రేణు దేశాయ్ కి ఇంకో కొత్త కూతురు
Spread the love

ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండే తెలుగు జనాలకు హాట్ టాపిక్.. రేణు దేశాయ్ పెళ్లి వ్యవహారమే. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక ఏడేళ్లుగా ఒంటరిగా ఉంటున్న రేణు.. ఎట్టకేలకు తన కోసం మళ్లీ ఒక తోడును వెతుక్కుంది. తాను మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్న గత ఏడాదే సంకేతాలిచ్చిన రేణు.. ఎట్టకేలకు తనను అర్థం చేసుకునేవాడిని చూసుకుంది. ఇటీవలే ఆమె తన పిల్లలు అకీరా.. ఆద్యల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. ఐతే రేణుకు కాబోయే వాడెవరన్నది మాత్రం వెల్లడి కాలేదు. పవన్ అభిమానుల నుంచి హెచ్చరికల నేపథ్యంలోనో ఏమో.. అతడి వివరాలు వెల్లడించడానికి రేణు ఇష్టపడట్లేదు. ఐతే తనకు కాబోయే భర్త గురించి చెప్పకపోయినా.. అతడి కుటుంబానికి సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకుంది రేణు.

రేణు కాబోయే భర్తకు కూడా ఒక అమ్మాయి ఉండటం విశేషం. ఆ అమ్మాయి రేణు కూతురు ఆద్యకు స్నేహితురాలట. తన పేరు.. ఏంజెలికా. ఆద్య-ఏంజెలికా కలిసి ఉన్న ఫొటోల్ని పంచుకుంటూ వీళ్లిద్దరూ ఇప్పటిదాకా స్నేహితులని.. ఇకపై కుటుంబ సభ్యులు కాబోతున్నారని రేణు వెల్లడించింది. తద్వారా ఏంజెలికా తనకు కాబోయే భర్త కూతురని చెప్పకనే చెప్పింది. అంటే రేణుకు కూడా ఆ అమ్మాయి మరో కూతురు కాబోతోందన్నమాట. ఆ వ్యక్తి కూడా రేణు లాగే భార్యకు దూరమై తోడు కోసం చూస్తూ ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు రేణు భర్త అంటూ సోషల్ మీడియాలో ఆమెతో ఒక వ్యక్తి కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నిజానికి అందులో ఉన్నది రేణు సోదరుడని.. మూడేళ్ల ముందు అతడి పెళ్లిలో తీసిన ఫొటో అదని సమాచారం. తనకు కాబోయే భర్త ఫొటోను షేర్ చేసే ఉద్దేశం రేణుకు లేదని తెలుస్తోంది.