102 నాట్ అవుట్ మూవీ రివ్యూ
Spread the love

దత్తాత్రేయ వఖారియా (అమితాబ్‌ బచ్చన్‌) 102 ఏళ్ల యువకుడు. నిత్యం ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతుంటాడు. 102 ఏళ్లకు మించి బతికి రికార్డ్‌ సృష్టించాలనుకుంటాడు. దత్తాత్రేయకు పూర్తి విరుద్ధం అతని కొడుకు బాబూలాల్‌ (రిషీ కపూర్‌). అతనికి 75 ఏళ్లు. ఎలాంటి సంతోషం.. ఉత్సాహమూ లేకుండా నిర్లిప్తంగా జీవితాన్ని వెళ్లదీస్తుంటాడు.

కొడుకు తీరుతో తనకూ నిరుత్సాహం కలుగుతోందని బాబూలాల్‌ను వృద్ధాశ్రామంలో చేర్పించాలనుకుంటాడు దత్తాత్రేయ. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. కొడుకును తండ్రి వృద్ధాశ్రమంలో చేర్పంచడమేంటని షాక్‌ అవుతాడు బాబూలాల్‌. అలవాటైన దుప్పటి, అలవాటైన బాత్రూమ్‌.. ఇలా కొన్ని అలవాట్లు ఒక్క రోజు తారుమారవుతేనే ఆపసోపాలు పడే బాబూలాల్‌ శేష జీవితమంతా వృద్ధాశ్రమంలో గడపాలనే ఊహకే వణికిపోతాడు.

తనను ఆశ్రమానికి పంపే ఆలోచనను మానుకొమ్మని తండ్రిని బతిమాలుకుంటాడు. అయితే తాను పెట్టే అయిదు షరతులను ఒప్పుకోమంటాడు దత్తాత్రేయ. ఒప్పుకుంటాడు. ఆ అయిదు షరతులు కూడా జీవితం మీద ఆసక్తి కోల్పోయిన కొడుకును తిరిగి జీవితం పట్ల ఆకర్షితుడిని చేయడానికేనన్నమాట. నాలుగో షరతు పూర్తయ్యే సరికి ఆ విషయం బాబూలాల్‌కూ అర్థమవుతుంది. అయిదో షరతు అమెరికాలో ఉంటున్న బాబూలాల్‌ కొడుకు అమోల్‌ను ఇంటికి రానివ్వద్దని చెప్పడం ‘నీ కొడుకు కేవలం ఆస్తి కోసమే నీ దగ్గరకు వస్తున్నాడు తప్ప ప్రేమతో కాదు’’ అని వాదిస్తాడు దత్తాత్రేయ. ‘‘నేను నీలాగ కాదు.. నా ప్రేమకు షరతుల్లేవ్‌. నా కొడుకును రానివ్వకుండా చేయలేను’’ అని స్పష్టం చేస్తాడు బాబూలాల్‌. ‘‘సరే.. నా కొడుకు మీద నీ కొడుకు గెలవకుండా ఎలా చేయాలో నాకు బాగా తెలుసు’’ అనుకుంటాడు దత్తాత్రేయ.

ఆ నేపధ్యంలో

అమోల్‌.. బాబూలాల్, చంద్రికల ఏకైక సంతానం. అల్లారుముద్దుగా పెంచుకుంటారు. వాడు ఎంబీఏ చదవడానికి అమెరికా వెళ్లిపోయి అక్కడే ఉద్యోగం వెదుక్కొని, అమ్మాయినీ చూసుకొని, పెళ్లీ చేసుకొని సెటిల్‌ అయిపోతాడు. చదువుకునేటప్పుడు డబ్బు అవసరం ఉన్నప్పుడు తప్ప మిగిలిన ఏ విషయానికీ బాబూలాల్‌కు ఫోన్‌ చేయడు.. ఇంకే వివరమూ చెప్పడు. చివరకు తల్లి (బాబూలాల్‌ భార్య) అలై్జమర్స్‌తో బాధపడుతూ అన్నీ మరిచిపోయి కేవలం కొడుకు పేరును మాత్రమే వల్లిస్తూ.. వాడికోసం తపిస్తూ మరణశయ్య మీదున్నా.. చూడడానికి రాడు. లీవ్‌ దొరకలేదని తప్పించుకుంటాడు.

