చరణ్ ఖాతాలో మరొక మూవీ
Spread the love

రెండు సంవత్సరాలకు ఒక మూవీ చొప్పున తాపీగా పని చేయడం వంశీ పైడిపల్లి అలవాటు. అలా పది సంవత్సరాల కెరీర్ లో అతడు తీసింది ఐదారు చిత్రాలే . అందులో ఒకే ఒక్క మూవీ తప్ప అన్నీ బ్లాక్ బస్టర్లే. స్టో అండ్ స్టడీ విన్స్ ది రేస్! అన్న పద్ధతిగా ఆయన శైలి ఉంటుంది. ఇదివరకూ ఎన్టీఆర్ – రామ్ చరణ్ – ప్రభాస్ లాంటి స్టార్ల సినిమాలని డైరెక్షన్ చేశాడు పైడిపల్లి. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. మహేష్ ల్యాండ్ మార్క్ సినిమా `మహర్షి`ని హిట్ చేయడమే ధ్యేయంగా పని పెట్టుకున్నాడు . ఇటీవలే విడుదల చేసినటువంటి మహర్షి ఫస్ట్ లుక్ – టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత వంశీ పైడిపల్లి ప్లానింగ్ ఏంటి? ఏ కథానాయకుడితో మూవీ తీస్తాడు? అతడి మైండ్ లో ఎవరున్నారు? అంటే అందుకు సమాధానం వచ్చేసింది.

నిజానికి `ఎవడు` లాంటి బ్లాక్ బస్టర్ తెరకెక్కించిన వంశీ పైడిపల్లి రామ్ చరణ్ తో మరో మూవీ తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అప్పట్లో ప్రచారమైంది. కానీ ఎందుకనో ఆ ప్రాజెక్టు వీలు కాలేదు . చివరికి అదో గాసిప్ లానే మిగిలిపోయింది. కానీ ఈ సారి మాత్రం పైడిపల్లి ఆ ఛాన్స్ వదులుకునే ఆలోచనలో లేడుట. ఇప్పటికే `ఎవడు` సినిమాకి పని చేసిన హరి అనే రచయిత ఓ ఆసక్తికర లైన్ ని పైడిపల్లికి – చరణ్ కి వినిపించాడట. ఆ లైన్ ఇద్దరికీ నచ్చింది. వెంటనే డెవలప్ చేయాలని చెర్రీ ఆర్డర్స్ వేశాడట. అంటే పూర్తి స్క్రిప్టు రెడీ అయ్యి రామ్ చరణ్ కి నచ్చితే ఇక సెట్స్ పైకి తీసుకెళ్లడమే . ఎవడు లాంటి బ్లాక్ బస్టర్ ఆ ఇద్దరి నుంచి వచ్చేసింది కాబట్టి మార్కెట్ వర్గాల్లోనూ దీనిపై క్యూరియాసిటీ ఉంటుందనడంలో సందేహం ఏమాత్రం లేదు.

రామ్ చరణ్ ఓవైపు బోయపాటి డైరెక్షన్లో ఆర్ సి 12 సినిమా తెరకెక్కిస్తూనే – మరోవైపు `సైరా-నరసింహారెడ్డి` లాంటి ప్రతిష్ఠాత్మక సినిమాని నిర్మిస్తున్నాడు. ఆర్ సి 12 సంక్రాంతికి విడుదల అవుతుంది . సైరా సినిమా సమ్మర్ కి ప్లాన్ చేశారు. అంటే పైడిపల్లి స్క్రిప్టు రెడీ అయితే 2019 ఎండింగ్ లో కానీ లేదా 2020లో కానీ ఈ కాంబో సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుందన్నమాట. దీనిపై అధికారికంగా మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. ఈ క్రేజీ కాంబినేషన్ నిజరూపం దాల్చాలనే మెగా అభిమానులు కోరుకుంటున్నారు. ఆ మేరకు పైడిపల్లి ప్లానింగు ఏ విధంగా ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికి అతడి దృష్టి అంతా `మహర్షి`ని ఎలా బ్లాక్ బస్టర్ చేయాలన్నదే! అదొక్కటే టార్గెట్.