారాలు, వ్య‌క్తి గ‌త జీవితం అంత చ‌ప్ప‌గా సాగుతాయి. క‌థానాయ‌కుడు ఆ స్థాయిలో ప్ర‌తినాయ‌కుడిపై పోరాటానికి దిగాలంటే.. ఈ మాత్రం ఎమోష‌న్‌ని చూపించాల్సిందే అని ద‌ర్శకుడు భావించి ఉంటాడు. ద్వితీయార్థంలో అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. కాక‌పోతే… డెవిల్ ఆచూకీ తెలుసుకునేంత వ‌ర‌కూ క‌థ‌కి ఊపు రాదు. ఎప్పుడైతే క‌రుణ – డెవిల్ ఎదురెదురు ప‌డ్డారో – అప్పుడు మ‌రోసారి ఉత్కంఠ‌త ప‌తాక స్థాయికి చేరుతుంది.

అక్క‌డ‌క్క‌డ కొన్ని హై పాయింట్స్‌ని ద‌ర్శ‌కుడు తెలివిగా వాడుకున్నాడు. డెవిల్ గ్యాంగ్‌ని ట్రాప్ చేయ‌డం, స‌మంత నోట్లో చిప్ పెట్ట‌డం ద్వారా – విల‌న్ స్థావ‌రాన్ని తెలుసుకోవ‌డం ఇవ‌న్నీ మంచి హై మూమెంట్స్‌.  బ‌ల‌మైన ప్ర‌తినాయ‌కుడు ఎదురైతే త‌ప్ప‌… క‌థానాయ‌కుడిలోని అసలైన హీరోయిజం బ‌య‌ట‌ప‌డ‌దు.  ప‌తాక స‌న్నివేశాల ముందు వ‌ర‌కూ… ఇదే తంతు సాహింది. ఎప్పుడైతే.. వైట్ డెవిల్ దారిలోనే క‌రుణ వెళ్లాడో.. అక్క‌డ అస‌లైన హీరోయిజం చూసే అవ‌కాశం ద‌క్కుతుంది. సైబ‌ర్ మోసాల పై ఈ స్థాయిలో ఓ క‌మర్షియ‌ల్ సినిమా రాలేదుకాక‌పోతే.. కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో కొన్ని విష‌యాలు స‌గ‌టు ప్రేక్ష‌కుడి బుర్ర‌కెక్క‌వు. అవి కూడా డిజిట‌ల్ స‌మాచారంలా గంద‌ర‌గోళంగా ఉంటాయి. ‘ఓహో. అలా జ‌రిగిందా, అయితే ఓకే’ అని స‌ర్దుకుపోవాలి.  తొలి స‌గంలో స్లో ఫేజ్‌నీ, ద్వితీయార్థంలో కాస్త గంద‌ర‌గోళాన్నీ త‌ట్టుకొంటే… ‘అభిమన్యుడు’ న‌చ్చేస్తాడు

న‌టీన‌టులు :

విశాల్ త‌న‌కు త‌గిన పాత్ర పోషించాడు. ఎక్క‌డా అన‌వ‌స‌రంగా హీరోయిజం చూపించ‌లేదు. త‌న బ‌లాల్ని మెలిగి ప్ర‌వ‌ర్తించాడు.  స‌మంత ఎప్పుడూ న‌వ్వుతూ (అవ‌స‌రానికి మించి) క‌నిపించింది. త‌న పాత్ర‌నీ బాగానే వాడుకున్నార‌ని చెప్పాలి. ఆయన నటన. ముఖ్యంగా విశాల్‌, అర్జున్‌ల మధ్య వచ్చే సన్నివేశాల్లో ఇద్దరి నటన సూపర్బ్‌. హీరోయిన్‌ సమంత రెగ్యులర్‌ కమర్షియల్ సినిమా హీరోయిన్‌ పాత్రే. పాటలు, కామెడీ సీన్స్‌ తప్ప ఆ పాత్ర గురించి పెద్దగా చెప్పుకోవటానికేం లేదు.

సాంకేతిక వ‌ర్గం :

ద‌ర్శ‌కుడు సామాన్య ప్రేక్ష‌కుడు త్వ‌ర‌గా క‌నెక్ట్ అయ్యే క‌థ‌ని ఎంచుకున్నాడు. సాంకేతిక ప‌రిజ్ఞానం గురించి అందులో జ‌రుగుతున్న మోసాల గురించీ అర్థ‌మ‌య్యేలా చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించాడు. కెమెరా వ‌ర్క్‌, ఎడిటింగ్‌లో నేర్పు బాగా ప‌నికొచ్చాడు. డైలాగులు బాగున్నాయి. ఏటీఎమ్‌కీ, ఓటు మీట‌కీ తేడా చెప్పిన డైలాగ్ క్లాప్స్ కొట్టిస్తుంది. రుబెన్‌ ఎడిటింగ్‌ చాలా షార్ప్‌గా ఉంది. సంభాషణలు అక్కడక్కడా మెరిశాయి. విజయ్‌మాల్యాకు సంబంధించిన డైలాగ్‌లు ఏటీఎం మిషన్‌కు, ఓటింగ్‌ యంత్రానికి పోలిక చెప్పే డైలాగ్‌లు ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తాయి.

బలాలు

కథా నేపథ్యం

విశాల్‌-అర్జున్‌ల మధ్య సాగే సన్నివేశాలు

ద్వితీయార్ధం

నేపథ్య సంగీతం

సినిమాటోగ్రఫి

బలహీనతలు

అక్కడక్కడా కాస్త నెమ్మదించిన కథనం

తొలి భాగంలో కొన్ని బోరింగ్‌ సీన్స్‌

రేటింగ్‌: 2.75