చనిపోయినా రాడు. కారణం లీవ్‌ లేదని. అస్తికలు కలపడానికీ రాడు.. కారణం లీవ్‌ ఇవ్వలేదని. అలా కాలం గడిచిపోతుంది. కొడుకు కోసం.. వాడి ప్రేమ కోసం.. వాడి చల్లని మాట కోసం తపిస్తూ ఉంటాడు బాబూలాల్‌. చివరకు తనే కొడుకు దగ్గరకు వెళ్దామని ‘‘నేను రానా నాన్నా’’ అని నోరువిడిచి అడిగినా.. ‘‘మేమిద్దరం బిజీ.. నువ్వు ఒక్కడివే బోర్‌ అయిపోతావ్‌. మళ్లీ ఎప్పుడైనా .. హోప్‌ యూ అండర్‌స్టాండ్‌’’ అని ఫోన్‌ పెట్టేస్తాడు, తన  ప్రతి నిస్సహాయతకు ‘‘హోప్‌ యు అండర్‌స్టాండ్‌’’ అంటుంటాడు.  కొడుకుతో గడపాలని.. వాడి పిల్లలతో ఆడాలని ఆరాటపడి.. బెంగతో కుంగిపోతుంటాడు బాబూలాల్‌. తన కళ్లముందే కొడుకు అలా కృషించిపోతుంటే దత్తాత్రేయ తండ్రి గుండె విలవిల్లాడుతుంది.

కాని అయిదో షరతు దగ్గర అలా తేడా వస్తుంది. మనవడి అసలు రూపాన్నీ కొడుకుకు చూపించాలని .. ఎప్పుడూ బిజీ అని చెప్పే మనవడికి ఫోన్‌ చేసి త్వరగా రావాలని.. ఆస్తి గురించి మాట్లాడాలని చెప్తాడు. వెంటనే వచ్చేస్తానని మనవడు అంటాడు. అలా ఆస్తి గురించే మనవడు వస్తున్నాడు తప్ప తండ్రి, తాత మీద ప్రేమతో కాదని కొడుకు దగ్గర ప్రూవ్‌ చేస్తాడు

తండ్రి జీవనశైలిని వారసత్వంగా

అమెరికా నుంచి వచ్చిన కొడుకును ఇంటికి రానివ్వకుండా ఎయిర్‌పోర్ట్‌నుంచే వెనక్కి పంపేయడమే కాదు.. ఇంకెప్పటికీ రావద్దని కరాఖండిగా చెప్పేస్తాడు బాబూలాల్‌. దత్తాత్రేయ ఆఖరి క్షణాలనూ అంతే ఆనందంగా గడిపేట్టు చూసుకుంటాడు. ‘‘నేను 102 దాటలేకపోయా.. కానీ నువ్వు ఆ రికార్డ్‌బద్దలు చేయాలని’’ కొడుకు చెప్తాడు. శ్వాస వదులుతాడు. తండ్రి జీవన శైలిని వారసత్వంగా తీసుకుంటాడు బాబూలాల్‌. దత్తాత్రేయ ఎంత ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించాడో.. తనూ అలాగే ఆస్వాదిస్తుంటాడు… తనని తాను ప్రేమించుకుంటూ.. చుట్టూ ఉన్నవాళ్లకు ప్రేమను పంచుతూ!

బంధాలు అంచిందే అనుబంధాలు చిక్కగా ఉంటే సంతోషమే. కాలం వాటిని పలుచగా అయ్యేట్టు చేసినా డీలా పడాల్సిన పనిలేదు. మనల్ని మనం ఎప్పుడూ ప్రేమించుకోవాలి! జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి… మరణం వరకూ బతకాలి.. బతుకులో మరణాన్ని వెదుక్కోకూడదు.. కష్టసుఖాల్నీ ఇష్టపడుతూ ప్రయాణం సాగించాలి 102 నాట్‌ అవుట్‌.. హోప్‌ యు అండర్‌స్టాండ్‌!

రేటింగ్: 3/5