ప్రభాస్ 20వ సినిమా టైటిల్ ‘జాన్ ‘
Spread the love

ప్రభాస్ నటిస్తున్నటువంటి భారీ యాక్షన్ సినిమా `సాహో` ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి మెజారిటీ పార్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న డార్లింగ్ ప్రభాస్ అటుపై కెరీర్ 20వ చిత్రాన్ని ప్రారంభించారు. జిల్ రాధాకృష్ణ డైరెక్షన్ లో గోపి కృష్ణ మూవీస్- యువి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి ఒక్కో అప్ డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో అంతకంతకు హీట్ పెంచుతున్నాయి. ప్రభాస్ నటిస్తున్న అద్భుత లవ్ స్టోరీ సినిమా ఇది . ఇటలీ – యూరప్ లో మెజారిటీ భాగం చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సహా ప్రముఖ తారాగణంపై ఇటలీలో కీలక సన్నివేశాల చిత్రీకరణ సాగుతోంది.

ప్రభాస్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనున్నారన్న మాటా వినిపిస్తోంది. బాహుబలి సిరీస్ లో అమరేంద్ర బాహుబలి – శివుడు పాత్రల్లో మెప్పించిన ప్రభాస్ అదే తరహా వేరియేషన్స్ ని ఈ లవ్ స్టోరీలోనూ చూపిస్తారని – పీరియాడికల్ సినిమా కాబట్టి ఇందులో రకరకాల షేడ్స్ తన పాత్రలో కనిపిస్తాయని ముచ్చటించుకుంటున్నారు. లేటెస్టుగా ప్రభాస్ 20వ సినిమా టైటిల్ కూడా లీకైంది. గత కొంత కాలంగా ఈ చిత్రానికి ఓ ఫ్రెంచ్ టైటిల్ ని నిర్ణయించారని ప్రచారం సాగింది. `అమూర్` అనేది టైటిల్. అమూర్ అంటే ఫ్రెంచిలో ప్రేమ అని అర్థం అని చెప్పుకున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి `జాన్` అనే వేరొక టైటిల్ ని ఫైనల్ చేశారన్న మాటా వినిపిస్తోంది. జాన్ అనేది తాను లవర్ ని పిలుచుకునే పిలుపు. దానినే యువిక్రియేషన్స్- గోపికృష్ణ సంస్థలు రిజిష్టర్ చేయించాయని తెలుస్తోంది. `సాహో`సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ ప్రభాస్ సరసన నటిస్తోంది. ప్రభాస్ 20లో ముంబై ముద్దుగుమ్మ పూజా హెగ్డే హీరోయిన్ . ప్రభాస్ – పూజా రొమాన్స్ ఈ లవ్ స్టోరీ సినిమాలో పతాక స్థాయిలో ఉంటుందన్న మాటా వినిపిస్తోంది. మొత్తానికి ప్రభాస్ కి తగ్గ జాన్ పూజా అని భావించవచ్చు. మనోజ్ పరమహంస కెమెరా వర్క్ అందిస్తుండగా – శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేయనున్నారు. జాతీయ అవార్డు గ్రహీత అమిత్ త్రివేది ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు.