ఆమె రెమ్యూనరేషన్ 110 కోట్ల రూపాయలు
Spread the love

సౌత్ లో ఒక పెద్ద కథానాయిక రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది? నయనతార ఒక చిత్రానికి మూడు నుండి మూడున్నర కోట్ల తీసుకుంటుందని అంచనా.అదే బాలీవుడ్ విషయం తీసుకుంటే టాప్ కథానాయిక రెమ్యునరేషన్ రూ. 10 కోట్లకు అటూ ఇటుగా ఉంటుంది. ఇక బాలీవుడ్ నుండి మనం టాపిక్ ని హాలీవుడ్ కు తీసుకెళ్దాం. ఒక స్టార్ కథానాయిక రెమ్యూనరేషన్ ఎంత ఉండొచ్చు?

ఎంత ఉండొచ్చో.. అని ఊహించాల్సిన అవసరం లేదు . మర్వెల్ స్టూడియోస్ వారు తాము నిర్మిస్తున్న సినిమా కోసం కథానాయిక స్కార్లెట్ జాన్సన్ కు $15 మిలియన్స్ ఆఫర్ చేశారట. ఇది మన కరెన్సీలో దాదాపుగా రూ. 110 కోట్ల రూపాయలు అవుతుంది.ఈ విషయాన్ని కన్ఫామ్ చేస్తూ హాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఒక కథానాయికకు ఇది పెద్ద ఒప్పందం అని అంటున్నారు. స్కార్లెట్ జాన్సన్ మార్వెల్ వారు నిర్మించినటువంటి ‘అవెంజర్స్’ సీరిస్ లో తెరకెక్కిన పలు చిత్రాల్లో నటించింది. ఇక ఈ సీరీస్ లో లేటెస్ట్ సినిమా అయిన ‘ఆవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’ ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో స్కార్లెట్ జాన్సన్ ‘నటాషా రోమనోఫ్/బ్లాక్ విడో’ పాత్రలో నటించి అందరినీ మెప్పించింది. ఇప్పుడు ఈ బ్లాక్ విడో ప్రధాన పాత్రలో మార్వెల్ వారు ఒక భారీ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసమే స్కార్లెట్ కు కనీవినీ ఎరుగని మొత్తాన్ని రెమ్యునరేషన్ ను ఆఫర్ చేయడం జరిగింది.

స్కార్లెట్ రెమ్యునరేషన్ హాలీవుడ్ లో టాప్ మేల్ స్టార్స్ కు ఆఫర్ చేసే రెమ్యునరేషన్ తో సమానం. మరి కథానాయకులతో సమానంగా ప్రమాదకరమైన యాక్షన్ సీక్వెన్స్ లలో నటించడమే కాదు చిత్రాన్ని ఒంటి చేతిమీద నిలబెట్టగలిగే సత్తా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అదే రేంజ్ రెమ్యునరేషన్ వస్తుంది కదా?