నటన రాదని అమ్మతో చెప్పా!
Spread the love

సినిమా: నాకు నటన రాదు, వైద్య వృత్తి చేసుకుంటానని అమ్మతో చెప్పానని నటి సాయిపల్లవి తెలిపింది. ఏంటీ? మలయాళం, తెలుగు భాషల్లో సూపర్‌హిట్‌ చిత్రాలను తన ఖాతాలో వేసుకుని, తమిళంలో ధనుష్‌తో మారి–2లో నటించి అందులో రౌడీ బేబీ పాటతో యూట్యూబ్‌లో దుమ్మురేపిన  నటి సాయిపల్లవి తనకు నటన రాదు అని చెప్పడం విడ్డూరంగా లేదూ? ఇది మాత్రం నిజం. ఆ కథేంటో చూద్దాం. ప్రస్తుతం సాయిపల్లవి సూర్యతో కలిసి నటించిన చిత్రం ఎన్‌జీకే. ఇందులో మరో హీరోయిన్‌గా నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటించింది. సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 31వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా నటి సాయిపల్లవి ఆ చిత్రంలో నటించిన అనుభవాన్ని తెలుపుతూ దర్శకుడు సెల్వరాఘవన్‌ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారనుకున్నానంది. అయితే ఆయన సినీ పాఠశాలలో సులభంగా నేర్చుకోవచ్చునని 2 ,3రోజుల్లోనే అర్ధం అయ్యిదని పేర్కొంది.

సాధారణంగా షూటింగ్‌ స్పాట్‌లో సెల్‌ఫోన్లు ఉపయోగిస్తుంటామని, ఇతర చిత్రాల గురించి చర్చించుకుంటామని సెల్వరాఘవన్‌ చిత్రాల షూటింగ్‌లో నూరు శాతం అప్పుడు చిత్రీకరించబోయే సన్నివేశాల గురించి, సంభాషణల పేపర్లు పట్టుకుని తలా ఒక చోట నిలబడి రిహార్సల్స్‌ చేసుకుంటూ ఉండేవాళ్లం అని చెప్పింది. షూటింగ్‌కు ముందు రోజే సంభాషణల పేపర్లను తీసుకుని ఇంట్లో రిహార్సల్స్‌ చేసుకుని వచ్చేవాళ్లం అని, షూటింగ్‌ స్పాట్‌కు వెళ్లిన తరువాత దర్శకుడు సెల్వరాఘవన్‌ చెప్పింది విని నటిస్తే సరిపోయేదని చెప్పింది. సంభాషణలను ఎలా పలకాలి, ఎలాంటి ఆహభావాలను పలికించాలి అన్నది చాలా విపులంగా చెప్పేవారని అంది. ఏడ్చే సన్నివేశాల్లోనూ శ్వాస పీల్చడం పైకి తెలియకూడదని చెప్పి, తనకు కావలసిన నటనను రాబట్టే వరకూ వదిలి పెట్టేవారు కాదని చెప్పింది. ఇప్పటివరకూ నటన అంటే ఏమని భావిస్తూ వచ్చానో, అదంతా తప్పు అనిపించిందని పేర్కొంది. ఒక రోజు ఉదయం నుంచి, సాయంత్రం వరకూ తనకు కావలసిన నటన రాలేదు రేపు చూద్దాం అని దర్శకుడు చెప్పారని తెలిపింది. ఆ రాత్రి తనకు నటన రాలేదు, వైద్య వృత్తినే చేసుకుంటాను అని అమ్మతో చెప్పానంది. అంతే కాదు ఆ రాత్రి అంతా ఏడుస్తూనే కూర్చున్నానని చెప్పింది. తరువాత రోజు ఒకే టేక్‌లో తాను అనుకున్నది వచ్చిందని దర్శకుడు చెప్పారని తెలిపింది. అయితే తనకు నమ్మకం కలగకపోవడంతో ఏంటీ సార్‌ మా అమ్మ మీతో మాట్లాడిందా? అని అడిగా, లేదు తనకు కావలసింది వచ్చిందని చెప్పారు. ఈ విషయం గురించి సూర్యతో చెప్పగా తానూ చాలా టేకులు తీసుకుంటున్నానని చెప్పారంది. తరువాతనే తనకు ప్రశాంతత కలిగిందని చెప్పింది.