లైఫ్ ఇచ్చింది దక్షిణాది సినిమానే!
Spread the love

దర్శకులకే వదిలిపెట్టా: మనకు ఏం వస్తుందో అదే  చేయాలని… మనకు ఏది నప్పుతుందో అదే ప్రయత్నించాలనే మాటలు చిత్ర పరిశ్రమలో బాగా వినిపిస్తుంటాయి. కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌ మాత్రం అలాంటి మాటల్ని తానెప్పుడూ పట్టించుకోలేదని చెబుతోంది. ‘‘వచ్చిందే చేస్తానంటూ కూర్చుంటే ఎలా ఎదుగుతాం? కొత్త విషయాలు ఎలా నేర్చుకొంటాం? నేనైతే ఏదైనా చేయగలననే ఓ నమ్మకంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టా. నాకు ఎలాంటి పాత్రలు నప్పుతాయనేది దర్శకులకే వదిలిపెట్టా.

వాళ్లు సృష్టించిన పాత్రల్లో వాళ్ల ఆలోచనలకి తగ్గట్టుగా ఒదిగిపోయా. ఆ ప్రయత్నం మంచి ఫలితాల్నే ఇచ్చింది. అన్ని విషయాలూ మనకే తెలుసనుకొంటే పొరపాటు. దర్శకుల కంటే బాగా ఆలోచించేవాళ్లు ఎవరుంటారు? అందుకే కథ, కాంబినేషన్ల విషయంలో సంతృప్తి లభించగానే మరో విషయం గురించి ఆలోచించలేద” ని చెప్పుకొచ్చింది రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ప్రస్తుతం హిందీ, తమిళ భాషల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

సినీ జీవితాన్ని ప్రసాదించింది దక్షిణాది సినిమానేనని నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ అంటోంది. టాలివుడ్, కోలివుడ్‌ అంటూ మార్చిమార్చి అవకాశాలను అందుకుంటోంది. ఈ ఉత్తరాది బ్యూటీ తొలుత కోలివుడ్‌కు దిగుమతి అయినా, పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో టాలివుడ్‌లో పాగావేసింది. అక్కడ టైమ్‌ కలిసి రావడంతో వరుసగా స్టార్‌ హీరోలతో నటించింది. కాగా ఎంత వేగంగా అక్కడ ఎదిగిందో అంతే వేగంగా గ్రాఫ్‌ పడిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఖాతా ఖాళీ అయింది.

అయితే కోలీవుడ్‌ ఆదుకోవడంతో ఇంకా దక్షిణాదిలో పేరు వినిపిస్తోంది. ఇక్కడ కార్తీకి జంటగా నటించిన ‘ధీరన్‌ అధికారం ఒండ్రు’ చిత్రం మంచి విజయం సాధించి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ను కాపాడింది. ప్రస్తుతం సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో సూర్యకు జంటగా ‘ఎన్‌జీకే’ చిత్రంలో నటిస్తోంది. ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రం తరువాత మరోసారి కార్తీతో ‘దేవ్‌’ చిత్రంలో రొమాన్స్‌ చేయడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. నటుడు శివకార్తీకేయన్‌తో కూడా రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఒక చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. మొత్తం మీద కోలీవుడ్‌లో బాగానే నటిగా గ్రోత్‌ను పెంచుకుంటోంది.

అయితే పనిలో పనిగా బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడుతోంది రకుల్‌. ఈమె ఇంతకు ముందు హిందిలో నటించిన చిత్రం అయ్యారి ప్లాప్‌ అయ్యింది. తాజాగా అజయ్‌దేవ్‌గన్‌కు జంటగా ఒక చిత్రం చేస్తోంది. దీంతో అజయ్‌దేవ్‌గన్‌తో కలిసి నటిస్తానని ఊహించలేదని, అయ్యారి చిత్రం విజయం సాధించకపోవడంతో చాలా బాధ పడ్డానంది. అలాంటిది ఆ చిత్రంలో తన నటనే అజయ్‌దేవ్‌గన్‌తో కలిసి నటించే అవకాశాన్ని తెచ్చి పెట్టిందని చెప్పుకొచ్చింది. ఈ చిత్రం హిట్‌ అయి తనకు మంచి మార్కెట్‌ను తెచ్చి పెట్టినా తాను దక్షిణాది చిత్ర పరిశ్రమను మర్చిపోనని చెప్పుకొచ్చింది. ఒకవేళ హింది చిత్రాలతో బిజీ అయినా తెలుగు, తమిళం చిత్రాల్లోనూ నటిస్తానంది. తనకు మంచి జీవితాన్నిచ్చింది దక్షిణాది చిత్రపరిశ్రమనేనని రకుల్‌ప్రీత్‌సింగ్‌ పేర్కొంది.