ధియేటర్ లో పక్కన వారు చేసిన నీచమైన కామెంట్స్ కు ఏడ్చిన : హరితేజ
Spread the love

సీరియల్స్‌, సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి హరితేజ.బిగ్ బాస్ తెలుగు తొలి సీజన్లో పాల్గొనడం ద్వారా పాపులర్ సెలబ్రిటీ అయిపోయారు. ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా ఉన్న ఆమె ఇటీవల హైదరాబాద్‌లో ‘మహానటి’ సినిమా చూసేందుకు కుటుంబంతో కలిసి ఓ థియేటర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఓ సంఘటన తనను చాలా బాధేసిందని, తోటి ఆడవాళ్లు తమ గురించి చాలా నీచంగా మాట్లాడారని, ఆమె అన్న మాటలకు తన కోపం కట్టలు తెంచుకుందని, ఆమెతో గొడవ పెట్టుకున్నాను అని హరితేజ వెల్లడించారు. ఆ సంఘటన గురించి వెల్లడిస్తూ వీడియో రిలీజ్ చేశారు.
సినిమాలో పాత్రలు పోషించే వారు కేవలం పేమెంట్ తీసుకుని, ఏదో చేసేద్దామని టైమ్ పాస్ కోసం చేయరు. ఆ పాత్ర కోసం ప్రాణం పెట్టి, ఆ పాత్ర బాగా చేయాలని ప్రతి రోజూ రాత్రి కలలు కని మిమ్మల్ని అందరినీ ఆ పాత్ర మెప్పించాలని ఇష్టంతో, తపనతో చేస్తారు. ఇందులో మా స్వార్థం మీ అభినందనలు పొందాలనే తప్ప అంతకు మించి ఏమీ ఉండదు. అదే సమయంలో మేము ప్రేక్షకుల నుండి, సమాజం నుండి రెస్పెక్ట్ కూడా కోరుకుంటాం. కానీ సమాజంలో కొందరు ‘సినిమా వాళ్లు’ అనే పేరుతో మా పట్ల చాలా నీచంగా మాట్లాడటం చాలా బాధేస్తుంది అంటూ హరితేజ ఆవేదన వ్యక్తం చేశారు.

దేవుడి దయ వల్ల నా చేతిలో మంచి ఆఫర్స్ ఉన్నాయి. మంచి జీవితం ఉంది. సినిమాల్లో కంటే ముందు సీరియల్స్ చేసి ఇక్కడి వరకు చేరుకున్నాను. ఈ ప్రయాణంలో కష్టం, సుఖం, బాధ, ఏడుపు, ఆకలి, భయం అన్ని చూశాను. నాకు నా పని అంటే గౌరవం ఉంది, రెస్పెక్ట్ ఉంది. చాలా ఇష్టంతో డిగ్నిఫైడ్ గా ఈ పని చేస్తున్నాను అని హరితేజ తెలిపారు.
కొందరు ఇష్టమొచ్చినట్లు సినిమా వాళ్ల గురించి మాట్లాడటం, వారిని క్యారెక్టర్‌లెస్ మనుసుల్లా చూడటం, దూషించడం చూశాను. ఒక వంద రూపాయలు పెట్టి సినిమా చూసి, ఆ సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్టును కొనేశాము, వారంతా మా ప్రాపర్టీ అనే విధంగా కొందరు ఫీలవ్వడం నాకు భరించ లేనంత బాధ కలిగించింది. ఈ దు:ఖం వెనక ఉన్న ఓ చిన్న సంఘటన చెప్పాలనుకుంటున్నాను… మహానటి సినిమా చూడటానికి వెళ్లిన సమయంలో జరిగిన గొడవ గురించి హరితేజ తెలిపారు.

ఇటీవల అమ్మా, నాన్న, నేను, చెల్లి అంతా కలిసి ‘మహానటి’ చూడటానికి ఒక థియేటర్ కు వెళ్లాము. ఇంటర్వెల్ వరకు చెల్లిపక్కన కూర్చున్నాను. తర్వాత అమ్మ అడగటంతో ఆమె పక్కన వెళ్లి కూర్చున్నాను. నేను అమ్మ వైపుకు వెళుతున్న తరుణంలో నాన్నను ఇటు వైపుకు షిప్ట్ చేయాల్సి వచ్చింది. అపుడు ఇటు వైపు ఉన్న ఒక తల్లీకూతుళ్లు నాతో వాదనకు దిగారు. ‘ఇంతకు ముందు కూర్చున్నారు కదమ్మా… అలాగే కూర్చోండి, మీ నాన్న పక్కన కూర్చునేందుకు నా కూతురు కంఫర్టబుల్‌గా లేదు అని చెప్పారు. నేను వెంటనే ఏమీ అనలేదు…. తప్పేంటి ఆంటీ తండ్రే కదా? అందరూ ఒకలా ఉండరు అని అన్నాను. అప్పటికే నాన్న, చెల్లి ఎందుకు డిస్క్రషన్ అంటూ వారు సీట్లు మారుతున్నారు. ఆ సమయంలో ఆవిడ “మీరైతే సినిమా వాళ్లమ్మా… ఎవరి పక్కనైనా కూర్చుంటారు, మాకు ఆ దరిద్రం పట్టలేదన్నారు” అని ఆమె అనడంతో నాకు కట్టలు తెంచుకునే కోపం వచ్చింది. ఆపుకోవడం నా వల్ల కాలేదు. ఆ మాటను భరించలేక పోయాను. అక్కడి నుండి డిస్క్రషన్ మొదలై చాలా దూరం వెళ్లింది. కోపంతో ఆమెపై అరిచాను. ఒక మూమెంటులో ఏడుపు కూడా వచ్చింది…. అని హరితేజ తెలిపారు.

సినిమా పరిశ్రమలో ఉన్న ఆడపిల్లలు వేరే, బయట ఉన్న ఆడపిల్లలు వేరే… ఇలా మాట్లాడటం మానండి. మేమందరం కూడా ఆడపిల్లలమే. మేమంతా కూడా సాంప్రదాయమైన కుటుంబం నుండి వచ్చిన వాళ్లమే. మాకు అందరికీ బాధ ఉంటుంది. ఇష్టం వచ్చినట్లు అలాంటి కామెంట్లు చేయవద్దు. అపుడే మీ జీవితాలు, మా జీవితాలు బావుంటాయని నా ఫీలింగ్. నేను ఇంత చెప్పిన తర్వాత కూడా దీని గురించి రకరకాలుగా మాట్లాడేవారిని నేనేం చేయలేను, వారికి నేను ఏమీ చెప్పలేను. వారికి మంచి బుద్ది జ్ఞానం కలిగించాలని దేవుడిని కోరుకోవడం తప్ప…. అని హరితేజ వ్యాఖ్యానించారు.