అల్లుడికి మరో చాన్స్‌
Spread the love

చెన్నై : అల్లుడు ధనుష్‌కు తలైవా మరో చాన్స్‌ ఇవ్వడానికి ఫిక్సయినట్టున్నారు. రజనీకాంత్‌  ఎప్పటినుంచో రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్నారు. ఆయన అభిమానులు త్వరగా రాజకీయ పార్టీని ప్రారంభించాలని కోరుకుంటున్నారు. ఇవి రెండూ నిజమే అయినా రజనీకాంత్‌ను మాత్రం సినిమాలు వదల బొమ్మాళి వదలా! అని అంటున్నాయి. రజనీకాంత్‌కు కాలా చిత్రమే చివరిది అనే ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత పేట చిత్రం చేసేశారు. అదీ హిట్‌ అయ్యి కూర్చుంది. తాజాగా ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో దర్బార్‌ చేస్తున్నారు. నయనతార నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ముంబైలో ముమ్మరంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. తదుపరి కేఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో నటించడానికి రజనీకాంత్‌ పచ్చజెండా ఊపినట్లు ప్రచారంలో ఉంది. తాజాగా తన అల్లుడు ధనుష్‌కు మరో అవకాశం ఇవ్వాలని రజనీకాంత్‌ నిర్ణయించుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో  వైరల్‌ అవుతోంది.

నటుడు ధనుష్‌ హీరోగా బిజీగా ఉన్నారు. అయితే ఈయన తన వండర్‌బార్‌ ఫిలింస్‌ పతాకంపై నిర్మించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాకపోవడంతో, వండర్‌బార్‌ ఫిలింస్‌ నష్టాల్లో ఉందనే వదంతి ప్రచారంలో ఉంది. ఈ విషయం రజనీకాంత్‌ దృష్టికి వెళ్లడంతో అల్లుడిని నష్టాల్లోంచి బయడ పడేసేందుకు ఆయన సంస్థలో ఒక చిత్రం చేయాలని నిర్ణయించుకున్నట్లు తాజాగా టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. ధనుష్‌ ఇంతకుముందు తన మామ రజనీకాంత్‌ హీరోగా కాలా చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర సక్సెస్‌ వారి అంచనాలను రీచ్‌ కాలేదనే టాక్‌ ప్రచారంలో ఉంది. దీంతో వండర్‌బార్‌ ఫిలింస్‌ సంస్థకు రజనీకాంత్‌ మరో చాన్స్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తాజా సమాచారం. దీనికి పేట చిత్రం ఫేమ్‌ కార్తీక్‌సుబ్బరాజ్‌ను దర్శకుడిగా ఎంపిక చేయాలని ధనుష్‌ భావిస్తున్నారు. కార్తీక్‌సుబ్బరాజ్‌ ధనుష్‌ హీరోగా ఒక చిత్రం చేయనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అయితే రజనీకాంత్, కార్తీక్‌సుబ్బరాజ్‌ల కాంబినేషన్‌లో చిత్రం చేయడానికి ధనుష్‌ సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం దర్బార్‌ 2020 ప్రథమార్థంలో తెరపైకి వచ్చే అవకాశం ఉంది. దీంతో రజనీకాంత్‌ వండర్‌బార్‌ ఫిలింస్‌ సంస్థలో నటించే చిత్రం ఈ ఏడాది చివర్లో గానీ, వచ్చే ఏడాది మొదట్లోగానీ సెట్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.